logo

మనసు పెడితే..మంచి రోజులు

ఎప్పట్నుంచో ఊరిస్తున్న ప్రభుత్వ అధీనంలోని పోర్టు అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది.

Updated : 26 Nov 2022 04:47 IST

బార్జిలోకి బియ్యం బస్తాలు ఎక్కిస్తున్న కార్మికులు

ఈనాడు, కాకినాడ: ఎప్పట్నుంచో ఊరిస్తున్న ప్రభుత్వ అధీనంలోని పోర్టు అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు అభివృద్ధికి మార్గం సుగమమైంది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా రూ.91.18 కోట్లతో ఈ అభివృద్ధి పనులకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే టెండర్లు, ఒప్పంద ప్రక్రియ పూర్తవడంతో పనులకు కార్యాచరణ సిద్ధమైంది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులు సకాలంలో విడుదల చేసి పోర్టు అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తే నిర్దేశిత 12 నెలల్లో పనుల పూర్తికి అవకాశం ఉంది.

అందిపుచ్చుకుంటేనే...

సుదీర్ఘ సాగర తీరం.. పుష్కల వనరుల.. పారిశ్రామికీకరణ.. జల రవాణా.. ఎగుమతులకూ ఆస్కారమున్న ప్రాంతం కాకినాడ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ పోర్టుల శాఖ పర్యవేక్షణలో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నడుస్తుంటే.. ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు (సీ పోర్టు) నడుస్తోంది. ప్రైవేటు పోర్టుతో పోలిస్తే ప్రభుత్వ పోర్టు కొన్నేళ్లుగా నిరాదరణకు గురైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పనులకు పరిపాలన ఆమోదం దక్కడం.. ఆ తర్వాత క్రమంలో సాగరమాల డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీసీఎల్‌).. ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ సహకారంతో సాగరమాల కార్యక్రమం కింద కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో మౌలిక సదుపాయాల మెరుగుకు సమగ్ర పథక నివేదిక సిద్ధం చేయడంతో కదలిక వచ్చింది. గత నెల 14న విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు రూ.73.34 కోట్ల విలువైన అభివృద్ధి పనుల బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు ఖరారవడంతో.. పనుల ప్రారంభానికి అవసరమైన కసరత్తును సంబంధిత సంస్థ ప్రారంభించింది.

కొత్త హంగులతోనే జోష్‌...

యాంకరేజ్‌ పోర్టు నుంచి దక్షిణ ఆఫ్రికా దేశాలకు బియ్యం.. పోర్టు బ్లెయిర్‌, అండమాన్‌ దేశాలకు సిమెంటు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి ప్రైవేటు పోర్టు 20 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుంటే.. ప్రభుత్వ పోర్టు ఎగుమతుల కార్యకలాపాల సామర్థ్యం 3 మిలియన్‌ టన్నులే. ఈ పరిస్థితికి కారణాలపై భిన్నవాదనలు ఉన్నాయి. యాంకరేజ్‌ పోర్టు నిర్వహణ, సామర్థ్యం పెంచి.. ఎగుమతులతోపాటు.. దిగుమతుల దిశగానూ ప్రోత్సహిస్తే ప్రభుత్వ ఆధీనంలోని ఈ పోర్టుకూ మంచిరోజులు వచ్చే వీలుంది. ఇటీవల పోర్టు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా.. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయితే పోర్టుకు మంచిరోజులు వచ్చినట్లే.

సాకారమైతే...

సాగరమాల పథకం కింద.. కాకినాడ యాంకరేజ్‌ పోర్టు (కేఏపీ), ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు (ఏపీఎంబీ) ఆధ్వర్యంలో పోర్టు సామర్థ్యం పెంచేలా అడుగులు పడుతున్నాయి.
* పోర్టులో కార్గో నిర్వహణ సామర్థ్యం పెంచేక్రమంలో 90 మీటర్ల పొడవుతో ట్రాన్సిట్‌ షెడ్‌ ‘జి’ దగ్గర... 110 మీటర్ల పొడవుతో ట్రాన్సిట్‌ షెడ్‌ ‘ఐ’ దగ్గర రేవులు నిర్మించనున్నారు.

* మానవ వనరులతో కార్యకలాపాలు సాగించే రేవులు శిథిల స్థితికి చేరడంతో.. మెకానికల్‌ హ్యాండ్లింగ్‌తో ట్రాన్సిట్‌ షెడ్లు ‘సి’ నుంచి ‘జి’ మధ్యలో 5 అదనపు లోడింగ్‌ పాయింట్లకు సన్నాహాలు చేస్తున్నారు. నీ ఏడీబీ రోడ్డు నుంచి యాంకరేజ్‌ పోర్టు గేటు వరకు అనుసంధాన రహదారితో.. పోర్టులో అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు, వార్ఫ్‌ గోడ పక్కన, వెనక రహదారుల నిర్మాణం చేపట్టాలి. నీ జగన్నాథపురం నుంచి సముద్రం మొగ వరకు 5 కి.మీ మేర కీలకమైన వాణిజ్య కాలువ డ్రెడ్జింగ్‌ పనులు 2.5 మీటర్ల లోతున చేపట్టాలి. కమర్షియల్‌ కెనాల్‌కు ఇరువైపులా గ్రోయన్లు, రివిట్‌మెంట్లను బలోపేతం చేయాలి.

సామర్థ్యం పెంపు దిశగా చర్యలు

కాకినాడ యాంకరేజ్‌ పోర్టు అభివృద్ధి పనులు ఎప్పటి నుంచో జరగడంలేదు. సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ఈ పనులు చేపడుతోంది. యాంకరేజ్‌ పోర్టులో జట్టీ, కాలువ పూడికతీత, రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారయ్యాయి. మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులతో పోర్టు సామర్థ్యం పెరుగుతుంది.

- కృతికాశుక్లా, కాకినాడ జిల్లా కలెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని