logo

మహిళా మార్టులు ఎక్కడండి?

స్వయం సహాయక సంఘాల మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది.

Updated : 29 Jul 2023 06:00 IST

గతేడాది నిడదవోలులో ఏర్పాటు చేసిన చేయూత
మహిళా మార్టు (పాత చిత్రం)

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం):  స్వయం సహాయక సంఘాల మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఏడాది కావస్తున్నా జిల్లాలో ఒక చోట తప్ప ఇతర మండలంలో మార్టులు ఏర్పాటు కాలేదు. మండలానికి ఒకటన్నది చివరకు... జిల్లాకు కనీసం మరో మూడైనా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినా ఆ దిశగా అడుగులు కూడా పడటంలేదు.

జిల్లాలో రాజమహేంద్రవరం అర్బన్‌ మినహా మిగతా 18 మండలాల్లో కలిపి మొత్తం 31,384 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. రాజమహేంద్రవరం గ్రామీణంలోని తొమ్మిది గ్రామాల్లోని ఎస్‌హెచ్‌జీలు అర్బన్‌లో కలిసిపోవడంతో కొంతమూరు గ్రామ పరిధిలోని 475 సంఘాలు మాత్రమే గ్రామీణ మండలంలో ఉన్నాయి. మిగతా ప్రతి మండల సమాఖ్యలో 1,300 నుంచి రెండు వేలకుపైగా సంఘాలున్నాయి. గతంలో మండల సమాఖ్యలకు సాధారణ పెట్టుబడి నిధి కింద రూ.40 లక్షల చొప్పున కేటాయించగా వీటిని సంఘాల్లోని సభ్యులకు అంతర్గత అప్పులుగా ఇవ్వడం ద్వారా వచ్చిన వడ్డీతో కలిపి ఒక్కొక్క మండల సమాఖ్య వద్ద సుమారు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సొంతనిధి ఉంది.

ఇదీ ఆలోచన

సొంత నిధిపై వచ్చే వడ్డీ మొత్తాన్ని, స్త్రీనిధి ద్వారా ఏటా వచ్చే డివిడెండ్‌ను కలిపి వాటాగా పెట్టడంతోపాటు దీనికి అదనంగా బ్యాంకుల నుంచి మరికొంత రుణం మంజూరు చేయించి ఒక్కొక్క మండలంలో రూ.60 లక్షల నుంచి రూ.కోటి పెట్టుబడితో చేయూత మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేయించాలని ఏడాది కిందటే ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు లింకేజీ, పొదుపు సొమ్ము, స్త్రీనిధి రుణాలతో చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న సంఘాలను పెద్ద వ్యాపార రంగంలోకి తీసుకువస్తామని, గ్రామీణ డ్వాక్రా మహిళలు తయారు చేసే సొంత ఉత్పత్తులతోపాటు ఇతర ఉత్పత్తులను మహిళా మార్టుల్లో విక్రయించుకునే అవకాశం కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి, సంఘాల బలోపేతానికి తోడ్పాటు అందిస్తామని చెప్పుకొచ్చింది. ఆ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ సంఘాలతో మార్టులు నెలకొల్పేందుకు ఆదేశాలిచ్చింది. మహిళా మార్ట్‌ల నిర్వహణ ద్వారా వచ్చే నికర లాభంలో సంఘాల వాటా ఆధారంగా డివిడెండ్‌ కల్పించాల్సి ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది.

  ప్రయోగాత్మకంగా ఒక మండలంలోనే..

జిల్లాలో చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టుగా రెండు మండలాలు ఎంపిక చేశారు. ప్రయోగాత్మకంగా నిడదవోలు, కోరుకొండ మండలాల్లో మహిళా మార్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా చివరకు గతేడాది నవంబరులో నిడదవోలులో మాత్రమే మహిళా మార్టు ఏర్పాటు చేశారు. ఇక్కడి మండల సమాఖ్యలో 1,727 సంఘాలు ఉండగా 1,600 సంఘాలు వరకు వాటా ధనం పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ముందు చెప్పినట్లు ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఏమీ ఇప్పించలేదు.  ఇక్కడ రోజుకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు వివిధ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మిగతా మండలాల్లో కూడా దశలవారీగా మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ అది జరగడంలేదు. కనీసం మరో మూడు మండలాల్లోనైనా మహిళా మార్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించడంతో గోకవరం, బిక్కవోలు, నల్లజర్లలో ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ నెలల తరబడి ఆ ప్రక్రియ ముందుకు సాగడంలేదు.

భవనమే సమస్య

మార్టుల ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాల్లో భవనాలు సమకూరకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. 700 నుంచి వెయ్యి చదరపు గజాల హాలు ఉండే భవనం తక్కువ అద్దెకు దొరకడం లేదు.
గోకవరంలో మార్ట్‌ ఏర్పాటుకు అనుకూల భవనాన్ని చూసినప్పటికీ నెలకు రూ.40 వేలు అద్దె చెప్పడం వల్ల ముందుకెళ్లలేని పరిస్థితి.  

త్వరలో నల్లజర్లలో ఏర్పాటు: డీఆర్‌డీఏ పీడీ

చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు ఆయా మండలాల్లో అనుకూలమైన భవనాల కోసం అన్వేషిస్తున్నామని డీఆర్‌డీఏ పీడీ సుభాషిణి చెబుతున్నారు. నల్లజర్ల మండలంలోని సొసైటీ భవనం చూశామని, నెలకు రూ.15 వేలు అద్దె చెల్లించే ఒప్పందంపై ఈ భవనం పైఅంతస్తులో మహిళా మార్టును త్వరలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మిగతా మండలాల్లోనూ మార్టుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని