logo

స్కిల్‌ హబ్‌లు వస్తున్నాయ్‌..

నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాప్ట్ర ప్రభుత్వం స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల భాగస్వామ్యంతో నిరుద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది.

Published : 10 Aug 2022 06:13 IST

జిల్లాలో ఏడు చోట్ల ఏర్పాటు

స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాప్ట్ర ప్రభుత్వం స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల భాగస్వామ్యంతో నిరుద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. ఈ దిశగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఏడు హబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. కాకినాడ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటిని ఈ ఏడాది జూన్‌, జులైలో ప్రారంభించాలని భావించింది. స్థలాల సేకరణ, ఆర్థిక వనరుల సమస్య కారణంగా జాప్యం జరిగింది. దీంతో కళాశాలలకు బదులు స్కిల్‌ హబ్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి వాటి స్థానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కిల్‌ హబ్‌లను ప్రభుత్వ విద్యా సంస్థలో ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్‌, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నిరుద్యోగ యువతకు నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా కేంద్రాల్లో వివిధ అంశాలను నేర్పుతారు. అభ్యర్థులు ప్రతిరోజూ ఇంటివద్ద నుంచి రావాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన వారికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. దీంతోపాటు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

సీఆర్‌ఎం డొమెస్టిక్‌ నాన్‌ వాయిస్‌ కోర్సు  మంజూరు..

ప్రయోగాత్మకంగా తొలివిడతగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ హబ్‌లో శిక్షణకు ఒక కోర్సు మంజూరైంది. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఈ కంప్యూటర్‌ కోర్సులో తర్ఫీదివ్వనున్నారు. ఎంఎస్‌ ఆఫీస్‌, వెబ్‌బేస్డ్‌ షార్ట్‌ టూల్స్‌ నేర్పుతారు. దీనికి పదో తరగతి చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులు. ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు లింకు ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.https///tynyuri.com/skillhubkkd లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మిగతా నియోజకవర్గాల పరిధినూ స్కిల్‌ హబ్‌ల ఏర్పాటుకు  చర్యలు చేపడుతున్నారు.

మిగతావి ఎక్కడెక్కడంటే..
జిల్లాకు సంబంధించి మిగతా ఆరు నియోజకవర్గాల పరిధిలోను స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆమోదం రాగానే వినియోగంలోకి తేనున్నారు. ప్రతిపాదించిన కేంద్రాల వివరాలిలా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఆంధ్రా పాలిటెక్నిక్‌, పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జగ్గంపేటప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రత్తిపాడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎంపిక చేశారు.

సద్వినియోగం  చేసుకోవాలి..
స్కిల్‌ హబ్‌లలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం పరిశ్రమలు, ఐటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నాం. శిక్షణ అనంతరం వాటిలోనే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. మొదటి హబ్‌ను కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేస్తున్నాం. శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇది గాక జిల్లా స్థాయిలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు వసతి కోసం అనువైన ప్రభుత్వ భవనం కోసం అన్వేషిస్తున్నాం. ఈ కళాశాలలో బ్యాచ్‌కు 120 మందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడే శిక్షణ పొందేవారికి వసతి సదుపాయాన్ని సైతం కల్పిస్తాం. - డి.హరిశేషు, జిల్లా నైపుణ్యాధికారి, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని