logo

ఏది కుట్ర.. ఎవరిది అరాచకం

ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్‌ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు.

Published : 07 May 2024 03:07 IST

తిరుపతిలో అధికారపార్టీ కలవరపాటు
దొంగే దొంగ అన్నట్లు విమర్శలు

న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక): ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్‌ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు. అయితే ఈ ఐదేళ్లలో అధికార పార్టీ అరాచకాలకు చిరునామాగా మార్చివేశారన్నది బహిరంగ రహస్యం. అయితే అదే అధికార పార్టీ నేతలు రౌడీలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు అనే పదాలు వల్లెవేయడంపై ఇప్పుడు పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లు కుట్రల మీద కుట్రలు, దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించి నగరాన్ని గుప్పిట పట్టిన తండ్రీకుమారులు ప్రస్తుతం ఎదుటివారిని చూసి దొంగే దొంగ అన్నట్లు ఉంది.. ప్రత్యర్థులే తమపై కుట్రలు చేస్తున్నారని, రౌడీయిజం చేస్తున్నారని, ఇతర ప్రాంతాల వారంటూ ఆందోళన వ్యక్తం చేయడం చూసి నగరవాసులు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.

కుట్రల్లో మచ్చుకు కొన్ని

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక తిరుపతి చరిత్రలో ఓతరం మరిచిపోలేని అసాధారణ ఎన్నికలు. అధికారులను, ఉద్యోగులను ఏమార్చి దొంగ ఓటరు కార్డులు సృష్టించి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి బస్సుల్లో వేలాదిమంది బోగస్‌ ఓటర్లను వందలాది బస్సుల్లో తరలించి ఓట్లు వేయించిన వ్యవహారం జాతీయస్థాయిలో తిరుపతి పరువుతీసింది. చివరకు వారిచేతిలో పావులుగా మారిన 22 మంది ఉన్నతస్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు బలైన విషయం విదితమే. తిరుపతి కేంద్రంగా జరిగిన ఇది కుట్ర కాదా? తిరుపతి నగరపాలక సంస్థ హోదా పొందిన తరువాత తొలిసారి ఎన్నికలు జరిగిన తీరు తిరుపతి ఓటర్లందరికీ ఎరుకే. అధికారపార్టీయేతరులను అపహరించడం, వారి నామినేషన్లు చించివేయడం, బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవం చేసుకోవడం వంటి అరాచకాలు తెలియని నగరవాసులున్నారా? ప్రస్తుత వైకాపా అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి పోటీచేసిన డివిజన్‌లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన తెదేపా, ఇతర పార్టీల అభ్యర్థులను కనీసం నామినేషన్ల స్వీకరణ కేంద్రం మెట్లు తొక్కకుండా ప్రహరీ ముందు నుంచే పంపివేయడం వంటి కుట్రలను చూసి రాజకీయ ఉద్ధండులు సైతం అప్పట్లో విస్తుపోవాల్సి వచ్చింది.

ఎమ్మెల్సీ, టౌన్‌ బ్యాంకు ఎన్నికలు పరాకాష్ఠ

గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అరాచకానికి పరాకాష్ఠ. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా చేయవచ్చా.. అని ఆయావర్గాలు విస్తుపోవాల్సి వచ్చింది. ఓనామాలు రానివారు కూడా పట్టభద్రులుగా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరడం, ఆటో డ్రైవర్లు ఉపాధ్యాయులుగా నమోదు కావడం, ఒక్కో కార్పొరేటర్‌కు దొంగ ఓట్ల లక్ష్యం ఇచ్చి నమోదు చేయించిన వైనంపై అప్పట్లో పెద్దఎత్తున ట్రోల్‌ అయ్యింది. నకిలీ ఉపాధ్యాయులను, పట్టభద్రులను గుర్తించి ఓటు వేయనీయకుండా అభ్యంతరం చెప్పిన ఎన్నికల అధికారులపై దౌర్జన్యం చేయడం వంటి ఘటనలు సరేసరి.

తిరుపతి టౌన్‌ బ్యాంకు ఎన్నికల్లో సిరా చుక్కల అవసరమే లేకుండా వాటాదారులైన ఓటర్లకే తెలియకుండా ఎన్నికలను దిగ్విజయంగా పూర్తిచేసిన వైనం విదితమే. పోలీసులు, అధికారులు సాక్షిగా సాగిన తిరుపతి టౌన్‌ బ్యాంకు ఎన్నికల దందాలో కుట్రకోణం లేదా.. అనే ప్రశ్నకు సమాధానం వారే చెప్పాల్సి ఉంటుంది.

అధికార పార్టీలో ఎందుకీ ఆందోళన

స్థానికేతరుడు తిరుపతి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును ప్రకటించడంతో గెలుపు తమదే అని తొలుత భావించిన అధికార పార్టీ నేతల్లో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కలవరం పెరిగింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన బాలారిష్టాలు దాటి తెదేపా, భాజపా, జనసేన నేతల నుంచి సంపూర్ణ సహకారం సాధించడంతో అధికారపార్టీ అంచనాలు తారుమారయ్యాయి. అతితక్కువ సమయంలోనే జనసేన పార్టీ పుంజుకోవడంతో అధికార పార్టీలో వణుకుమొదలైంది. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, రౌడీలంటూ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే కుట్రగా కూటమి గుర్తించింది. అందుకు అనుగుణంగా ఎదురుదాడి చేస్తూ విమర్శల్ని తిప్పికొడుతుండటంతో రోజుకో ఎత్తుగడను తెరమీదికి తెస్తుండగా.. కూటమి తరఫున ఎత్తుకు పైఎత్తులు వేస్తూ దీటుగా నిలబడుతుండటంతో అధికారపార్టీలో ఆందోళన మొదలైందని, అందుకే నోటికి పనిచెబుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని