logo

వాత్సల్యం చూపలేదు..!

కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్‌బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.

Published : 28 Mar 2024 03:08 IST

సాయం కోసం విధివంచితులు, అభాగ్యుల ఎదురుచూపులు
- న్యూస్‌టుడే, రామచంద్రపురం టౌన్‌ (పామర్రు)

  • కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్‌బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. వాత్సల్యం పథకం కింద సాయం కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నాడు. ఎదురు చూపులే మిగిలాయి తప్ప ఇంత వరకు సాయం అందలేదు.

  • కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన కాకినాడ లోవరాజు విద్యుత్తు లైన్లు వేయడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేసేవాడు. ఒకసారి పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతని భార్య కూలి పనులు చేసి ఇద్దరు కుమారులను చదివిస్తోంది. వాత్సల్యం పథకంలో లబ్ధి చేకూరుతుందని తెలిసి కార్యాలయాల చుట్టూ తిరిగి భర్త మరణ ధ్రువపత్రం సంపాదించి సాయం కోసం దరఖాస్తు చేసుకోగా ఉన్నతాధికారులు పరిశీలన కూడా పూర్తయ్యింది. నిబంధనల ప్రకారం అర్హతలున్నా సాయం మాత్రం అందలేదు.

వీరే కాదు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చాలామంది దరఖాస్తుదారులది ఇదే పరిస్థితి. విధి వంచిత చిన్నారులు, అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తుందనుకున్న మిషన్‌ వాత్సల్య పథకం అతీగతీ లేకుండా పోయింది. ఆర్థిక సాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే మిగులుతోంది.

ఇదీ పథకం స్వరూపం

తల్లిదండ్రులు దూరమై.. బతుకు భారమై అల్లాడుతున్న పిల్లలకు అండగా నిలుస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వారి విద్య, వైద్య అవసరాలను తీర్చేందుకు, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మిషన్‌ వాత్సల్య పథకాన్ని తెరపైకి తెచ్చింది.. అనాథలు, అభాగ్యులు, తల్లిదండ్రులను కోల్పోయినవారు, తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారు, విడాకులు పొందిన తల్లిదండ్రులున్న వారు, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్నవారు, అక్రమ రవాణా, దాడులకు గురైన బాలబాలికలు, యాచకులు, బాల్య వివాహాలు, హెచ్‌ఐవీ పీడిత బాలలు, దివ్యాంగుల్లో ఎంపిక చేసిన వారికి నెలకు రూ.4000 చొప్పున ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు 60,  రాష్ట్ర ప్రభుత్వానిది 40 శాతం.  కేంద్రం నిధులు ఇస్తామంటున్నా కూడా రాష్ట్రం తగిన మంజూరులు చేయకపోతుండడంతో పథకం అమలు నిలిచిపోయింది.  

ఏడాది కిందటే దరఖాస్తుల పరిశీలన

గత ఏడాది ఏప్రిల్‌ నెలలో డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు, కపిలేశ్వపురం, రాయవరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,726 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 12,500 దరఖాస్తులు స్వీకరించారు. వాటిని తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, సీడీపీవో, ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలు సభ్యులుగా ఉన్న మండలస్థాయి కమిటీలు పరిశీలించి  9,700 దరఖాస్తులు అర్హత ఉన్నట్లు గుర్తించి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయానికి పంపించారు. ఇంత వరకు అతీగతీ లేదు.


ఎన్నికల హడావుడిలో ఉన్నాం..
ఝాన్సీరాణి, పీడీ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ హడావుడిలో ఉన్నాం. దాంతో ఈ పథకం అమలుపై దృష్టి సారించలేకపోతున్నాం. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని