logo

నా అంటూ వల్లించి.. వంచించి

నా ఎస్సీలు, నా ఎస్టీలని సీఎం జగన్‌ బహిరంగ సభల్లో గొప్పగా ఊదరగొడుతుంటారు. అయితే అదంతా ధృతరాష్ట్ర ప్రేమ అని ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

Published : 07 May 2024 03:11 IST

ఎస్సీ, ఎస్టీలకు అందని ఉప ప్రణాళిక
నవరత్నాలకు నిధుల మళ్లింపు
వైకాపా పాలనలో సబ్‌ప్లాన్‌ నిర్వీర్యం

నా ఎస్సీలు, నా ఎస్టీలని సీఎం జగన్‌ బహిరంగ సభల్లో గొప్పగా ఊదరగొడుతుంటారు. అయితే అదంతా ధృతరాష్ట్ర ప్రేమ అని ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. దళిత, గిరిజనులను సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా అభివృద్ధి చేయాలనే ఉన్నత లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను జగన్‌రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎస్సీ, ఎస్టీల కోసమే ఖర్చు చేయాల్సిన నిధులను నవరత్నాలకు మళ్లించి వారికి తీరని ద్రోహం చేసింది. ఏటా  బడ్జెట్‌లో సబ్‌ ప్లాన్‌కు అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పుకొన్న రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలతో కల్లబొల్లి కబుర్లు చెప్పి అమాయకులైన దళిత, గిరిజనులను నమ్మిస్తోంది. ఉప ప్రణాళిక చట్టం అమలుకు కేటాయించిన పదేళ్ల గడువు గత ఏడాదితో ముగియడంతో మరో పదేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెప్పేదంతా ఘనం, చేసేది శూన్యం అన్న చందంగా వైకాపా పాలన సాగింది.

న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ), పుత్తూరు, ఐరాల

జాడలేని అభివృద్ధి..

తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల ద్వారా దళిత, గిరిజన ఆవాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీరోడ్లు, శ్మశానవాటికల అభివృద్ధి, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, కాలువల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, తాగునీటి వసతి కల్పన, నిరుద్యోగుల స్వయం ఉపాధి కల్పనకు రాయితీ రుణాల మంజూరు తదితరాలు అమలు చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఇలాంటి పనులు ఎక్కడా చేపట్టలేదు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు లేదా ఇతరులున్న చోట ఎస్సీ, ఎస్టీలుంటే అలాంటి ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేయాలని ఉపప్రణాళిక చట్టం స్పష్టంగా చెబుతున్నా నిబంధనలు తుంగలో తొక్కి ఇస్టానుసారంగా నిధులు దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారు.

స్వయం ఉపాధి రుణాలకు మోకాలడ్డు..

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులంటే కచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలకు కోసం ఖర్చు చేయాలి. ఎస్సీ కాలనీలు, గిరిజన తాండాల్లో మౌలిక వసతులు కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించి 30 శాతం నిధులు కేటాయించడం ద్వారా వారి జీవనోపాధులను పెంపొందించాలి. అలాంటి చర్యలు ఏమీ చేపట్టకపోగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎస్సీ ఆర్థిక సంస్థ, గిరిజ ఆర్థిక సంస్థ ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలొడ్డింది.

ఉన్న పథకాలు రద్దు..

ఉప ప్రణాళిక ద్వారా దళిత, గిరిజనుల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమలు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌(బాస్‌) పథకాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. భూమి లేని పేదలకు భూమి కొనుగోలు చేసి ఇచ్చే పథకాన్ని నిర్వీర్యం చేసింది. విదేశీ విద్యా పథకాన్ని మరుగున పెట్టి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తెరపైకి తెచ్చి నిబంధనల పేరుతో ఎవరికీ కొరగాకుండా చేసింది. కల్యాణమస్తు పథకానిదీ ఇదే తీరు. ఎస్సీ కార్పొరేషన్‌ను నిధులు లేక నిర్వీర్యం చేసింది.

గత ప్రభుత్వంలో ఉప ప్రణాళిక నిధులతో వేసిన వి.ఎస్‌.ఎస్‌ పురం రోడ్డు(పుత్తూరు మండలం)

కాకి లెక్కలు..

వైకాపా అధికారంలోని వచ్చాక ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను రూ.54,652 కోట్లు ఖర్చు చేసినట్లు కాకి లెక్కలు చెబుతోంది. సబ్‌ ప్లాన్‌ ద్వారా ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించారు. వాటి ద్వారా ఏ పనులకు, ఎవరికి ఎంత మంజూరు చేశారు అనే కచ్చితమైన లెక్కలు చూపకుండా గోప్యతను పాటిస్తున్నారు. వాస్తవానికి లెక్కల్లో చూపుతున్న మొత్తంలో 90 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీలకే కాకుండా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే ఇతర పథకాలకు మళ్లించారు. సబ్‌ ఫ్లాన్‌ నిధులను ఇతరులకు ఖర్చు చేస్తూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఖాతాలో వేసి లెక్క చూపుతున్నారు.


నిధుల జాడ లేదు..

దళితులను ఆదుకుంటుందనుకున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల జాడ లేదు. ఏటా బడ్జెట్‌లో సబ్‌ ప్లాన్‌కు నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించడం తప్ప ఆపై ఆ నిధులు ఎలా వెళ్లాయో, ఎవరికి ఖర్చు చేశారో తెలియడం లేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ప్రణాళిక పూర్తిగా కనుమరుగైంది.

జ్యోతి, తెల్లగుండ్లపల్లి, ఐరాల మండలం


ఎస్సీ, ఎస్టీల పేరు చెప్పి అందరికీ ఖర్చు చేయడం దారుణం..

పేరేమో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక. నిధులు ఖర్చు చేసేది అన్ని వర్గాలకు. అలాంటప్పుడు జనరల్‌ సబ్‌ ప్లాన్‌ అని పేరుపెట్టాలి. దళిత, గిరిజనుల పేరు చెప్పి మోసం చేయడమెందుకు. ఇతర పథకాలకు సబ్‌ ప్లాన్‌ నిధులు మళ్లించడం నిబంధనలకు విరుద్ధం. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉప ప్రణాళిక నిధులను ఏ శాఖ ద్వారా ఏ పథకానికి ఖర్చు చేశారనేది శ్వేతపత్రం విడుదల చేయాలి.

ఈశ్వర్‌, నెల్లిమందలపల్లి, ఐరాల మండలం


పూర్తిగా మర్చిపోయారు..

ఉప ప్రణాళిక నిధులున్నాయని, వాటితో ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు అభివృద్ధి చెందుతాయన్న విషయాన్నే ఎస్సీ, ఎస్టీలు మర్చిపోయారు. నిధుల ప్రకటన తప్ప, ఆ నిధులు ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారో, ఎక్కడ అభివృద్ధి చేశారో ఎవరికీ తెలియదు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఉపప్రణాళిక పూర్తిగా కనుమరుగైంది.

వెంకటేష్‌, నందిమంగళం, పుత్తూరు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని