logo

మృతుల కుటుంబాల రోదన జగన్‌ చెవికెక్కని వేదన

మృతుల కుటుంబాలపైనా ముఖ్యమంత్రి జగన్‌ దయ చూపలేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరా కల్పించలేకపోయింది. దురదృష్టవశాత్తూ సాధారణ, ప్రమాద మరణాలు పొందిన వారి కుటుంబాలకు సకాలంలో బీమా పరిహారం చెల్లించకుండా నరకం చూపించారు.

Published : 08 May 2024 06:28 IST

వైఎస్‌ఆర్‌ బీమాపథకం అర్హుల కుదింపు
బాధిత కుటుంబాలకు సకాలంలో అందని సాయం

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌: మృతుల కుటుంబాలపైనా ముఖ్యమంత్రి జగన్‌ దయ చూపలేదు. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరా కల్పించలేకపోయింది. దురదృష్టవశాత్తూ సాధారణ, ప్రమాద మరణాలు పొందిన వారి కుటుంబాలకు సకాలంలో బీమా పరిహారం చెల్లించకుండా నరకం చూపించారు.

తెదేపాలో బాధితులకు అండగా..

తెదేపా ప్రభుత్వంలో 2014-19 మధ్య చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేశారు. 18 ఏళ్లు దాటిని కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఈ పథకాన్ని వర్తింప చేశారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వ్యక్తులు సాధారణ మరణం పొందితే రూ.2 లక్షలు బీమా పరిహారం ఇచ్చేవారు. పెద్ద కర్మ రోజునే ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందించేవారు. ప్రమాద మరణాలకు రూ.5 లక్షలు ఇచ్చేవారు. ఈ సాయాన్ని బాధిత కుటుంబానికి సకాలంలో అందజేసి ఆసరా కల్పించేవారు. 18 -70 ఏళ్ల వయసు వారికి ప్రమాద బీమా వర్తింప చేసేవారు. ఈ పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేసి పేద కుటుంబాలకు తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది.

వైకాపా ప్రభుత్వంలో కోతలు..

జగన్‌ ప్రభుత్వం వచ్చాక సాధారణ మరణం పరిహారాన్ని రూ..లక్షకు కుందించింది. కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేశారు. అయిదేళ్లు ఏటా ఈ పథకం రెన్యువల్‌ పేరుతో కాలయాపన చేయడంతో బాధిత కుటుంబాలకు పరిహారం జారీలో తీవ్ర జాప్యం జరిగింది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం అమలు ప్రహసనంగా మారింది.

ప్రీమియం చెల్లింపులోనూ నిర్లక్ష్యం..

ఏటా జులై ఒకటి నుంచి వచ్చే జూన్‌ 30 వరకే ఈ పథకాన్ని వర్తింప చేసేవారు. మళ్లీ రెన్యువల్‌ అయితేనే కొనసాగేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో నాలుగు నెలలపాటు బీమా పథకానికి ప్రీమియం చెల్లించలేదు. ఈ నాలుగు నెలల కాలంలో మరణించిన వ్యక్తుల వివరాలను ఆన్‌లైన్‌ చేయలేదు. ఇలా వందల మంది జిల్లాలో నష్టపోయారు. వీరంతా డీఆర్‌డీఏ కార్యాలయం, వైకాపా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఆ  కుటుంబాలకు ఇప్పటికీ మేలు జరగలేదు.

పరిహారానికి ఎడతెగని నిరీక్షణ..

కాకినాడ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2023 జులై నుంచి వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని పునరుద్ధరించారు. అప్పటి నుంచి మార్చి 16 వరకు జిల్లాలో 1,073 సాధారణ మరణాలు సంభవించాయి. వీటిలో 1066 క్లెయిమ్‌లు ఆన్‌లైన్‌ చేశారు. వీరిలో 1,011 మందికి పరిహారం మంజూరు చేశారు. 86 ప్రమాద మరణాలు సంభవించాయి. సాధారణ మరణాలకు జులై నుంచి మార్చి వరకు ఒక్క బాధిత కుటుంబానికీ బీమా పరిహారం చెల్లించలేదు. ఎన్నికల కోడ్‌ రాక ముందు వీటికి నిధులు మంజూరు చేశారు. జులై నుంచి మార్చి వరకు పైసా పరిహారం ఇవ్వలేదు. చివరిలో హడావుడిగా నిధులిచ్చారు.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ నమోదు నిలిపివేత

ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ బీమా పథకంలో ఆన్‌లైన్‌ నమోదును నిలిపివేశారు. మార్చి 16 నుంచి వీటికి సంబంధించిన కార్యకలాపాలు ఆగిపోయాయి. సాధారణ, ప్రమాద మరణాల వివరాలను ఆయా గ్రామ/వార్డు సచివాలయాల్లో నమోదు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న వైఎస్‌ఆర్‌ బీమా కార్యాలయానికి వివరాలు పంపించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని