logo

సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు

సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై...

Updated : 23 Apr 2024 05:49 IST

నాటి అధికారి అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు

న్యూస్‌టుడే, అన్నవరం: సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... చర్చకు దారి తీసినా పట్టించుకోకుండా ముందడుగు వేశారు. ఇదీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానంలో గత అధికారి వ్యవహరించిన తీరు. ఓ మంత్రి అండతో దేవస్థానం వర్గాల పూర్తిస్థాయి అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించారనే విమర్శలూ ఉన్నాయి. గత సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శ్రీపుష్పయాగం నిర్వహణ అప్పట్లో చర్చనీయాంశమైంది. వచ్చే నెలలో కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. స్వామివారి నివేదన శాల ఏర్పాటు, ప్రదక్షిణ దర్శనం అమల్లోకి తీసుకురావడం కూడా చర్చనీయాంశమయ్యాయి.

అన్నవరం అనివేటి మండపంలో ఏటా శ్రీపుష్పయోగ మహోత్సవం జరుగుతోంది. గత ఏడాది మే 6న జరిగిన ఈ మహోత్సవాన్ని వార్షిక కల్యాణ వేదిక వద్ద నిర్వహించారు. గతంలో ఓసారి వార్షిక కల్యాణ వేదిక వద్ద శ్రీపుష్పయోగం నిర్వహించాలని భావించినా పండితులు అభ్యంతరం తెలపడంతో నిత్యకల్యాణ మండపంలోనే చేపట్టారు. ఏకాంతంగా జరిగే కార్యక్రమం బయట నిర్వహించడం సరికాదని గత ఏడాది కూడా కొందరు పండితులు చెప్పినట్లు సమాచారం.  అయినా పట్టించుకోకుండా గత అధికారి ఆలయ ప్రాంగణంలోని వార్షిక కల్యాణవేదిక వద్దే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది  మే 24న శ్రీపుష్పయోగం జరుగుతుంది. ఈసారి అధికారులు ఎక్కడ ఏం చేస్తారోననే చర్చ నడుస్తోంది.

ఆలయం బయట సర్క్యులర్‌ మండపంపై నిర్మించిన నివేదన శాల

ప్రదక్షిణ దర్శనంలోనూ..

దేవస్థానంలో రూ.300 టికెట్టు తీసుకున్న భక్తులు ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకునేలా గత ఏడాది ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయం కింద అంతస్తులో యంత్రాలయంలో చుట్టూ పంచాయతన దేవతలు ఉండగా పైన ప్రదక్షిణ ఏమిటని విమర్శలొచ్చాయి. దీంతో యంత్రా లయానికి సమాంతరంగా పై అంతస్తులో నాలుగు మూలలా స్వర్ణ అభిషేక చందనం, స్వర్ణ హుండీ, కల్పవృక్షం, కామధేనువు ఏర్పాటు చేశారు.

శాస్త్ర సమ్మతం కాకపోయినా..

సత్యదేవుని నివేదన శాల మార్పు చర్చనీయాంశమైంది. ఇది ఆలయ ప్రాకారానికి చేర్చి ఉండేది. అక్కడే స్వామివారికి నివేదనను అర్చకులు సిద్ధం చేసేవారు. గత ఈవో ఏకపక్షంగా దీన్ని మార్పుచేశారు. ముందుగా రూ.800 వ్రత మండపం పైభాగానికి మార్చారు. ఆ తర్వాత బయట సర్క్యులర్‌ మండపంపైన నిర్మించారు. విమర్శలు రావడంతో మళ్లీ  ఆలయ ప్రాకారానికి చేర్చి నివేదన శాల ఏర్పాటుకు పనులు ప్రస్తుతం చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని