logo

సీఎం సభకెళ్లి చేయి విరగ్గొట్టుకుని..

ఈమె పేరు సోమోజు ఈశ్వరమ్మ. రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో నామవరం వాంబే గృహాల్లో నివాసం ఉంటున్నారు.

Published : 07 Feb 2023 05:14 IST

ఈశ్వరమ్మ

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: ఈమె పేరు సోమోజు ఈశ్వరమ్మ. రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో నామవరం వాంబే గృహాల్లో నివాసం ఉంటున్నారు. సీఎం సభకు వెళ్లిన తాను చెయ్యి విరగ్గొట్టుకున్నానని, బతుకు తెరువు లేకపోవడంతో ఆధారం చూపమంటూ సోమవారం స్పందనలో కలెక్టరేట్‌కు వెళ్లి వినతి పత్రం అందించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...  రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాలలో ఈ ఏడాది జనవరి 3న నిర్వహించిన సీఎం సభకు డ్వాక్రా మహిళలకు ఏర్పాటు చేసిన బస్సులో ఈశ్వరమ్మ కూడా వెళ్లారు. లోపలకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగి కింద పడిపోయారు. కొంత మంది చెయ్యిపై తొక్కేశారు. తర్వాత ఆసుపత్రికి వెళ్లితే... చేతి లోపల ఎముకలు విరిగిపోయాయని, శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్సకయ్యే ఖర్చును కూడా భరించలేని స్థితిలో ఉన్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమె షాపుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త సత్యనారాయణ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. మోకాళ్ల చిప్పలు అరిగిపోవడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు.  ప్రభుత్వం స్పందించి తగు న్యాయం చేయాలని స్పందనలో వినతిపత్రం అందించారు. పరిశీలించిన నగరపాలక అధికారులు మాత్రం ఆమె గ్రామీణ మండల పరిధిలో నివాసం ఉండడంతో తమకు సంబంధం లేదని, అక్కడకు వెళ్లాలని పంపించేయడం కొసమెరుపు. దీంతో కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీ అందించారు. సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందిస్తామని అధికారులు దరఖాస్తు తీసుకున్నారని ఈశ్వరమ్మ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని