logo

మా ఆస్తులపై.. నీ పెత్తనం ఏంటీ జగన్‌!

ప్రస్తుతం రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చర్చ తీవ్రమవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులపై జగన్‌ పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated : 06 May 2024 06:37 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై సామాన్యులు ఆందోళన
మేల్కొనకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలకు తీవ్ర నష్టం
ఈనాడు-బాపట్ల, న్యూస్‌టుడే - చీరాల

ప్రస్తుతం రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చర్చ తీవ్రమవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులపై జగన్‌ పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టంలో అనేక అంశాలు ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉండడంతోపాటు భవిష్యత్తులో అనేక సమస్యలకు మూలకారణాలవుతాయన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. ప్రజల్లో విస్తృతమైన చర్చ పెట్టి ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చట్టాలను రూపొందించకుండా హడావుడిగా చేస్తే ఇలాంటి విపరిణామాలు ఎదురవుతాయని మేధావులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది. వీరందరూ సాగు చేస్తున్న భూములకు చాలామంది వద్ద హక్కు పత్రాలు ఉండవు. వీరంతా వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. వీరు హక్కుపత్రాలు చూపి నిర్ధారించుకోవాల్సి ఉన్నందున వారికి అన్యాయం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములపై ఎవరైనా అభ్యంతరం తెలిపితే వాటిని వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వివాదం పరిష్కారమయ్యేంత వరకు సదరు భూమి తనఖా పెట్టడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఇది పేదవర్గాలకు చాలా ఇబ్బందికరమైన అంశం. అంతేకాకుండా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత హక్కుదారులు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారికి నిర్ణీత సమయంలో తెలియజేయకపోతే బాధ్యులైనవారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష వేయడం అసంబద్ధమైన నిర్ణయమని నిపుణులు వాపోతున్నారు.

మూడు నెలలుగా ఆందోళన చేసినా..

ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు నెలలకుపైగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేసినా ప్రభుత్వం దిగిరాలేదు. ప్రజలకు కూడా అవగాహన లేక ఇది న్యాయవాదులకు సంబంధించిన అంశమని మిన్నకుండిపోయారు. అయితే ఈ చట్టం విధివిధానాలను అధ్యయనం చేసిన విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, మేధావులు చర్చావేదికలు నిర్వహించడం, ప్రతిపక్ష పార్టీలు చట్టం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో అందరూ అప్రమత్తమయ్యారు. చట్టాన్ని తెలుగులోకి అనువాదం చేసి విస్తృత ప్రచారంలోకి తీసుకురావడంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు, సాగుదారులు 80 శాతం మంది ఉన్నారు. చిన్న కమతాలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి స్థానిక సివిల్‌ కోర్డులకు వెళ్లే వెసులుబాటు లేదు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(టీఆర్‌వో), ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ అధికారులు(ఎల్‌టీఏవో) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు హైకోర్టు స్థాయిలో అధికారుల ఆదేశాలను సవాల్‌ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న వారిని వెంటాడుతోంది. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములు, ఆస్తులు, దుకాణాలు ఇలా ఎలాంటి స్థిరాస్తులైనా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి పరిధిలోనే ఉంటాయి. టీఆర్‌వో, ఎల్‌టీఏవోలను రాష్ట్ర స్థాయిలో అథారిటీ నియమిస్తుండడం, ఇందుకు ఎలాంటి విధానాలు అనుసరిస్తారో స్పష్టత లేకపోవడంతో న్యాయవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.


చట్టాన్ని రద్దు చేసే వారికే మా మద్దతు

వైకాపా ప్రభుత్వం పూర్తి దురుద్దేశపూరితంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. చట్టం తెచ్చే ముందు రైతులు, ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదు. కొత్త చట్టం వల్ల మా లాంటి రైతుల భూములకు రక్షణ ఉండదు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు భూముల యజమానులను బెదిరింపులకు గురి చేయడానికి, వేధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదంపై స్థానిక సివిల్‌ కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. హైకోర్టుకు మా లాంటి చిన్న రైతులు వెళ్లగలరా. ఎన్నో ఏళ్లుగా మా ఆస్తులకు సంబంధించి భద్రపరుచుకున్న దస్తావేజులకు విలువ లేకుండా చేయటం ఏమిటి. చట్టాన్ని రద్దు చేసే వారికే ఎన్నికల్లో మద్దతు ఇస్తాం.

సీహెచ్‌ సుబ్బారావు, రైతు, బాపట్ల


ప్రజల హక్కులను కాలరాయడమే

భూహక్కు చట్టంలో టైటిల్‌ డీడ్‌పై అభ్యంతరాలు ఉంటే వాటిని న్యాయస్థానంలో కాకుండా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ఇదే అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ ఉండే అధికార్లు అధికార పార్టీ చేతిలో ఉంటారు. ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది. గతంలో ఏ సమస్య వచ్చిన న్యాయస్థానాలను ఆశ్రయించేవారు. అక్కడ బాధితులకు న్యాయం జరిగేది. ఇపుడు న్యాయస్థానం ప్రమేయం లేకపోవడం దారుణం. ఇది ప్రజల హక్కులను కాలరాయటమే.

కొండయ్య, న్యాయవాది, చీరాల


ఎవరు బాధ్యత వహిస్తారు..?

ఎంతో కష్టపడి ఆస్తులు కొనుగోలు చేస్తాం. అటువంటి భూమికి సంబంధించి అసలైన పత్రాలు ఇవ్వకుండా జిరాక్సులే ఇవ్వటం దారుణం. ఒరిజినల్‌ పత్రాలు లేకపోవడం అభ్యంతరకరం. దీన్ని దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తి పేరు మార్చుకుంటే ఎవరిది బాధ్యత. టైటిల్‌ డీడ్‌పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ అధికారులే పరిష్కరించటం పేదలకు నష్టం చేస్తుంది.

పరుచూరి శ్రీనివాసరావు, చీరాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని