logo

ముంపు శాపం.. ఇది వైకాపా పాపం

అయిదేళ్ల వైకాపా పాలనలో నగరంలో మూడు ప్రాణాలు కాలువల్లోనే కలిసిపోయాయి. చారిత్రక నగరిలో చినుకుపడితే కొన్ని గంటలపాటు జనం జల దిగ్బంధమే. ఏటా ముంపు ముంచెత్తుతున్నా.. ప్రాణాలు కాలువల్లో కలిసిపోతున్నా.. పాలకులకు మాత్రం పట్టదు.

Published : 08 May 2024 06:22 IST

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌ మార్గం జలమయం

అయిదేళ్ల వైకాపా పాలనలో నగరంలో మూడు ప్రాణాలు కాలువల్లోనే కలిసిపోయాయి. చారిత్రక నగరిలో చినుకుపడితే కొన్ని గంటలపాటు జనం జల దిగ్బంధమే. ఏటా ముంపు ముంచెత్తుతున్నా.. ప్రాణాలు కాలువల్లో కలిసిపోతున్నా.. పాలకులకు మాత్రం పట్టదు. సుందరీకరణ పేరిట పైపై మెరుగులకు రూ.కోట్లు ఖర్చుచేసే పాలకులు శాశ్వత నిర్మాణ పనుల ప్రతిపాదనలు పట్టలెక్కించరు...పట్టించుకోరు. దీంతో వర్షం పడితే నగరవాసులు వణికిపోతున్నారు.

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, టి.నగర్‌, ఏవీఏ రోడ్డు: వైకాపా పాలనలో చారిత్రక నగరం రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చేశాం.. మళ్లీ అధికారమిస్తే రాజమహేంద్రవరాన్ని విశ్వనగరంగా చేసేస్తాం..’ ఇదీ ప్రస్తుత ఎంపీ, అర్బన్‌ వైకాపా అభ్యర్థి భరత్‌రామ్‌ నిత్యం చెప్పే మాటలు. ఇదంతా నిజమేనేమో అనే భావనలో ఉన్న కొద్దిమందికి మంగళవారం నగరంలో కురిసిన భారీ వర్షంతో ఆ సంశయం కూడా తీరిపోయింది.  అయిదేళ్లు ఎంత అభివృద్ధి జరిగిందో కళ్లముందు మరోసారి కనిపించింది. ఆహ్లాద నగరాన్ని మురుగు మయం చేశారనే వేదన అంతటా వినిపించింది.

ఎందుకీ పరిస్థితి

కాస్త వర్షానికే నగరం జలదిగ్బంధమవుతోంది. సాధారణ రోజుల్లో మురుగు నల్లాఛానల్‌, ఆవ ఛానల్‌ ద్వారా నదిలో కలుస్తోంది. గోదావరి ప్రవాహానికంటే నగరం దిగువన ఉండడంతో నీరు బయటకు వెళ్లే పరిస్థితి. గోదావరి వరదల సమయంలో జలాలు నగరంలోకి చొచ్చుకురావడం.. వర్షాల సమయంలో నగరంలో పడిన నీరంతా బయటకు వెళ్లేందుకు సరైన అవుట్‌లెట్లు లేక లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోవడంతో ముంపు సమస్య వెంటాడుతోంది.

రూ.200 కోట్లు కేటాయించలేరా

రోజూ నగరంలో 60 ఎంఎల్‌డీ మురుగు వస్తుంటే.. వర్షం కురిస్తే ఇది మరింత పెరుగుతుంది. అది తిరిగి గోదావరిలో కలిసేందుకు సరైన కాలువల వ్యవస్థ లేదు. నగరంలో కాలువల విస్తరణకు ప్రభుత్వం నిధులు విదల్చలేదు. పాలకులు ఆకర్షణీయ పనులకే ప్రాధాన్యమిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో కాలువలను విస్తరించాలంటే కనీసం రూ.200 కోట్లు అవసరమని అధికారులు నిర్థారించారు. వాటిని తెచ్చే ప్రయత్నమే పాలకులు చేయడం లేదు.

అమృత్‌ పథకం అటకెక్కించారు..

నగరంలో ముంపు నివారణంలో భాగంగా గతంలో తలపెట్టిన కాలువ ఆధునికీకరణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కరోనాకు ముందు అమృత్‌ పథకంలో సుమారు రూ.80 కోట్ల విడుదలకు కేంద్రం ఆమోదించింది. రూ.60 కోట్లతో కాలువల విస్తరణకు పనులు ప్రారంభించగా.. సుమారు రూ.32 కోట్ల మేర పనులు చేశారు. తరువాత కొవిడ్‌ నేపథ్యంలో బిల్లులు రాకపోవడంతో అక్కడితో నిలిచిపోయాయి.

ప్రతిపాదనలు దాటని పనులు

  • నేతాజీనగర్‌, చైతన్యనగర్‌, రామకృష్ణానగర్‌, ఆవ ప్రాంతంలో ముంపు నివారణకు రూ.4 కోట్లతో పంపింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు టెండర్లు దశలోనే ఉన్నాయి.  ‌్ర పేపరుమిల్లు, సీతంపేట రోడ్డు మీదుగా నల్లాఛానల్‌లో కలిసేలా సుమారు రూ.5 కోట్లతో కాలువల విస్తరణ పనులు ప్రతిపాదనల్లోనే ఉంది.

రూ.కోట్లు పైపై మెరుగులకే!

ముంపు సమస్య పక్కనపెట్టి సుందరీకరణ పేరుతో రూ.కోట్లు తగలేస్తున్నారనే వేదన ప్రజల్లో ఉంది. ఉద్యానాలు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పేరిట రూ.లక్షల్లో పెట్టి రూ.కోట్లు ఖర్చయినట్లు చూపుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఖర్చును మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిసినా చొరవచూపే ప్రయత్నమే లేదు.

యూజీడీ వ్యవస్థకు సూచించినా..

గత పుష్కరాలకు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నగరంలో పర్యటించింది. భద్రత దృష్ట్యా బహిరంగ కాలువ వ్యవస్థను తీసివేయాలని సూచించింది. కేవలం భూగర్భ కాలువ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నగర విస్తీర్ణం, రోడ్ల వెడల్పును దృష్టిలో పెట్టుకొని బహిరంగ కాలువల కంటే భూగర్భ కాలువలకు మొగ్గు చూపాలని పేర్కొంది. దీనిపై నివేదికను అప్పటి మేయర్‌కు అందించారు. సుమారు రూ.600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపించడం, ఆ తరువాత ప్రభుత్వం మారడంతో అవన్నీ బుట్టదాఖలయ్యాయి.

కాలువలు.. కష్టాలు

  • బొమ్మూరు జాతీయ రహదారి నుంచి ఆవలో కలిసేలా రూ.9 కోట్లతో తలపెట్టిన కాలువ నిర్మాణం నిలిచిపోయింది. నగరపాలక సంస్థ ప్రణాళిక లేకుండా పనులు చేయడంతో సాయిమార్గ్‌ రోడ్డులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు.
  • కంబాలచెరువు నుంచి కోరుకొండ రోడ్డులో సుమారు రూ.7 కోట్లతో కాలువ, రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించగా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఇవి పూర్తయితే మార్కెట్‌ యార్డు, రామకృష్ణ మఠం వద్ద ముంపు సమస్య తగ్గుతుంది.
  • కోటిపల్లి బస్టాండ్‌ నుంచి రైల్వేస్టేషన్‌, ఆల్కాట్‌ గార్డెన్స్‌ మీదుగా రూ.7 కోట్లతో అమృత్‌ నిధులతో కాలువ విస్తరణ పనులు పట్టాలెక్కలేదు. రైల్వే సుమారు 500 మీటర్లు మేర పది అడుగుల చొప్పున ఇచ్చేందుకు సిద్ధపడగా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలు ముందుకు కదలలేదు.
  • కోటగుమ్మం, మెయిన్‌ రోడ్డు మీదుగా డీలక్స్‌ సెంటర్‌ వరకు రూ.2 కోట్లతో కాలువల విస్తరణ పనులు కూడా నిలిచిపోయాయి.

ఇంకెందరి ప్రాణాలు పోవాలి?

  • భారీ కాలువల నిర్మాణ విషయంలో యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలైన తరువాత యంత్రాంగం నిద్ర లేచింది. ప్రస్తుతం ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి.
  • సాయిమార్గ్‌లో గత ఏడాది అసంపూర్తి కాలువ నిర్మాణ పనుల కారణంగా వర్షాల సమయంలో ఓ వ్యక్తి కాలువలో పడి మృత్యువాత పడ్డారు.  
  • ఆవ ఛానల్‌లో గతంలో వృద్ధుడు రాత్రిపూట సైకిల్‌పై వెళ్తూ అదుపుతప్పి కాలువలో పడి మృతి చెందాడు.
  • కొద్ది నెలల క్రితం వాంబే గృహాలను ఆనుకుని ఉన్న ప్రధాన కాలువలలో మణికంఠ అనే బాలుడు మృత్యువాతపడ్డాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు