logo

జడ్పీ పూర్వ ఉన్నతాధికారిపై కలెక్టర్‌ ఆగ్రహం

ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించే కేంద్రంలో జడ్పీ పూర్వ ఉన్నతాధికారి ఉండటంపై తెదేపా శ్రేణులు కలెక్టర్‌ షన్మోహన్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 08 May 2024 05:36 IST

ఎన్నికల విధులకు వద్దన్నా అక్కడే..!

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించే కేంద్రంలో జడ్పీ పూర్వ ఉన్నతాధికారి ఉండటంపై తెదేపా శ్రేణులు కలెక్టర్‌ షన్మోహన్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతర జిల్లాలో ఓటు కల్గి.. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కలెక్టరేట్‌లో ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చంద్రగిరి ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఓటుహక్కు వినియోగానికి కలెక్టరేట్‌లోని ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో కౌంటర్‌ ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో జడ్పీ పూర్వ ఉన్నతాధికారి ఉండటంపై తెదేపా శ్రేణులు ఫిర్యాదు చేశాయి. సదరు పూర్వ అధికారి పాతికేళ్లుగా ఇక్కడే ఉండటం, తనకు జిల్లాకు చెందిన ‘పెద్ద’మంత్రి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొంటూ జిల్లా అధికారుల వద్ద నానా హడావుడి చేస్తున్న నేపథ్యంలో ఆయనపై తెదేపా జిల్లా నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జడ్పీ ఉద్యోగులను తీవ్ర ప్రభావం చేయనున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా బదిలీ విషయంలో ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చి జిల్లాలో ఎక్కడా ఎన్నికల విధుల్లో కానీ, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇవన్నీ ఖాతరు చేయక ఆయన కొద్దిరోజులుగా కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఉన్న ఎన్నికల కేంద్రంలో.. ఇంకా పలుచోట్ల పాల్గొంటున్నారు. తాజాగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ రోజున కమాండ్‌ కంట్రోల్‌ రూములో ఆయన ఉండటం సర్వత్రా ఆరోపణలకు దారితీసింది. తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో సదరు పూర్వ అధికారిపై.. కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే ఆయన్ను అక్కడి నుంచి పంపేయాలని పూర్వ అధికారితో సన్నిహితంగా ఉండే మరో ఉన్నతాధికారిని కలెక్టర్‌ ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. సన్నిహిత అధికారి సూచనతో ఆ పూర్వ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు