logo

అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!

అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు.

Published : 06 May 2024 06:06 IST

కనికరం లేని సీఎం జగన్‌పై బాధితుల ఆగ్రహం
- న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

ఇటీవల అల్లవరం మండలం గూడాలలో కాలిపోయిన ఇళ్లు

నుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. పరిహారం అందించే విషయంలో సీఎం జగన్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కట్టుబట్టలతో మిగిలినవారిపై పాలకులకు కనికరం   కలగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఒక్క పైసా ఇవ్వలేదు..

గత ప్రభుత్వ హయాంలో అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సాయంగా 20 కేజీల బియ్యం ఇచ్చేవారు. తరువాత ఇల్లు పూర్తిగా దగ్ధమైతే ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ.3 వేల చొప్పున పరిహారం అందించేవారు. వైకాపా అధికారం చేపట్టాక ఈ అయిదేళ్లుగా బాధితులకు ఒక్క పైసాకూడా పరిహారం ఇవ్వలేదు.


దాతల సాయమే దిక్కు..

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా గడిచిన అయిదేళ్లుగా అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు, వస్తువులు, దాచుకున్న సొమ్ము, ఇతర వస్తువులు కాలి బూడిదైన వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అందలేదు. వారి దీనస్థితిని చూసి దాతలు కరుణించి అందిస్తున్న సాయం మాత్రమే దిక్కవుతోంది. కానీ రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టిన తరువాత వీరికి కనీసం కేజీ బియ్యం కూడా అందించని పరిస్థితి నెలకొంది. ఇక నగదు ఏమిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అగ్నిప్రమాద బాధితులు వివిధ రకాల స్వచ్ఛంద సేవాసంస్థలు, దాతల అందించే సాయంకోసం దీనంగా ఎదురుచూడాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా పూరి గుడిసెలు లేకుండా పక్కా గృహాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటంగా చెప్పారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జగనన్న లేఔట్లలో ఇళ్లుకాదు, ఊళ్లు నిర్మిస్తామని బీరాలు పలికి ఆచరణలోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. వీటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు పూర్తి స్థాయి మౌలిక వసతులు లేకపోవడంతో ఇంకా వేల కుటుంబాలవారు పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుదాఘాతం, వంట చేసే సమయంలో, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పేదలు నిరాశ్రయులవుతున్నారు. అయినప్పటికీ వారిపై వైకాపా ప్రభుత్వానికి దయ కలగడం లేదు.


వెబ్‌సైట్‌  మూసివేత..

రెవెన్యూ కార్యాలయాల్లో మండలాల వారీగా అగ్నిప్రమాద బాధితుల వివరాలు నమోదు చేసే వెబ్‌సైట్‌ను కూడా 2020 నుంచి మూసివేశారు. దీంతో మండలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కేవలం రెవెన్యూ అధికారులు వెళ్లి పరామర్శిస్తున్నారంతే. బాధితులు పరిహారానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది వైకాపా ప్రభుత్వం.  పథకాలకు రూ.లక్షల కోట్లు విడుదల చేసేందుకు బటన్‌ నొక్కానని చెప్పుకొనే ముఖ్యమంత్రి అగ్ని ప్రమాద బాధితులకు రూ.5 వేలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని పలువురు వాపోతున్నారు.

అయిదేళ్లలో జిల్లాలో అగ్ని ప్రమాదాలు 1,755
అధికారుల వివరాల ప్రకారం ఆస్తి నష్టం రూ.75.78 కోట్లు  
2019 నుంచి 2024 వరకు బకాయి పరిహారం సుమారు రూ.60 లక్షలు
ప్రభుత్వం నుంచి అందిన పరిహారం 0
నిరాశ్రయులైన కుటుంబాల సంఖ్య(దాదాపు) 2,000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని