logo

కొందరికే పోస్టల్‌ బ్యాలెట్‌..

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.

Published : 08 May 2024 06:16 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం, దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం): పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కొందరు ఉద్యోగులకు దక్కడంలేదు. ఫారం-12 సమర్పించినా జాబితాలో పేర్లు లేకపోవడంతో రెండోరోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో మంగళవారం పోలీసు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్‌ విధుల్లో భాగస్వాములయ్యే ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించారు. జాబితాలో పేర్లులేక కొందరు.. తాము ఎక్కడ ఓటు వేయాలనే దానిపై స్పష్టమైన సమాచారంలేక ఇంకొందరు ఇబ్బంది పడ్డారు. మరికొందరు అక్కడే మళ్లీ ఫారం-12 పూర్తిచేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకొందరికి ఆ అవకాశం కూడా లేక వెనుదిరిగారు.  

రెండోరోజూ అవే సమస్యలు

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలోని బుద్ధభవన్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటల నుంచి పోలీసు సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు సిబ్బందిలో చాలామంది పేర్లు జాబితాలో లేవు. ఇదివరకే ఆయా పోలీస్‌స్టేషన్ల నుంచి ఫారం-12 దరఖాస్తులు ఆర్వోలకు పంపించినప్పటికీ కొందరికే బ్యాలెట్‌ వచ్చిందని చెబుతున్నారు. వర్షం కారణంగా గంటన్నర పాటు ప్రక్రియ నిలిపివేశారు.

కావాలనే చేస్తున్నారా..

ఇతర జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులు, కొందరు మైక్రోఅబ్జర్వర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ రాలేదు. ఆయా నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వచ్చి పరిశీలించుకోగా జాబితాలో పేర్లు లేకపోవడంతో మళ్లీ ఫారం-12 సమర్పించాల్సి వచ్చింది. పోలీసు సిబ్బందికి మాత్రం ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. కావాలనే గందరగోళం సృష్టించి ఓటు వినియోగించుకోకుండా చేస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు.

వైకాపా నాయకుల ప్రలోభాలు

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు వచ్చిన వారిని వైకాపా నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. గేటు బయట నిలబడి తమకు ఓటేస్తే డబ్బులు పోన్‌పే చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఓటుకు రూ.3 వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధపడినప్పటికీ కొందరు సున్నితంగా తిరస్కరించారు.

రాజమహేంద్రవరం: పోస్టల్‌

బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు క్యూలో పోలీసు సిబ్బంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని