logo

అలా..చతికిలపది!

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది.

Published : 23 Apr 2024 06:21 IST

ఆరు నుంచి 16వ స్థానానికి దిగజారి..
టెన్త్‌ ఫలితాల్లో జిల్లా వెనుకంజ

న్యూస్‌టుడే, గుంటూరు విద్య : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు గతేడాది కంటే 10 స్థానాలు దిగజారి వెనుకబడింది. 2022- 23 సంవత్సరంలో జిల్లా ఆరో స్థానంలో నిలవగా ఈ ఏడాది 16వ స్థానానికి దిగజారింది. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు. ఈ ఏడాది జిల్లా ఉత్తీర్ణత 88.14 శాతంగా నమోదైంది. దీనిలో బాలుర శాతం 86.46 కాగా బాలికలు 89.99 శాతం మంది ఉత్తీర్ణత సాధించి సత్తాచాటారు. గిరిజన గురుకుల విద్యాలయాల్లో అతితక్కువగా 66.67 ఉత్తీర్ణత శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలల్లో నాడు- నేడు కింద అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడంతో ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్తు, మున్సిపల్‌, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో కూడా నిరాశాజనక ఫలితాలే వెలువడ్డాయి.

జిల్లాలో ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కింద నడుస్తున్న గురుకుల పాఠశాలల్లో మాత్రం 96.85 శాతం ఉత్తీర్ణతను అందుకున్నారు. తర్వాత ప్రైవేటు పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థుల్లో 96.50 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లా పరిషత్తు పాఠశాలల్లో యనమదల జడ్పీ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. విద్యార్థిని షేక్‌ రిహానా 583 మార్కులు సాధించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో వేణుగోపాల్‌నగర్‌ కోన బాలప్రభాకరరావు ఉన్నత పాఠశాల 93 శాతం, స్తంభాలగరవు ఉన్నత పాఠశాల, స్వర్ణాంధ్రనగర్‌ ఉన్నత పాఠశాలలు 86 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. మార్కుల విషయంలో నవభారత్‌నగర్‌ బొర్రా నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్‌ ఫాతిమాతబసుం 582 మార్కులు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని