logo

అమాత్యుడి అండ.. అవినీతి దందా..!

కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. స్థానికంగా అధికార పార్టీ నాయకుడి అండ దండలు పుష్కలంగా ఉండటంతో.. కొందరు అధికారులు, సిబ్బందికి ఆడిందే ఆటగా మారింది.

Published : 08 May 2024 05:52 IST

ప్రతి రిజిస్ట్రేషన్‌కూ లంచం ఇచ్చుకోవాల్సిందే..!!
కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆడిందే ఆట
ఏసీబీ దాడులతో హడలిపోయిన సిబ్బంది

కుప్పం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

కుప్పం, న్యూస్‌టుడే: కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. స్థానికంగా అధికార పార్టీ నాయకుడి అండ దండలు పుష్కలంగా ఉండటంతో.. కొందరు అధికారులు, సిబ్బందికి ఆడిందే ఆటగా మారింది. జగన్‌ పాలన పుణ్యమాని అమాంతం పెరిగిన రిజిస్ట్రేషన్ల రుసుం భారాన్ని మోస్తున్న ప్రజలకు లంచం అదనపు భారంగా మారింది.

ప్రతి దస్తావేజుకూ..

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భూములు, ఇళ్లు, భవనాలు, వాణిజ్య స్థలాలకు విపరీతమైన డిమాండు.  ప్రతి రోజూ సగటున 40- 50 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. గరిష్టంగా వంద దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ జరిగిన రోజులున్నాయి. అవసరాన్ని ఆసరాగా మలుచుకున్న కొందరు అధికారులు ప్రతి రిజిస్ట్రేషన్‌కూ పర్సంటేజీ తీసుకుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో లావాదేవీకి రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చుకోవాల్సి వస్తుంది. తద్వారా రోజు రూ. లక్షల్లో ఆదాయం ఉంటుందని స్పష్టమవుతోంది. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు కనీసం రూ. 3 వేలు వేసుకున్నా..రూ. లక్షకు పైబడి అక్రమ సంపాదన సాకారమవుతున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం లేనిదే అధికారి ఇంటికెళ్లడం లేదని సిబ్బందే అంటున్నారు.

తాజాగా.. ఏసీబీకి పట్టుబడి..

కుప్పం మండలంలో వాణి అనే మహిళ కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ కోసం రూ.25 వేలు లంచం తీసుకొంటూ.. ఇద్దరు అధికారులు ఓ మధ్యవర్తి ఏసీబీకి పట్టుబడ్డారు. అధికారుల సూచన మేరకు నగదు తీసుకున్నట్లు సదరు మధ్యవర్తి ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడించడం ఇక్కడి అవినీతి, దళారీ వ్యవస్థకు నిదర్శనం.


డబ్బులిస్తే.. చనిపోయిన వారి పేరిట రిజిస్ట్రేషన్‌: తమిళనాడుకు చెందిన ఓ మహిళ పేరున గుడుపల్లె మండలం నలగాంపల్లె ఇల్లు, ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్‌ అయింది. ఆమె చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువపత్రంతో ఆస్తిని మరొకరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఘటన ఏడాది కిందట జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో బాధిత అధికారి, మధ్యవర్తిపై కేసు నమోదు చేశారు.


  • శాంతిపురంలో మూడు నెలల కిందట ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 50 వేల చలానా కట్టారు. కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ. 5 వేలు లంచం ఇచ్చి.. స్థలం రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

  • గుడుపల్లె మండలంలోని నలగాంపల్లె వద్ద వాణిజ్య భవనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి.. రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 20 వేలు మధ్యవర్తి ద్వారా అధికారులకు సమర్పించుకున్నారు.

పెద్దాయనకు వాటా..!

ఇలా వచ్చిన అక్రమ సంపాదనలో అధికార పార్టీకి చెందిన నేతకు ప్రతి నెలా వాటా వెళ్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు జరిగినా, జరగకపోయినా నెలకు రూ. లక్ష వరకు ముడుపులు ఇవ్వాల్సిందేనని సమాచారం. రిజిస్ట్రేషన్లకు ఇష్టారాజ్యంగా వసూళ్ల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్రమానికి అడ్డుకట్ట పడటం లేదు. కార్యాలయంలో అక్రమాలు, అవినీతిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు క్షణాల్లో వాలిపోయి బాధితులను భయపెట్టిన ఘటనలు లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు