logo

ఆయుష్‌ తీసేసిన జగన్‌!

ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో హోమియో, ఆయుర్వేదం, యునాని విభాగాల్లో ఏదో ఒక దానిని ఏర్పాటు చేసి గతంలో వైద్యులు, సిబ్బందిని నియమించారు.

Published : 08 May 2024 06:44 IST

న్యూస్‌టుడే, మామిడికుదురు, పి.గన్నవరం : ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో హోమియో, ఆయుర్వేదం, యునాని విభాగాల్లో ఏదో ఒక దానిని ఏర్పాటు చేసి గతంలో వైద్యులు, సిబ్బందిని నియమించారు. వైద్యులు, మందులు ఉండడం వల్ల ప్రతి రోజూ దాదాపు 40 నుంచి 50 మంది వరకు అక్కడికి ఆయా రోగులు వచ్చి వైద్య సేవలను వినియోగించుకునే వారు. కాలక్రమేణా వైద్యులు లేకపోవడం, ఇన్‌ఛార్జిల నియామకాలతోనే సరిపెట్టడం, అందులో పనిచేసే తాత్కాలిక సిబ్బందే వైద్యం, మందులు అందజేస్తూ వచ్చారు. ఆయుష్‌ శాఖకు 2014-15 నుంచి 2019-20 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.145 కోట్లు కేటాయించాయి. అందులో ఉన్న రూ.65 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వీటికి వ్యయం చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు గత రెండేళ్లుగా నిలిచిపోవడంతో ఆయా ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 13 హోమియో, 9 ఆయుర్వేదం, ఒక యునానికి సంబంధించి 23 ఆసుపత్రుల్లో రెండు మూడు చోట్ల మినహా మిగతా అన్ని చోట్లా వైద్యులు లేరు. సిబ్బందితోనే వాటిని ఎలాగొలా నిర్వహించేస్తున్నారు. జిల్లాలో ఒక్కో భవనానికి రూ.3.50 లక్షల వ్యయంతో ఆధునికీకరణ చేయాలని గత ఏడాది ప్రతిపాదనలు చేసినా అమలుకు నోచుకోలేదు.

ఏళ్ల కాలంగా ఎంతో మందికి దీర్ఘకాలిక, మొండి రోగాల నయానికి ఉపయోగపడిన ఆయుర్వేదం, హోమియో, యునాని ఆసుపత్రులపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో వాటి ప్రాధాన్యం దాదాపు తగ్గిపోయింది. ఆయుష్‌ శాఖలో నడుస్తున్న వీటికి గత ఏడాది కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా మళ్లించేయడంతో అవి మరింత నిర్వీర్యంగా మారిపోయాయి. కొన్ని చోట్ల సిబ్బందితో, చాలీచాలని మందులతో నామమాత్రంగా ఇవి నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈ ఆసుపత్రులు పూర్తిగా మూతపడ్డాయి.

జగన్‌ నిర్లక్ష్యానికి కొన్ని సాక్ష్యాలు ఇవే...

  • మామిడికుదురు మండలం పాశర్లపూడిలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించిన భవనం పూర్తిగా శిథిలమైంది. దీంతో రెండున్నరేళ్లుగా ఇది పూర్తిగా మూతపడిపోయింది.
  • రాజోలు మండలం తాటిపాకలోని ఆయుర్వేద ఆసుపత్రికి వైద్యుడ్ని నియమించినా వేరే చోటకు ప్రతినియుక్తి చేయడం, అక్కడి భవనం శిథిలావస్థకు చేరడంతో ఆసుపత్రికి సంబంధించిన సేవలు అందకుండా పోయాయి.
  • పి.గన్నవరం మండలం నరేంద్రపురంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఏళ్ల కాలంగా వైద్యుడు, సహాయకుడు లేరు. నిత్యం 40 మంది వరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రోగులు ఆయుర్వేద వైద్యానికి దూరమయ్యారు.
  • నగరం పీహెచ్‌సీకి చెందిన పాత భవనంలో యునాని ఆసుపత్రి ఉన్నా గత రెండున్నరేళ్లుగా ఇక్కడ వైద్యుడు లేరు. సహాయకురాలే వచ్చిన వారికి ఉన్నంత మేరకు మందులు ఇస్తున్నారు. అవసరాల మేరకు మందులు ఉండకపోవడం, వైద్యుడు లేకపోవడంతో అక్కడికి వచ్చే వారు పూర్తిగా తగ్గిపోయారు.

దృష్టిసారించకపోవడం తగదు

ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలోని ఆసుపత్రులను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. నగరంలో యునాని ఆసుపత్రి ఉన్నా అక్కడ ఏళ్లకాలంగా వైద్యుడు పోస్టు భర్తీ చేయడం లేదు. మందులు కూడా అరకొరగానే ఉంటున్నాయి. దీంతో అక్కడికి వైద్యానికి వెళ్లే వారు బాగా తగ్గిపోయారు. వీటిని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

మీర్‌ అబ్రార్‌హుస్సేన్‌, విశ్రాంత ఉద్యోగి, నగరం

అన్ని చోట్లా వైద్యులను నియమించాలి

హోమియో, ఆయుర్వేదం, యునాని ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. వీటి విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిన కారణంగా ఆయా ఆసుపత్రుల పరిస్థితి నిరుపయోగంగా మారింది. భవనాలకు ఆధునికీకరణ సైతం కొరవడడంతో ఇబ్బందికరంగా ఉన్నాయి. పలు చోట్ల వీటిని మూసివేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం.

గాలిదేవర సత్యనారాయణ, పాశర్లపూడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు