logo

జనం ఆస్తులపై.. జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది.

Updated : 06 May 2024 06:39 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలకు తీవ్ర నష్టం
అవగాహన లేకపోతే సామాన్యులు సమిధలే
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం తీరిది
ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, కలెక్టరేట్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది. వీరందరూ సాగు చేస్తున్న భూములకు చాలా మంది వద్ద హక్కుపత్రాలు ఉండవు. వీరందరూ వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. వీరు హక్కుపత్రాలు చూపి నిర్ధారించుకోవాల్సి ఉన్నందున వారికి అన్యాయం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములపై ఎవరైనా అభ్యంతరం తెలిపితే వాటిని వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వివాదం పరిష్కారమయ్యేంత వరకు సదరు భూమి తనఖా పెట్టడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఇది పేదవర్గాలకు చాలా ఇబ్బందికరమైన అంశం. అంతేకాకుండా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత హక్కుదారులు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారికి నిర్ణీత సమయంలో తెలియజేయకపోతే బాధ్యులైనవారికి ఆరునెలల వరకు జైలుశిక్ష వేయడం అసంబద్ధమైన నిర్ణయమని నిపుణులు వాపోతున్నారు.

వివాదం ఏర్పడితే  రైతులకు చిక్కులే

ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు, సాగుదారులు 80శాతం మంది ఉన్నారు. చిన్న కమతాలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి స్థానిక సివిల్‌ కోర్డులకు వెళ్లే వెసులుబాటు లేదు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(టీఆర్‌వో), ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ అధికారులు(ఎల్‌టీఏవో) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు హైకోర్టు స్థాయిలో అధికారుల ఆదేశాలను సవాల్‌ చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న వారిని వెంటాడుతోంది. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములు, ఆస్తులు, దుకాణాలు ఇలా ఎలాంటి స్థిరాస్తులైనా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి పరిధిలోనే ఉంటాయి. టీఆర్‌వో, ఎల్‌టీఏవోలను రాష్ట్ర స్థాయిలో అథారిటీ నియమిస్తుండడం, ఇందుకు ఎలాంటి విధానాలు అనుసరిస్తారో స్పష్టత లేకపోవడంతో న్యాయవర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

తెనాలిలో న్యాయవాదుల రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలుపుతున్న నాదెండ్ల మనోహర్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (పాతచిత్రం)

ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022పై వారం రోజులుగా రాష్ట్రంలో చర్చ జరుగుతుండడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు నెలలకుపైగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేసినా ప్రభుత్వం దిగిరాలేదు. ప్రజలకు కూడా అవగాహన లేక ఇది న్యాయవాదులకు సంబంధించిన అంశమని మిన్నకుండిపోయారు. అయితే ఈ చట్టం విధివిధానాలను అధ్యయనం చేసిన విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, మేధావులు చర్చావేదికలు నిర్వహించడం, ప్రతిపక్ష పార్టీలు చట్టం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో అందరూ అప్రమత్తమయ్యారు. చట్టాన్ని తెలుగులోకి అనువాదం చేసి విస్తృత ప్రచారంలోకి తీసుకురావడంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. చట్టంలో అనేక అంశాలు ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉండడంతోపాటు భవిష్యత్తులో అనేక సమస్యలకు మూలకారణాలవుతాయన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. దీంతో రోజురోజుకు ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం హక్కుదారుల వద్ద ఉన్న పత్రాల ఆధారంగా వారి ఆస్తులను నిర్ధారించుకోవాల్సి రావడంతో అత్యంత ప్రతికూలమైన అంశంగా చెబుతున్నారు. అంతేకాకుండా ఆస్తుల వివరాలు వెబ్‌సైట్‌లో పెడితే ప్రజలే చూసుకుని నిర్ణీత కాలంలో అభ్యంతరం తెలియజేయడం అనేది పెద్ద సవాలుగా మారనుంది. అదేవిధంగా స్థానిక న్యాయస్థానాల్లో వివాదాలు పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడం సామాన్యులకు శాపంగా మారింది.

ఆ రిజిస్టర్‌లో నమోదైతే తలనొప్పే

ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఒక వ్యక్తి ఆస్తులపై అభ్యంతరం చెబితే వాటిని వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికితోడు ఆస్తుల నిర్ధారణ, అప్పిలేట్‌ అధికారం కూడా రెవెన్యూ వర్గాలకు కట్టబెట్టడం వల్ల న్యాయం జరగని వారు హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. న్యాయపరిజ్ఞానం లేని రెవెన్యూఅధికారులు వివాద పరిష్కారాల సమయంలో తీసుకునే నిర్ణయం ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇలా సున్నితమైన ఎన్నో అంశాలు చట్టంలో హక్కుదారులకు ప్రతికూలంగా ఉన్నాయన్న నిపుణుల అభిప్రాయాలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రజల్లో విస్తృతమైన చర్చ పెట్టి ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చట్టాలను రూపొందించకుండా హడావుడిగా చేస్తే ఇలాంటి విపరిణామాలు ఎదురవుతాయని మేధావులు హెచ్చరిస్తున్నారు.


అవసరానికి ఆస్తి విక్రయించే పరిస్థితి ఉండదు

పెండ్యాల శ్రీకాంత్‌, రైతు సంఘ నాయుకుడు, పెదకాకాని

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం కారణంగా యజమాని తన అవసరానికి భూమి విక్రయించే పరిస్థితి ఉండదు. వారసత్వంగా వచ్చే ఆస్తులు సైతం ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి వివాదాల్లో ఉన్న భూములను టీఆరోవో తన ఇష్టం వచ్చిన వారికి కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి భూవివాదాలకు సంబంధించిన సివిల్‌ కేసులు జిల్లా స్థాయి కోర్టుల్లో వేసే అవకాశం లేకుండా కేవలం హైకోర్టుకు వెళ్లాలని ఉంది. హైకోర్టుకు వెళ్లే పరిస్థితిలో లేని సామాన్యుడు భూమిని వదులుకోవాల్సిందే. వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలి.


తీరని నష్టం 

కట్టా శ్రీహరిరావు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల ప్రజలందరికీ తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. మన భూమి మన కష్టార్జితం. తాత, తండ్రులు వారసత్వంగా ఇచ్చిన ఆస్తి. భూపత్రాలపై జగన్‌ ఫొటోలు పెట్టడం సరికాదు. అసలు పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటే.. అధికారులు, నాయకులూ కుమ్మక్కై ఆస్తిదారుడి పేరు మార్పు చేసే అవకాశముంది. ప్రభుత్వం వాటిని తనఖా పెట్టి రుణాలు సైతం తెచ్చుకోవచ్చు. హక్కుదారుడికి ఆ విషయం తెలిసే అవకాశం కూడా లేదు. వాటిపై బ్యాంకుల పెత్తనం ఉంటుంది. ఇది ఆస్తిదారుడికి ఆత్మహత్యతో సమానం.


భూమిపై హక్కు ఉండదు

బండారుపల్లి సత్యనారాయణ, సాతులూరు

జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో భూమిపై న్యాయపరమైన హక్కులు ఆస్తిదారుడికి ఉండవు. ఎవరైనా కావాలని కొర్రీ పెట్టినా కోర్టుకు వెళ్లలేం. జగన్‌ రెడ్డి నియమించిన అధికారి ఎదుటే మన వాదన వినిపించుకోవాలి. దీంతో వారసత్వంగా వచ్చిన భూమిపై హక్కు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అప్పు అవసరమై బ్యాంకుల్లోనో, వేరే వాళ్ల దగ్గరో తనఖా పెట్టాలంటే అసలు పత్రాలు ఉండవు. కాబట్టి అప్పు కూడా పుట్టదు. ఇది రైతులకే కాదు.. అందరికీ ఇబ్బందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని