logo

ధరణి.. కాజేసే ధోరణి

చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు.

Updated : 08 May 2024 07:18 IST

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం చూసి బెంబేలెత్తుతోన్న పేదలు  
న్యాయం జరగాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..
లేదంటే అప్పులు చేయాల్సిందే  

చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు. రెండు ఎకరాలు ఆక్రమించి చదును చేస్తుండటంతో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది అక్కడకు రాగా వారినే బెదిరించే ప్రయత్నం చేశారు. యాజమాన్య హక్కు చట్టం ప్రకారం ఇక్కడ ఒకవేళ అధికారులు కబ్జాదారుడికి వంతపాడితే రూ.6 కోట్ల విలువైన భూమిపై ప్రభుత్వమే హక్కులు వదులకోవాల్సి ఉంటుంది.


చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన బాలగురునాథానికి చెందిన రూ.10 కోట్ల విలువైన 5.5 ఎకరాల భూమిని యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినేజర్‌, పూపతమ్మ పేరిట ఎలాంటి లింక్‌ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇలా చిత్తూరు నగరంలో ఏకంగా రూ.58కోట్ల విలువైన ఎనిమిది స్థలాలను కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ అంశంపై 2022లో గతంలో చిత్తూరు తహసీల్దారుగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధరగుప్తా, వేపంజేరి, నందలూరు, ఇరువారం వీఆర్వోలు ధనంజయ, శివనారాయణ, బాబును అరెస్టు చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టం ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్వో) సహకరిస్తే బాలగురునాథం భూమి కోసం ఎంతో వ్యయప్రయాసలు పడాల్సిందే.


సోమల మండలంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. మొత్తం నాలుగు ఎకరాలు తనకే చెందుతుందంటూ రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి తమ్ముడు తన పేరిటే 1-బీ, పాస్‌ పుస్తకం పొందారు. బెంగళూరులో ఉన్న సోదరుడికి నాలుగేళ్ల తర్వాత వాస్తవం తెలిసింది. ఇప్పటికీ ఆయన తనకు రెండు ఎకరాలు చెందుతుందని పోరాడుతూనే ఉన్నారు. సివిల్‌ కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. అదే ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అమలులోకి వచ్చి ఉంటే అన్న నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సిందే.


ఈనాడు, చిత్తూరు: సీఎం జగన్‌ తనను పదేపదే రైతు బాంధవుడినని, పేదల పెన్నిధినని అభివర్ణించుకుంటున్నారు. అన్నదాతలకు తాను చేసినంత మేలు ఎవరూ చేయలేదని గొప్పలు పోతారు. ఐదేళ్ల పాలనలో అందిన కాడికి ప్రకృతి వనరులను దోచుకున్న ఆయన ఆరగించడానికి ఇంకేమీ లేవని ప్రైవేటు వ్యక్తుల భూములు, ఆస్తులపై పడ్డారు. ఈ దోపిడీ పర్వాన్ని చట్టబద్ధం చేసేందుకే ఏపీ భూ యాజమాన్య హక్కును తీసుకొచ్చారు. చిన్న, సన్నకారు రైతుల భూములను కొట్టేయాలన్నది సీఎం జగన్‌ వ్యూహమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఎన్ని విమర్శలొచ్చినా ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోబోమని జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో సెలవివ్వడం గమనార్హం.

జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందు ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే 140- 160 ఫిర్యాదుల్లో 80 శాతం భూములకు సంబంధించినవే. తనకు తెలియకుండా పాస్‌ పుస్తకం చేసుకున్నారని, ఆన్‌లైన్‌లో వివరాలు ఎక్కించుకున్నారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని పేదలు గోడు వెళ్లబోసుకునేవారు. వీటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని  కలెక్టర్‌ ఆదేశించేవారు. ఎంతకీ వివాదం తెగకుంటే కొందరు సివిల్‌ కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందేవారు. కొంత ఆలస్యమైనా తమ ఆస్తి తమకే వస్తుందని యజమానులకు ఆశ ఉండేది. జగన్‌ తీసుకువచ్చిన యాజమాన్య హక్కు చట్టంతో పేదలకు న్యాయం జరగాలంటే వారి శక్తికి మించి ఖర్చు చేయాల్సిందే. ఈక్రమంలో వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోవాల్సిందే.

తండ్రి ఆస్తి వారసులకు రాకుండా కొర్రీలు

జిల్లాలో తొలి నుంచీ తండ్రి వారసత్వంగా వచ్చిన భూమి ఎవరెవరికి ఎంతెంత వాటా రావాలనే విషయంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికైనా బలమున్నా, నాయకుల అండ ఉన్నా సులభంగా ఆ వ్యక్తి తన పేరిట టైటిల్‌ రిజిస్టర్‌లో భూమిని ఎక్కించుకోవచ్చు. తండ్రి మరణిస్తే భూమిని పొందేందుకు వారసులూ ఇబ్బంది పడొచ్చు. చిత్తూరు నగరంలో రెండేళ్ల కిందట ఒక వ్యక్తి.. మరణించిన ఒకరికి తానే వారసుడినంటూ రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువపత్రం పొందాడు. దాన్ని అడ్డుపెట్టుకుని అసలైన వ్యక్తికి బదులు తానే భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దీంతో నిజమైన వారసుడు న్యాయం కోసం హైకోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ః పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణానికి బ్యాంకులో అప్పు తీసుకుందామనో, ఇతరులకు అమ్ముదామని వెళ్లినప్పుడు మాత్రమే మన భూముల గురించి ఆలోచిస్తాం. వైకాపా నేతలు ఎవరైనా వీటిని వారి పేరిట మార్చుకుంటే ఇలాంటి సందర్భంలో చూసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. అప్పుడు న్యాయం చేయాలని సివిల్‌ కోర్టులకు వెళ్లడం కుదరదు. నేరుగా హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేసుకోవాలి. చిన్న, సన్నకారు రైతు మారుమూల ఉన్న కుప్పం, చిత్తూరు నుంచి అమరావతిలోని హైకోర్టుకు వాయిదాల కోసం తిరుగుతూనే ఉండాలి. అక్కడి న్యాయవాదులకు వాయిదాకు వాయిదాకు వేల రూపాయలు చెల్లించాలి.


హక్కులకు భంగం కలిగించే చట్టం
- శివకుమార్‌, విశ్రాంత తహసీల్దారు, చిత్తూరు

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం.. రైతులు, భూ యజమానుల హక్కులకు భంగం కలిగించే చట్టం. భూములకు రక్షణ ఉండదు. పూర్తిగా హక్కులు పొందుతామనే అవకాశం లేదు. హక్కులో కోల్పోయి నష్టపోవడమే తప్ప లాభం లేదు. టీఆర్‌వో రూపొందించే రికార్డు సరైన ప్రామాణికం కాదు.ఈ చట్టాన్ని పునఃపరిశీలించి సవరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు