logo

జలదిగ్బంధంలో లంకలు

వారం క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న గోదావరి.. ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో కనిపిస్తోంది. ఎగువ, పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా నీరు చేరుతోంది.

Published : 22 Jul 2023 03:46 IST

వరదతో ఉక్కిరిబిక్కిరి

రాజమహేంద్రవరంలోని సరస్వతీఘాట్‌ వద్ద..

ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, పి.గన్నవరం: వారం క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న గోదావరి.. ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో కనిపిస్తోంది. ఎగువ, పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా నీరు చేరుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇక్కడ 11.70 అడుగుల నీటిమట్టం నమోదవగా 9,73,870 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రి 10 గంటలకు కూడా ఇదే నిలకడ కనిపిస్తోంది. బ్యారేజీ 175 గేట్లను ఎత్తేసి వచ్చిన ఇన్‌ఫ్లోలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద రావడంతో రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 11.75 అడుగుల నీటిమట్టం, 10 లక్షల క్యూసెక్కుల జలాలు వస్తే హెచ్చరిక జారీ చేస్తారని తెలిపారు. భద్రాచలం వద్ద ఉదయం 6 గంటలకు 43.90 అడుగుల నీటిమట్టం ఉండగా.. క్రమేపీ తగ్గుతూ రాత్రి 8 గంటలకు 41.10 అడుగులకు చేరింది. ఈ ప్రభావం వల్ల శనివారం నాటికి బ్యారేజీ వద్ద వరద కొంత మేర తగ్గే సూచనలున్నాయి. తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లు, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు సిద్ధం చేసి 24 గంటలూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ, రాజమహేంద్రవరం పుష్కరాలరేవు, గౌతమీ ఘాట్‌ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘాట్ల లోపలికి ఎవర్నీ అనుమతించకుండా గేట్లు వేసేశారు. సరస్వతీఘాట్‌ వద్ద సందర్శకుల తాకిడి కనిపించింది.

ఐ.పోలవరం: జి.మూలపొలం-కాట్రేనికోన మండలం రామాలయంపేట రేవులో విద్యార్థుల పడవ ప్రయాణం. పదమూడేళ్లుగా వీరు వంతెనకు నోచుకోలేదు

ఎన్నెన్నో అవస్థలు

వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉన్న పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక గ్రామాల ప్రజలు బూరుగులంక రేవులో మర పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. తహసీల్దార్‌ జి.రవీంద్రనాధ్‌ఠాగూర్‌, ఎస్సై హరికోటి శాస్త్రి ఈ రేవు వద్దకు వెళ్లి సిబ్బందికి సూచనలు చేశారు. రేవులు దాటే ప్రజలు తప్పనిసరిగా లైఫ్‌జాకెట్లు ధరించాలని స్పష్టం చేశారు. ప్రజలు ద్విచక్ర వాహనాలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు వీలు లేకపోవడంతో బూరుగులంక రేవు ఇవతల వాటిని భద్రపర్చారు. ఊడిమూడి వద్ద వశిష్ఠ ఎడమ ఏటిగట్టు దిగువన సుమారు 20 నిరుపేద కుటుంబాలు జీవిస్తున్నాయి. వరద పెరుగుతున్న క్రమంలో వారంతా ఏటిగట్టుమీద ప్లాస్టిక్‌ బరకాలు ఏర్పాటు చేసుకున్నారు. లంక గ్రామాల రైతులు విద్యుత్తు మోటార్లను ముందుజాగ్రత్తతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

* మామిడికుదురు పరిధి పాశర్లపూడిలోని కరకట్ట దిగువలో ఉన్న పాటురేవులోకి వరద నీరు ముంచెత్తుతోంది. అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయ సమీపంలోని స్నానఘట్టం వద్ద ప్రవాహం పోటెత్తింది.

ఊడిమూడి ఏటిగట్టుకు దిగువన ఉన్న నిరుపేదలు బరకాలు వేసుకొని నివాసం

సీతానగరం: లంకగ్రామాల్లో వరద ఉద్ధృతిపై రాకపోకలు నిలిపివేసినట్లు ఏర్పాటు చేసిన సూచిక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని