logo

అధర్మకర్తల మండలి

జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి.

Published : 06 May 2024 06:28 IST

వైకాపా పాలనలో ఆలయాల్లో ఇదీ పరిస్థితి
పునరావాస కేంద్రాలుగా ఆలయ పాలకవర్గాలు
న్యూస్‌టుడే, అన్నవరం

ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మాన్ని యోగ్యంగా.. నమ్మకంగా.. శక్తివంచన లేకుండా న్యాయదృష్టితో.. జ్ఞాన విధేయంగా.. భయాభిమాన, రాగద్వేష రహితంగా.. దేవస్థానం శ్రేయస్సు దృష్ట్యా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా..

దేవాలయాల పాలక మండలి సభ్యులు ప్రమాణం స్వీకారం సమయంలో చెప్పే మాటలివి.


గనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. సభ్యులకు తోడు ప్రత్యేక ఆహ్వానితులంటూ నచ్చినవారిని నియమించడమే ఇందుకు నిదర్శనం.

తెదేపా హయాంలో..: పాలక వర్గాల నియామకానికి ముందుగా ప్రకటన విడుదల చేసేవారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి సహాయ కమిషనర్‌ కార్యాలయం ద్వారా పోలీస్‌ శాఖ నుంచి దరఖాస్తుదారుల వివరాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత సభ్యుల నియామకానికి ఉత్తర్వులు వచ్చేవి. 2017 మేలో అన్నవరం దేవస్థానానికి 16 మంది సభ్యులను నియమించారు. దీనికి గానూ 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

వైకాపా వచ్చాక..: ప్రభుత్వమే నేరుగా పాలకవర్గాలను నియమించేలా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది.  ప్రకటన లేకుండా.. సభ్యుల గత చరిత్ర పరిశీలించకుండా 2020, 2023 అన్నవరం ఆలయానికి పాలక వర్గాలను నియమించారు. గత ఏడాది  హడావుడిగా ఒక్కరోజులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు దేవాదాయశాఖ మంత్రి అనుయాయులైన ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

నిధులనూ రాబట్టలేకపోయారు: కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్‌ ద్వారా దేవస్థానానికి నిధులు తీసుకురావడంలో ధర్మకర్తల పాత్ర శూన్యం. పలు అభివృద్ధి పనులకు రూ.54.62 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్లతరబడి కదలిక కనిపించడం లేదు. ఇటీవల రూ.20 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది.  

వచ్చామా.. వెళ్లామా: గత అయిదేళ్లలో రెండు పాలక వర్గాల తీరు వచ్చామా.. వెళ్లామా అన్నట్లుంది. అన్నవరంలో అభివృద్ధి పనుల పేరిట కొండపై విధ్వంసం చేసి రూ.కోట్లు వృథా చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారు.  తెదేపా హయాంలో ధర్మకర్తల మండలి సభ్యులు పలు పనులపై అభ్యంతరం వ్యక్తం చేసి సొమ్ము వృథాకానివ్వలేదు.  

స్వప్రయోజనాలకే..: ‘మా వాళ్లు వస్తే వసతి గది ఇమ్మంటే మన వాళ్లు ఇవ్వలేదు. దర్శనానికి పంపలేదు.. మాకు గౌరవం ఇవ్వలేదు.’ ఇలాంటి అంశాలను మాత్రం ప్రస్తావించేవారే ఎక్కువ. ప్రస్తుత ధర్మకర్తల మండలిలో సభ్యుడొకరు బదిలీపై వెళ్లిన గత అధికారి హయాంలో అంతా తానై వ్యవహరించారు.

దాతలు: పాలకవర్గ సభ్యుల్లో ఇద్దరు దాతలకు తెదేపా హయాంలో ప్రాధాన్యమిచ్చేవారు. 2017 ఇలా నియమించినవారిలో ఇద్దరు పారిశ్రామిక వేత్తలు భక్తులకు సౌకర్యాలు కల్పించేలా, ఆలయాభివృద్ధికి వీరు రూ.కోట్లు ఖర్చుచేశారు. వైకాపా హయాంలో నియమించిన సభ్యుల్లో ఇటువంటి వారికి ప్రాధాన్యమివ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని