logo

చిరుధాన్యాలు.. సిరులు

పల్నాడులో సాగర్‌ జలాలు రాక ముందు ఇక్కడ ప్రజలకు చిరుధాన్యాలే ప్రధాన ఆహారం.

Updated : 06 Feb 2023 06:11 IST

పోషక విలువ ఆహారంతో  ఆరోగ్యం

జిల్లాలో 1400 హెక్టార్లలో సాగు లక్ష్యం
న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌, నరసరావుపేట టౌన్‌

పల్నాడులో సాగర్‌ జలాలు రాక ముందు ఇక్కడ ప్రజలకు చిరుధాన్యాలే ప్రధాన ఆహారం. కాలక్రమంలో కృష్ణమ్మ పరవళ్లతో వరి సాగు పెరిగింది. చిరుధాన్యాల సాగు కనిష్ఠ స్థాయికి పరిమితమైంది. గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో చిరుధాన్యాల్లో అత్యధికంగా ఉండే పోషకాల గురించి ప్రజలకు అవగాహన పెరిగింది. పేదల ఆహారంగా ఉన్న రాగులు, వరిగలు, జొన్నలు, సజ్జలు నేడు ధనవంతులు ఆరోగ్య అభిలాషులకు ప్రీతిపాత్రమయ్యాయి. కొవిడ్‌ సమయంలో మరోసారి ఆహారంలో పోషక విలువల ప్రాధాన్యత అందరికీ తెలిసి వచ్చింది. ప్రపంచంలోనే చిరుధాన్యాల సాగు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్రం చొరవతో 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలపై అవగాహన పెంచడంతో పాటు సాగును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో వరిగలు 250 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జొన్న మరో 25 హెకార్టలో సాగు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జిల్లా 1400 హెక్టార్లలో చిరుధాన్యాల సాగు చేయాలని లక్ష్యం విధించింది. తదనుగుణంగా అధికారులు జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకేచోట 250 ఎకరాలు ఉండేలా చూసి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి సాగు చేయించాలన్నది అధికారుల ఆలోచన.  

ప్రోత్సాహకాలు..

చిరుధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. రైతుకు రూ.6వేల చొప్పున ప్రోత్సాహం ప్రభుత్వం ఇస్తోంది. విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ అవసరాలకు వీటిని వినియోగించుకునే వీలుంది. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధరలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. క్వింటాకు రూ.2500 చెల్లిస్తారు. పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు చిరుధాన్యాలతో వండి వడ్డించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పౌరసరఫరాలశాఖ చిరుధాన్యాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.

ఆదాయం మిన్న

వరి, మిర్చి, పత్తి ఏ పంట సాగు చేసినా ఎక్కువ పెట్టుబడి అవుతోంది. అదే చిరుధాన్యాల్లో గరిష్ఠంగా 15వేలకు మించి కాదు. ఆదాయం తీసుకుంటే మార్కెట్‌ ధరలు, వాతావరణ పరిస్థితులు, వచ్చిన దిగుబడి ఆధారంగా ఉంటుంది. ఈఏడాది పరిశీలిస్తే ఎకరాకు రూ.2లక్షల వ్యయం చేసి మిర్చి సాగు చేసిన రైతుకు నాలుగు లక్షలు ఆదాయం లభించినట్లు అంచనా అదే. చిరుధాన్యాలను పరిశీలిస్తే కచ్చితంగా రూ.30వేలకు వరకూ ఆదాయం లభించింది. పైగా సాగులో సమస్యలు తక్కువ. తక్కువ నీటితో సాగు చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మిగిలిన పంటలపై వాతావరణం, తెగుళ్ల ప్రభావం అధికంగా ఉంటుంది.

రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

రైతులకు అవగాహన పెంచుతున్నాం

జిల్లాలో 1400 హెక్టార్లలో చిరుధాన్యాల సాగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర పంటల మాదిరిగా కాకుండా పంటను పూర్తిగా కొనేందుకు అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడి, నష్ట భయం లేకుండా సాగు చేయాలన్న లక్ష్యంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అంతే కాకుండా చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

మురళి, జిల్లా వ్యవసాయాధికారి, నరసరావుపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని