logo

నయనానందం

దాతల సహకారంతో రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకపై అత్యాధునిక పద్ధతిలో మెరుగైన నేత్ర పరీక్షలు, శస్త్రచికిత్సలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆంధ్రా

Published : 02 Jul 2022 03:33 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

ఫ్యాకో యంత్రంతో శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడు

పరికరం: ఫ్యాకో శస్త్రచికిత్సల యంత్రం
విలువ: రూ.18 లక్షలు

దాతల సహకారంతో రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకపై అత్యాధునిక పద్ధతిలో మెరుగైన నేత్ర పరీక్షలు, శస్త్రచికిత్సలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు సహకారంతో ఫ్యాకో యంత్రాన్ని ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.  

రోగులకు ఇదీ ప్రయోజనం
ఇప్పటివరకు కాటరాక్టు సంబంధించి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు సుమారు 70-80 వరకు శస్త్రచికిత్సలు చేసేవారు. కొత్త యంత్రంపై రోజుకు 20 వరకు శస్త్రచికిత్సలు చేయవచ్చని చెబుతున్నారు. ఇలాంటి యంత్రం ఉమ్మడి జిల్లాలోని కాకినాడ జీజీహెచ్‌లో మినహా మరే ప్రభుత్వ ఆసుపత్రిలో లేదు. కార్పొరేటు ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సకు సుమారు రూ.30-50 వేల వరకు వసూలు చేస్తారు. అది ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నారు. రోగులకు పాత పద్ధతిలో కంటే వందశాతం ఫ్యాకో శస్త్రచికిత్సలో కంటి చూపు మెరుగుపడుతుంది. అప్పట్లో శస్త్రచికిత్స జరిగిన తరువాత రోజు కట్టు విప్పి ఎక్కువ వెలుతురు ఉన్నవి చూడకూడదు.. బరువులు ఎత్తకూడదు వంటి జాగ్రత్తలు చెప్పేవారు. ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా శస్త్రచికిత్స జరిగిన రెండు నుంచి నాలుగు గంటల్లోపు కట్టు విప్పేయడంతో అన్నీ చూడవచ్చు. ఈ యంత్రంపై శస్త్రచికిత్సలకు ప్రత్యేక నిపుణులు అవసరం. కడియం సీహెచ్‌సీలో పనిచేస్తున్న ఫ్యాకో సర్జన్‌ డాక్టర్‌ అశోక్‌ వారానికి మూడు రోజులపాటు ఇక్కడ డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ మల్లికార్జునరాజు తెలిపారు.

ఏం చేస్తుంది
ఆస్పత్రిలో శస్త్రచికిత్సలకు సంబంధించి ఇప్పటివరకు కంటిలో గుడ్డును వైద్యులు చేతితో కత్తిరించి అందులో కొత్త అద్దాన్ని అమర్చేవారు. ఈ ఫ్యాకో యంత్రం ద్వారా ప్రోబ్‌ను నేత్రంలోని కాటరాక్టుకు పంపించి ఆల్ట్రా సౌండ్‌ ద్వారా శుక్లాలు కరిగించి అక్కడ ఖరీదైన అద్దాన్ని(ఐవోఎల్‌)ను అత్యాధునిక పద్ధతిలో అమర్చవచ్చు. ఇప్పటివరకు మాన్యువల్‌గా చేసే శస్త్రచికిత్సలో ప్రభుత్వం రూ.100-500 విలువగల అద్దాలను సరఫరా చేసేది. ఇకపై రూ.3 వేలకు పైగా ఖరీదైన అద్దాలను సరఫరా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని