logo

నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!

తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే.

Updated : 29 Mar 2024 08:51 IST

అర్చకులపై దాడి ఘటనలో విమర్శలకు తావిచ్చిన కొందరి తీరు

దాడి ఘటనపై దేవాదాయ శాఖ ఆర్జేసీˆకి వివరిస్తున్న అర్చకులు (పాతచిత్రం)

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, గాంధీనగర్‌: తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. రాజకీయం బుసలు కొడుతోంది.. యంత్రాంగం సాహో అంటుంది. ఐదేళ్ల వైకాపా జమానాలో జరుగుతున్నది ఇదే.. తాజాగా కాకినాడ దేవాలయం వీధిలోని పెద్ద శివాలయంలో శివయ్య సన్నిధిలోనే వైకాపా నాయకుడు ఇద్దరు అర్చకులపై దాడిచేసి.. అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఇదే జరిగింది. తప్పుచేసిన వ్యక్తిని శిక్షించాల్సిందిపోయి.. కేసు నీరుగార్చే ప్రయత్నాలకు అధికార పార్టీ తెగబడడం విమర్శలకు తావిస్తోంది.

ఆ తీరు వివాదాస్పదం..

కాకినాడలో ఇద్దరు అర్చకులపై దాడి వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఓటు బ్యాంకుపై ప్రభావం చూపకుండా సద్దుమణిగించే చర్యల్లో వైకాపా నేతలు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే దేవాదాయశాఖలోని కొందరి ఉద్యోగులపై ఒత్తిళ్లు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా నాయకుడి చేతిలో దెబ్బలు తిన్న, అవమానానికి గురైన అర్చకులతో పోలీసులకు నేరుగా ఫిర్యాదు ఇప్పించాలి. జరిగిన విషయం వివరంగా నమోదుచేయించాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. అర్చకుల నుంచి ఆలయ ఈవో రాజేశ్వరరావు ఫిర్యాదు స్వీకరించారు. కేసు తీవ్రత తగ్గేలా పైపైన క్లుప్తంగా రాయించారు. దాని ఆధారంగా ఈవో పోలీసులకు ఫిర్యాదిచ్చారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భర్తకు ప్రాణహాని లేకుండా చూడాలని అర్చకుని భార్య మీడియా ఎదుట కోరారు.. బాధిత కుటుంబాల ఆందోళనను సైతం పరిగణనలోకి తీసుకోలేదు. దాడి ఘటనను బ్రాహ్మణ సంఘాలు జిల్లా దేవాదాయ శాఖ అధికారి పులి నారాయణమూర్తి దృష్టికి తీసుకెళ్తే.. తన పరిధిలోని అంశం కాదని.. డీసీతో మాట్లాడుకోండని తప్పించుకున్నారు. వైకాపా నాయకులకు మేలు చేయాలనే ఉద్దేశమే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆ కెమెరానే ఎందుకు పనిచేయదు

శివాలయంలో 15 సీసీ కెమెరాలతో నిఘా ఉంటే.. దాడి జరిగిన ప్రాంతంలోని కెమెరా మాత్రమే ఎందుకు పనిచేయడంలేదన్న దానికి సమాధానం లేదు. మొత్తం మీద వైకాపా నాయకుడిని రక్షించే ప్రయత్నాల్లో కొందరు సర్వశక్తులూ ఒడ్డారు. దాడి ఘటనపైనే కాకుండా, శాఖాపరమైన లోపాలపైనా లోతుగా విచారణ జరిపి ఇలాంటివి పునరావృతం కాకుండా భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవాలని అర్చక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని