logo

కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైకాపా లక్ష్యం

కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్‌కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.

Published : 04 May 2024 04:56 IST

కూటమి అభ్యర్థులను గజమాలతో సత్కరిస్తున్న శెట్టిబలిజ నాయకులు

అమలాపురం గ్రామీణం: కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్‌కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. శెట్టిబలిజ కులస్థులను అమలాపురం పట్టణంలోని ఓ దళారీ వ్యవస్థ గతంలో నడిపించేదని సుభాష్‌ ఆరోపించారు. కోనసీమ అల్లర్ల విషయంలో దళారీ వ్యవస్థలోని కొంతమంది విశ్వరూప్‌కు కొమ్ముకాశారన్నారు. అయిదేళ్ల  శెట్టిబలిజ కులస్థులను పట్టించుకోలేదన్నారు. తనకు తొంభై రోజుల్లో అసెంబ్లీ సీటు కేటాయించారంటే.. దానికి ప్రధాన కారణం శెట్టిబలిజ కులమేనని తెలిపారు. శెట్టిబలిజ కులస్థులు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శెట్టిబలిజ ఆత్మీయ సమావేశానికి రాకుండా కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారనే విషయం మాదృష్టికి వచ్చిందని తెలిపారు. ఓటు రాజకీయ కోసమే దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం అమలాపురం పట్టణంలో పెట్టారని అన్నారు. ఎంపీ అభ్యర్థి గంటి హరీష్‌మాథుర్‌, ఎమ్మెల్యే అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ శెట్టిబలిజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.  తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మల్లుల పోలయ్య, చొల్లంగి సాయిబాబా, పలివెల శ్రీను, దొంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి

అమలాపురం కలెక్టరేట్‌: ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా శుక్రవారం ఆదేశించారు. ప్రవర్తనా నియమావళి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదని, అధికారిక పర్యటనలతో ఎన్నికల పర్యటనలను జోడించొద్దన్నారు. ఎన్నికల విధుల్లో నియమితులైన అధికారులు మంత్రుల ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ, పైలెట్‌ వాహనాలను వినియోగించరాదని సూచించారు. ప్రత్యేక వీడియో బృందాలు మంత్రులు, రాజకీయ నేత పర్యటనలు చిత్రీకరిస్తున్నాయని వీటిని ఎన్నికల పరిశీలకులు పరిశీలించి ప్రతిరోజు ఎన్నికల సంఘానికి నివేదికలు అందిస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని