logo

వైకాపాకు ఓటేస్తే మరణ శాసనమే

అందాల కోనసీమ అనగానే పాడిపంటలు గుర్తొస్తాయి. పూతరేకుల్లాంటి మంచి మనసున్న ప్రజానీకం.. మర్యాదకు మారుపేరు.. అలాంటి పచ్చని కోనసీమలో నేడు రాజకీయ చిచ్చుపెట్టారు.’’

Published : 19 Aug 2023 06:09 IST

 పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టొద్దు
 కోనసీమలో రాజకీయ చిచ్చుపెట్టారు..
 అన్ని రంగాలను ఆదుకునేది తెదేపానే
 చంద్రబాబు వెల్లడి

వివిధ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం, గ్రామీణం, అల్లవరం: ‘‘అందాల కోనసీమ అనగానే పాడిపంటలు గుర్తొస్తాయి. పూతరేకుల్లాంటి మంచి మనసున్న ప్రజానీకం.. మర్యాదకు మారుపేరు.. అలాంటి పచ్చని కోనసీమలో నేడు రాజకీయ చిచ్చుపెట్టారు.’’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమలాపురంలో శుక్రవారం రాత్రి భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా వాళ్లు చేసిందేమీ లేదు..
అమలాపురం అభివృద్ధి ఆ రోజు బాలయోగి హయాంలో జరిగింది.. యానాం- ఎదుర్లంక బ్రిడ్జి, రైల్వే లైను..పార్లమెంటును మించిన ఆర్డీవో ఆఫీసును ఆ రోజే డిజైన్‌ చేశారు. కలెక్టర్‌ కార్యాలయ భవనమూ ఆ రోజుల్లో కట్టినవే.’’ అని పేర్కొన్నారు. ‘అమలాపురంలో అయిదేళ్లలో ఒక్క అభివృద్ధి అయినా జరిగిందా.. ఏ కొబ్బరి రైతైనా ఆనందంగా ఉన్నాడా..? కనీస మద్దతు ధర రూ.10,500 ఇవ్వాలి.. రూ.7 వేలు ఇస్తున్నారు. జామకాయ రూ.10కి అమ్ముతుంటే.. కొబ్బరికాయ రూ.4కి అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కోడిగుడ్డంత విలువ కూడా లేదా..?’ అని ప్రశ్నించారు. తెదేపా కొబ్బరి రైతాంగాన్ని ఆదుకుంటుంది. ప్రత్యేక పాలసీ తెస్తుందన్నారు. ఆక్వా చచ్చిపోతోంది.. రైతు వెంటిలేటర్‌పై ఉన్నాడన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేదని, సకాలంలో కొనలేదన్నారు. చిరిగిన గోనెలు ఇచ్చారని తెలిపారు. పేటీఎం బ్యాచ్‌ ఇష్టానుసారంగా చేసి కాకినాడ పోర్టు నుంచి బియ్యాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతు కాడిపడేసే పరిస్థితి వచ్చిందన్నారు. రైతును రాజుచేసే బాధ్యత తనదన్నారు. నీళ్లు ఇచ్చిన కాటన్‌ బ్రిటిష్‌వారైనా విగ్రహాలు పెట్టుకుని ఆరాధించారని.. ఇక్కడి ప్రజలు మంచిచేస్తే ఆరాధిస్తారు.. చెడు చేస్తే తోలు తీస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నియోజకవర్గంలో అంతా అవినీతే..

శ్రేణుల నడుమ రోడ్‌షోలో చంద్రబాబు

అమలాపురం నియోజకవర్గంలో అంతా అవినీతి.. ఇళ్ల కోసం 100 ఎకరాలు సమీకరించి.. ఒక్కో ఎకరాకు రూ.10 లక్షల పైన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. వైద్య కళాశాల కోసం రైతుల దగ్గర 50 ఎకరాలు కొని.. రూ.78 లక్షల చొప్పున చెల్లించారు. వారికి రూ.50లక్షలు ఇచ్చి మిగిలిన రూ.28 లక్షలు వీరి జేబుల్లోకి వెళ్లాయన్నారు. అమలాపురం మున్సిపాలిటీ పార్కింగ్‌ స్థలాన్ని అక్కడున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ పార్కింగ్‌ స్థలంగా ఇచ్చి దాన్నుంచి కూడా డబ్బులు వసూలుచేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఆక్వా చెరువు తవ్వాలన్నా, రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు వెయ్యాలన్నా.. బిల్డింగులు, అపార్టుమెంట్లు కట్టాలన్నా ఎమ్మెల్యే అనుచరులకు సుంకం కట్టాలా అని ప్రశ్నించారు. జే టాక్స్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి.. లోకల్‌ ట్యాక్స్‌ వైకాపా ఎమ్మెల్యే, ఆయన అనుచర దొంగలకని అన్నారు. అవినీతి వీళ్ల హక్కు అయిపోయింది. మీ ఆస్తులూ కబ్జాచేసే పరిస్థితి.. అడిగితే మీపై దాడిచేసే పరిస్థితి.. మీకు అండగా మేము వస్తే మాపైనా దాడిచేసే పరిస్థితి వచ్చిందన్నారు. 1,632 టిడ్కో ఇళ్లు కడితే వాటిని కేటాయించడానికీ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఇంట్లో కూర్చుంటే చాలదు

వైసీపీ, మద్యం, క్రైం వద్దంటూ సంతకం చేస్తున్న చంద్రబాబు

ఇలాంటి దుర్మార్గులమీద పోరాడాలంటే మీరు ఇంట్లో కూర్చుంటే చాలదు.. ఓటుకు రూ.5వేలు ఇచ్చినా.. రూ.10వేలు ఇచ్చినా మీరు ఓట్లేస్తారా..? మీ పిల్లల సాక్షిగా ఆలోచించుకోండి.. రూ.5వేలకు మీ పిల్లల జీవితాలను, మీ భవిష్యత్తును తాకట్టు పెడితే.. భవిష్యత్తులో ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. గుర్తుంచుకోండి.. మతం, కులం, బంధుత్వం పేరు చెబుతారు. వైకాపాకు ఓటేస్తే అదే మరణ శాసనమవుతుందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ దక్షిణ కొరియా.. ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర కొరియా అవుతోందన్నారు. ఎవరైనా నవ్వినా, ఏడ్చినా కొడతారు. ఆస్తిలో వాటా ఇవ్వమంటారు. ఎక్కడ చూసినా గంజాయి.. ఈ రాష్ట్రం ఏమైపోతుందని ప్రశ్నించారు.

ప్రత్యేక పాలసీలు తెస్తా..

మెకానిక్‌లు, ఆటో డ్రైవర్లు పూటగడవడమే కష్టమవుతోంది. పిల్లలను చదివించడం కష్టమవుతోంది. వీరికి ప్రత్యేక పాలసీ తెస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పోలీసులకు జీతాలు, పీఎఫ్‌, ఎర్న్‌డ్‌ లీవు, సరెండర్‌లీవు ఇవ్వడంలేదు. బానిసల్లా వాడుకుంటున్నారు. వీరి సంక్షేమం బాధ్యత తీసుకుంటానన్నారు.
ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చా. విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేశా.. మళ్లీ పీఆర్సీ ఇస్తా.. మిమ్మల్ని ఆదుకుని మీ గౌరవాన్ని పెంచుతానని హామీ ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ ద్వారా అన్నివర్గాలను ఆదుకుంటాను. దసరాలోగా మిగిలిన వర్గాలకూ మేలుచేసే ప్రత్యేక పాలసీలు తీసుకొస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

  జన‘చంద్రం’

నల్లవంతెన వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి

మూడు రోజుల పాటు కోనసీమ జిల్లాలో పర్యటించిన తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజక వర్గాల పరిధిలో రైతు రచ్చబండ..మేధావులు, మహిళలతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా ఎండగట్టి ప్రజలను ఎలా దోచుకుంటున్నారో వివరించారు. ఈ నెల 15న రాత్రి రాజమహేంద్రవరం గ్రామీణం తొర్రేడు వచ్చిన చంద్రబాబు.. 18న (శుక్రవారం) అమలాపురంలో సభ అనంతరం హైదరాబాద్‌ పయనమయ్యారు.

బాలయోగికి నివాళి..

అమలాపురంలో బహిరంగ సభకు వెళ్లే ముందు బాలయోగి ఘాట్‌కు వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి అని కొనియాడారు. అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు గుండెల్లో ఉంచుకుంటారనడానికి ఆయనే నిదర్శనమన్నారు. నల్లవంతెన వద్ద ఎన్టీఆర్‌, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పార్లమెంట్‌ ఆకృతిలో ఉన్న ఆర్డీవో కార్యాలయం వద్ద ఆగి చంద్రబాబు సెల్ఫీ దిగారు.
అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌ నుంచి గడియార స్తంభం వరకు రోడ్‌షో నిర్వహించారు. జోరువానలోనూ ఉత్సాహంగా సాగింది. ముందుగా 4 కి.మీ పాదయాత్రగా వెళ్లాలనుకున్నా.. వర్షం కారణంగా వాహనం పై నుంచి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సభ ముగిసిన తరువాత ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ పాటకు చంద్రబాబు చేతులు ఆడిస్తూ ఉత్సాహపరచగా.. పార్టీ శ్రేణులంతా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

పలువురు తెదేపాలో చేరిక..

అమలాపురంలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. కాకినాడకు చెందిన వైకాపా నాయకుడు నున్న లక్ష్మణరావు (దొరబాబు),  కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు తమ అనుచరులతో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సమక్షంలో తెదేపాలో చేరగా కండువా వేసి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని, వైకాపా పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. అనంతరం చంద్రబాబును సత్కరించారు. *  బహిరంగ సభలో తెదేపా నాయకులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, చిక్కాల రామచంద్రరావు, అయితాబత్తుల ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, గంటి హరీష్‌ మాథుర్‌, వేగుళ్ల జోగేశ్వరరావు, బండారు సత్యానందరావు, మెట్ల రమణబాబు, రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు రాఖీ కడుతున్న తెలుగు మహిళలు

అమలాపురం గడియారస్తంభం వద్ద సభలో జనసందోహం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని