logo

‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!

సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.

Published : 19 Apr 2024 04:49 IST

సీఎం సారూ... నిధులేవండీ..!

న్యూస్‌టుడే, ముమ్మిడివరం: సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సిఉంది. వ్యవసాయ అనుబంధశాఖల పథకాలను ‘ఆత్మ’ ద్వారా అమలు చేయాల్సిఉంది. గడిచిన ఈయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు తగ్గించేసింది. దీంతో అరకొర నిధులతో కార్యకలాపాలు చేపట్టాల్సిన పరిస్థితి. 2019లో ఉమ్మడి జిల్లాలో రూ.1.37 కోట్ల వ్యయంతో ఆత్మ వార్షిక ప్రణాళిక అమలైతే.. ప్రస్తుతం అది కేవలం రూ.7 లక్షలకు పడిపోయింది. అంటే ఆత్మ పథకం అమలు తీరేంటో అర్థం చేసుకోవచ్చు.

అనాస సాగు పరిశీలిస్తున్న రైతులు (పాత చిత్రం)

గతంలో ఇలా..

ఆత్మ పథకంలో గతంలో వ్యవసాయ సబ్‌ డివిజన్‌కు ఓ బీటీఎం(బ్లాక్‌ టెక్నికల్‌ మేనేజర్‌), ఇద్దరు ఏటీఎం(అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌)లు ఉండేవారు. వ్యవసాయ సహాయ సంచాలకుల ఆధ్వర్యంలో ఆత్మ కార్యక్రమాలు జరిగేవి. దీంట్లో పనిచేసే సిబ్బంది ఒప్పంద పద్ధతిలో పనిచేయడం, జీతాలెప్పుడొస్తాయో తెలియని పరిú్థ‡తుల్లో ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఆత్మ ప్రధాన కార్యాలయం ఉండగా.. డీపీడీ పర్యవేక్షణలో కొనసాగుతోంది. విభజిత జిల్లాలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో డీఆర్సీలను ఏర్పాటు చేసి అక్కడ డీడీఏ, ఏడీఏ, ఏవోను ఏర్పాటు చేశారు. వీరి ద్వారానే ఆత్మ కార్యకలాపాలు నిర్వహించాల్సిఉంది. అయితే నిధుల లేమితో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు సాగడం లేదు.

ఇదివరకు  సమావేశాలు జరిగేవి..

ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయ సబ్‌ డివిజన్‌ కార్యాలయం వద్ద రైతులకు సమావేశాలు నిర్వహించేవారు. అమలవుతున్న కార్యక్రమాలు, ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు విజ్ఞానయాత్రలకు సంబంధించి షెడ్యూలు వంటివన్నీ వివరించేవారు. ఆసక్తి ఉన్న రైతులం యాత్రలకు వెళ్లి కొత్త విషయాలు తెలుసుకునేవాళ్లం. చాన్నాళ్లుగా సమావేశాలు నిర్వహించడం మానేశారు. అసలు పథకం ఉందో, లేదో కూడా ఎవరికీ తెలియడం లేదు.

ఎం.సత్యనారాయణ, రైతు, ముమ్మిడివరం

పథకంపై పగా..

రైతులకు నిత్యం సాంకేతిక సలహాలు, శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమాలతోపాటు సాగులో సరికొత్త పరిజ్ఞానం అందించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) జగనన్న పాలనలో అంతర్ధానమైంది. సీజన్‌ ప్రారంభం కాగానే రైతులను సాగుకు సమాయత్తం చేయడంలో కీలకపాత్ర పోషించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2005-06లో ఆత్మ పథకం తీసుకువచ్చారు.

పట్టించుకోక  దగా..

వ్యవసాయం గురించి.. రైతుల మాట వచ్చిన ప్రతిసారీ రైతు సంక్షేమమే మా ధ్యేయమంటూ.. మాతోనే రైతులకు మేలు జరుగుతుందని.. బాకా మోగించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. దీంతో దీని ఫలితాలు ఎవరికీ అందని పరిస్థితి నెలకొంది. నూతన వరి వంగడాల సాగు, సాంకేతికతను రైతులకు అందకుండా చేశారు.

రైతులకు  విజ్ఞాన యాత్రలు..

వ్యవసాయ శాఖను అనుబంధంగా పనిచేసే ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు విజ్ఞాన యాత్రలు నిర్వహించేవారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వ్యవసాయ క్షేత్రం, మహారాష్ట్ర, పంజాబ్‌లలో ఆదర్శంగా నిర్వహించే వ్యవసాయ క్షేత్రాల సందర్శనకు రైతులను తీసుకువెళ్లేవారు. అక్కడ పండిచే పంటలు, రైతులు వినియోగించే సాంకేతికత, నూతన వంగడాల గురించి తెలుసుకునేవారు. ఉద్యాన పంటలకు సంబంధించి కొబ్బరి తోటల్లో అంతర పంటలు, పాలీహౌస్‌లో ఆర్కిడ్స్‌, రాగులు, బొబ్బర్లు వంటి పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ విధానాలు తెలుసుకోవడానికి ఈ యాత్రలు దోహదపడేవి. ప్రస్తుతం నిధుల కొరతతో అవన్నీ అటకెక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని