logo

గాలికొదిలేశారు.. అయిదేళ్లు గడిపేశారు

పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు.

Updated : 30 Apr 2024 07:03 IST

వేసవివేళ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు

పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు. ఆసుపత్రుల్లో మాత్రం గర్భిణులు.. చిన్నారులు.. బాలింతలు ఇలా ఎవ్వరికీ ఊపిరి ఆడనీయరు. పగలు ఎండ తీవ్రత.. రాత్రి దోమల బెడదతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి ఫ్యాన్లు, కూలర్లు తెచ్చుకుని  ఉపశమనం పొందుతున్నారు. ఇదీ వైకాపా పాలనలో పరిస్థితి.


జీజీహెచ్‌లోనూ పాట్లు

సర్జికల్‌ వార్డు-2లో తిరగని సీలింగ్‌ ఫ్యాన్‌

మసీదుసెంటర్‌(కాకినాడ): కాకినాడ జీజీహెచ్‌లోని పలు వార్డుల్లో ఫ్యాన్లు తిరగక రోగులు, సహాయకులు అవస్థలు పడుతున్నారు. మరికొన్నిచోట్ల ఫ్యాన్లు తిరుగుతున్నా గాలిరాకపోవడంతో ఇంటి నుంచి టేబుల్‌ ఫ్యాన్లు, విసన కర్రలు తెచ్చుకుని మంచాల వద్ద ఏర్పాటు చేసుకుంటున్నారు. మెడికల్‌, సర్జికల్‌, ఆర్థో, గైనిక్‌ తదితర విభాగాల్లోని పలు వార్డులో ఫ్యాన్లు తిరగడం లేదు. పలు ఐసీయూల్లో సరిపడా ఏసీలు లేకపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. ఏంఐసీయూ, ఎస్‌ఐసీయూ, ఆర్‌ఐసీయూ తదితర ఐసీయూల్లో రెండు, మూడు ఏసీలు మాత్రమే ఉన్నాయి. గోడకు ఓ పక్క మాత్రమే ఏసీలు ఉండగా, మరో పక్క ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అవీ సరిగా పనిచేయడం లేదని రోగులు వాపోతున్నారు.


పనిచేయని నీటి యంత్రం

తాళ్లపూడి, న్యూస్‌టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అరకొర నీరే ఆధారం. వేసవిలో శీతల నీరు అందించే యంత్రాన్ని కొనుగోలు చేశారు. చల్లని నీటితో పాటు వెచ్చని నీరు సరఫరా చేసేది. దానిపై తాగునీటి డబ్బాను అమర్చుతున్నారు. ఇలా నీటి డబ్బా తెచ్చుకుంటేనే నీరు. యంత్రం సరిగా పనిచేయక ఒక్కోసారి చల్లని నీరు రావడం లేదు. పైపుద్వారా తాగునీరు సరఫరా లేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.


ఫ్యాను తెచ్చుకోవాల్సిందే

ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లతో ఉపశమనం

కడియం, న్యూస్‌టుడే: కడియం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఫ్యానులు నెమ్మదిగా తిరుగుతున్నాయని, గాలి ఆడక అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. దీంతో ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకుని వినియోగిస్తున్నామన్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోతే తెచ్చుకున్న పంకాలు ఆగిపోతున్నాయని, ఆసుపత్రిలో ఫ్యాన్లు తిరిగినా ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, చంటి పిల్లలు తీవ్ర ఉక్కపోతకు గురై అస్వస్థతకు గురవుతున్నారు.


చల్లని నీరు దూరమే

సామర్లకోట, న్యూస్‌టుడే: సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 300 నుంచి 400 మంది ఓపీ రోగులు వస్తుంటారు. సుమారు 35 నుంచి 50 మంది రోగులు, బాలింతలు, గర్భిణులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులు వార్డుల్లో ఎండ తీవ్రతకు ఆసుపత్రి భవనం వేడిని తట్టుకోలేక ఇళ్ల వద్ద నుంచి స్టాండు ఫ్యాన్లు తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో రోగులు, సహాయకుల సౌకర్యార్థం దాతలు ఇచ్చిన వాటర్‌ ప్యూరిఫైర్‌, కూలర్‌ మరమ్మతులకు గురికావడం, సక్రమంగా పనిచేయక పోవడంతో సిబ్బంది వేరేచోట ఉన్న వాటర్‌ ఫ్యూరిఫైలో నీటిని బాటిల్‌లో పట్టుకుని వాటర్‌ కూలర్‌లో వేస్తున్నారు.


జనరేటర్‌ ఉన్నా..

చాగల్లు, కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే:  కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో జనరేటరు ఉన్నా నిర్వహించే వారు లేకపోవడంతో కరెంటు పోతే రోగులకు ప్రయాస తప్పడం లేదు. వేసవికి తోడు కరెంటు పోతే శిశువులను ఓదార్చడానికి తల్లులు పడే అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. టార్చి వెలుగుల్లోనే వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్న తీరు ఇక్కడ దర్శనమిస్తోంది.
వేడి తట్టుకోలేక బిడ్డ కోసం ఇంటి నుంచి కూలర్‌ తెచ్చిన బాలింత


పేరుకే ప్రాంతీయ వైద్యశాల

తుని: తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లోను  ఫ్యాన్లు లేకపోవడం, కొన్ని సరిగా తిరగకపోవడంతో ఇంటి నుంచి స్టాండు ఫ్యాన్లు తీసుకువచ్చి రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రసూతి విభాగం పైఅంతస్తులో ఉండటం, స్లాబులకు సీలింగు లేకపోవడంతో నవజాత శిశువులు, బాలింతలు తల్లడిల్లితున్నారు. కొంతమంది పడకల వద్ద  ఇంటి నుంచి ఫ్యాన్లు, కూలర్లు తెచ్చుకుంటున్నారు. ట్రామాకేర్‌, అత్యవసర విభాగాల్లో కొన్నేళ్ల నుంచి ఏసీలు పనిచేయకపోయినా నిధులు లేవని చెబుతూ మరమ్మతులు చేయించకుండా వదిలేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని