logo

పాపం.. ఆ పిల్లలు వైద్యానికి దూరమయ్యారు!

నిరుపేద కుటుంబంలో జన్మించిన విద్యార్థులు తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగానికి దూరంగా ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటున్న వీరికి ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి,

Published : 18 Aug 2022 06:04 IST

మూడేళ్లుగా నిలిచిన ఆరోగ్యకార్డుల పంపిణీ
పొన్నూరు, న్యూస్‌టుడే


పెదనందిపాడు మండలం, అన్నపర్రు బీసీ వసతిగృహంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు

నిరుపేద కుటుంబంలో జన్మించిన విద్యార్థులు తల్లిదండ్రుల ఆప్యాయత, అనురాగానికి దూరంగా ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటున్న వీరికి ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అందుకు సంబంధించిన వివరాలను ఆరోగ్యకార్డులో నమోదు చేయాల్సి ఉంది. గత మూడేళ్లుగా ఆ కార్డుల పంపిణీ అటకెక్కింది. వసతిగృహాల్లోని విద్యార్థుల నాడి పట్టే నాథుడే కన్పించడంలేదు. జిల్లాలో గుంటూరు, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో వెనుకబడిన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే వసతిగృహాలు 30 వరకూ ఉన్నాయి. వీటిలో సుమారు 2 వేల మంది దాకా విద్యార్థులున్నారు. 

* 2018 - 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వీరికి ఆరోగ్య కార్డులను పంపిణీ చేసింది. 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో ఇవ్వలేదు. కరోనా వైరస్‌ కారణంగా రెండేళ్ల పాటు వసతిగృహాల తలుపులు మూతబడ్డాయి. కొవిడ్‌ కేసులు తగ్గు ముఖం పట్టిన తర్వాతే ఇవి తెరుచుకున్నాయి.  
* వసతిగృహాలను సందర్శించే వైద్యులు ప్రతి నెల విద్యార్థుల ఎత్తు, బరువు, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే అస్వస్థతకు కారణం, ఆసుపత్రికి పంపిన తేదీ, చికిత్సకు వాడిన మందులు తదితర వివరాలను కూడా ఆరోగ్యకార్డుల్లో పొందుపరచాల్సి ఉంది. అన్ని హాస్టళ్లను పునఃప్రారంభించి నెల గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వైద్యులు విద్యార్థుల నాడి పట్టలేదు. కొన్ని చోట్ల ఆరోగ్య సిబ్బంది వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు కానీ.. ఆ వివరాలు నమోదు చేసేందుకు కార్డులు అందుబాటులో లేకపోవడంతో వివరాల నమోదు ప్రక్రియను పక్కన పెట్టారు. ప్రస్తుతం అనేక చోట్ల వసతిగృహాల్లో ఉంటున్న పిల్లలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో వారే మెడికల్‌ స్టోర్‌కు వెళ్లి ఏవో మందులు తీసుకొచ్చి వాడుకొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆరోగ్యకార్డులు పంపిణీ చేయడంతో పాటు.. వసతిగృహ విద్యార్థులకు రెగ్యులర్‌గా వైద్యపరీక్షలు చేసేలా సిబ్బందిని పురమాయించాల్సి ఉంది.


గత ప్రభుత్వం పంపిణీ

చేసిన ఆరోగ్య కార్డు : త్వరలో  అందిస్తాం
బీసీ వసతిగృహాల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు ఆరోగ్యకార్డులు అందించలేదు. అయితే వీలైనంత త్వరగా వాటిని అందిస్తాం.

- నరసారెడ్డి, జిల్లా అధికారి, బీసీ సంక్షేమశాఖ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని