logo

పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉద్యోగుల కష్టాలు

తొలిరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడంలో ఉద్యోగులు అవస్థలు పడ్డారు.

Published : 06 May 2024 04:55 IST

గంటల కొద్దీ నిల్చుని పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం

వినుకొండలో ఓటు వేయడానికి వరుసలో నిల్చొన్న ఉద్యోగులు

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: తొలిరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడంలో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. సరిపడా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇబ్బందులెదురయ్యాయని ఉద్యోగులు వాపోయారు. నరసరావుపేట మినహా మిగతా నియోజకవర్గాల్లో రెండే పోలింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకూ క్యూలైన్లు కదలకపోవడంతో అప్పటికప్పుడు మూడో పోలింగ్‌ కౌంటర్‌ పెట్టారు. పెదకూరపాడులో అయితే కలెక్టర్‌ వచ్చిన తర్వాత మధ్యాహ్నం మూడో పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేయడంతో కొంతవరకూ ఉపశమనం కలిగింది. జిల్లాలోనే అత్యధికంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ఉద్యోగులు నరసరావుపేటలో ఉంటే ఇక్కడా మూడే కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఉక్కపోతతో గంటలకొద్దీ వరుసల్లో నిల్చొని అల్లాడిపోయారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఒకేవరుసలో ఉండడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్‌ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించే వరకూ తాగునీటి వసతి కల్పించకపోవడం, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులుపడ్డారు. మరోవైపు అంగన్‌వాడీలకు డిక్లరేషన్‌ ఫాం పూర్తిచేయడంలో అవగాహన లేకపోవడంతో సందేహాలు తీర్చుకోవడానికి అధిక సమయం పట్టింది. శిక్షణలోనే దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ రోజు ఇబ్బందులు ఉండేవి కావని కొందరు ఉద్యోగులు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవడంతో వారికి పూర్తిస్థాయి అవగాహన కూడా లేకపోవడం ఆలస్యానికి మరో కారణమైంది. పోలింగ్‌ రోజు పీవో, ఏపీవో, ఓపీవోలుగా పనిచేసే వారంతా తొలిరోజైన ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారన్నారని కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ తెలిపారు. సమయం మించిపోయినా భారీస్థాయిలో ఉద్యోగులు మిగిలిపోవడంతో వీరందరికీ 6, 7, 8 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మొత్తం 10,240 మందికి గాను 8,015 మంది ఓటర్లు బ్యాలెట్‌ ఓట్లు వేశారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఉద్యోగులను వైకాపా ప్రలోభ పెట్టింది. ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున పంపిణీ చేసింది. కొందరు తీసుకోగా మరికొందరు నిరాకరించారు. పెదకూరపాడులో అయితే ఒక్కో ఉద్యోగికి ఏకంగా రూ.5వేలు ఇచ్చినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని