logo

ఏలేరునూ వదలని ఏలికలు!

నిన్నటి వరకు కొండలు, కాలువ గట్లు కొల్లగొట్టారు.. నేడు ఏలేరు ప్రధాన కాలువ వంతు వచ్చింది.

Published : 08 Dec 2022 03:58 IST

మామిడాడలో ఏలేరు కాలువలో తవ్వకాలు

న్యూస్‌టుడే-జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం : నిన్నటి వరకు కొండలు, కాలువ గట్లు కొల్లగొట్టారు.. నేడు ఏలేరు ప్రధాన కాలువ వంతు వచ్చింది. కొంతమంది అక్రమార్కులు భారీ యంత్రాలు ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇసుక తవ్వి అధిక సంఖ్యలో ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ తవ్వేస్తుండటంతో పెద్దపెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా వెనుక మెట్ట ప్రాంతంలో కీలక నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు వారి అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి.

ఏలేరు ప్రధాన కాలువ పరీవాహక ప్రాంతం జగ్గంపేట మండలం మామిడాడ, సోమవరం, ఇర్రిపాక, కిర్లంపూడి మండలం తామరాడ, గోనేడ, ఏటిపట్టు గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మామిడాడలో ఒక పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. ఒక ట్రాక్టరు ఇసుక రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు. పేదలు ఇల్లు కట్టాలంటే ఇసుక కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొందరికి మాత్రం నేరుగా ఇంటికే చేరవేస్తున్నారు. గ్రామాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై తహసీల్దారు శ్రీదేవిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఏలేరు కాలువ ఇసుకకు సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధం లేదన్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలు

అధికార పార్టీ నాయకులే...

- బొడ్డేటి సుమన్‌, మామిడాడ

మామిడాడ గ్రామంలో వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నారు. యంత్రాలతో చేపట్టడం వల్ల  భారీ గోతులు ఏర్పడుతున్నాయి. అందులో పడితే పశువులు, మనుషులు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఇసుక అక్రమ రవాణాను నిలుపుదల చేయాలి.


గోతులతో ప్రమాదం...

- పెంటకోట సత్యనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు
 

ఎటువంటి అనుమతుల్లేకుండా ఏలేరు కాలువ వెంబడి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఒక ట్రాక్టరు ఇసుక రూ.6 వేల నుంచి రూ. 7 వేల వరకు  అమ్ముకుని సొమ్ములు చేసుకుంటున్నారు. కాలువలో పెద్దపెద్ద గోతులతో ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.


అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..

- నాగేశ్వరరావు, స్థానికుడు

ఇసుక తవ్వకాలపై స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఇతర ప్రాంతాలకు నిత్యం ఇసుకను తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. గ్రామంలో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుండడంతో ఇసుక నిల్వలు చేస్తున్నారు. ఏలేరు కాలువ నీటిని విడుదల చేసినప్పుడు గోతులు కనిపించక స్థానికులు మృత్యువాత పడే ప్రమాదముంది.  


ఇసుక తవ్వకాలకు అనుమతుల్లేవు...

 - రామ్‌గోపాల్‌, ఈఈ, జలవనరుల శాఖ

ఏలేరు కాలువలో ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఉండవు. పలు దఫాలుగా హెచ్చరించినా ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడంలేదు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. అక్రమ తవ్వకాలపై అధికారులను పంపి విచారణ జరిపిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు