logo

అరాచక నేతలను ఓటుతో తరిమికొట్టండి

‘ఇది మహనీయుల గడ్డ. ఎన్జీరంగా పుట్టిన ఈ నేలకు నమస్కరిస్తున్నా. చేనేత పితామహుడు ప్రగడకోటయ్య పుట్టిన ప్రదేశమిది.

Updated : 06 May 2024 06:36 IST

మహనీయులు పుట్టిన నేలకు నమస్కరిస్తున్నా
పొన్నూరు సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, పొన్నూరు

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభివాదం

‘ఇది మహనీయుల గడ్డ. ఎన్జీరంగా పుట్టిన ఈ నేలకు నమస్కరిస్తున్నా. చేనేత పితామహుడు ప్రగడకోటయ్య పుట్టిన ప్రదేశమిది. ఇంతటి ఉద్ధండుల గడ్డలో కేంద్ర మాజీ మంత్రి అల్లుడు రోశయ్య ఎమ్మెల్యేగా ఉండి ఐదేళ్లలో ఎర్రమట్టి మాటున రూ.2వేల కోట్లు దోచేశారు. తిరిగి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ డ్యాన్సుల మంత్రి సోదరుడు అంబటి మురళీ ఈసారి పోటీ చేస్తున్నారు. కులాలను రెచ్చగొడుతున్న ఆయనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని’ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వీరి గురించి ప్రస్తావించినప్పుడు కూటమి కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. ‘వైకాపా ప్రభుత్వం పొన్నూరును అభివృద్ధి చేయకపోగా పాడి రైతులకు అండగా ఉండి వారి ఉత్పత్తులను సంగం డెయిరీ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్రపై ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బంది పెట్టింది. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వ అరాచకాలను చూస్తూ ఉండబోం. కచ్చితంగా అధికారంలోకి రాగానే ఎవరైతే అరాచకంగా ప్రవర్తించారో వారి మక్కెలు విరగ్గొడతామని’ జనసేనాని హెచ్చరించారు.



సభలో పవన్‌కల్యాణ్‌ పక్కనే పెమ్మసాని, ధూళిపాళ్ల, అంబటి రాయుడు

ఒక్క అవకాశమిస్తే భ్రష్టుపట్టించారు..

‘వైకాపా నాయకులకు నన్ను తిట్టడం, బూతులు మాట్లాడటం.. సహజ సంపదను దోచుకోవడం తప్ప వారికి పాలన  చేతకాదు. ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ఒక్క పొన్నూరులోనే 12 ఎత్తిపోతల పథకాలను పక్కన పెట్టేసింది. దేవాలయ భూములను కొల్లగొట్టాలని చూశారు. చేబ్రోలులో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు చేశారని’ ఆయన ధ్వజమెత్తారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు. ‘ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడును జనసేనలో ప్రోత్సహిస్తాం. ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని’ స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామికి పూజలు చేయడానికి తమలపాకులతో వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు.

మహిళలు, యువతుల నినాదాలు

పోటెత్తిన జనకెరటం

పొన్నూరు సభకు హాజరైన జన సందోహం..

మండుటెండను సైతం లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు.. కమలనాథులు తరలిరావడంతో ఆదివారం పొన్నూరు పోటెత్తింది. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారసభ తెలుగు తముళ్లు, జనసైనికులతో హోరెత్తింది. సభకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. హెలీప్యాడ్‌ నుంచి ఐలాండ్‌ సెంటర్‌ వరకు రోడ్‌షో నిర్వహించగా అడుగడుగునా పవన్‌కల్యాణ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పెద్దఎత్తున మహిళలు తరలివచ్చారు. రోడ్‌షోలో దారి పొడవునా పూలుచల్లి స్వాగతించారు. నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా పవన్‌ కల్యాణ్‌ సభకు హాజరైనా ఎండను సైతం లెక్క చేయకుండా ఓపిగ్గా నిలబడి సభకు హాజరయ్యారు. పెద్దఎత్తున యువత, మహిళలు తరలిరావడంతో సభ విజయవంతమైంది. సభ ముగిసే వరకు జన సైనికులు నినాదాలతో హోరెత్తించారు.

అభిమానమే వెన్నుదన్ను


నిజాయతీకి సంతకం పవన్‌

పెమ్మసాని చంద్రశేఖర్‌, కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి  

మనిషి కష్టంలో ఉన్నప్పుడు చేయి అందించడం, భుజం తట్టడం ఆత్మబంధువు మాత్రమే చేయగలరు. అలాంటి ఆత్మ బంధువు, నీతి, నిజాయతీకి ఒక సంతకం నా అభిమాన నాయకుడు పవన్‌. ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారు. ఐదేళ్ల పాలనలో పోలవరం.. రాజధాని.. ఉద్యోగాలు లేవు. వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు నోరు తెరిస్తే కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.


వైకాపా నేతలు పద్ధతి మార్చుకోవాలి

ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, కూటమి పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి

జనసేన అధినేత ఓ మహాశక్తి. వైకాపా నేతలు దౌర్జన్యంతో పవన్‌ రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను ధ్వంసం చేసి ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆయన పర్యటన విజయవంతమైంది. ఇప్పటికైనా వైకాపా నాయకులు వారి పద్ధతులు  మార్చుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో పవన్‌ కల్యాణ్‌  సంఘీభావం తెలిపి వైకాపాను భూస్థాపితం చేస్తామని చెప్పి పోరాటం చేస్తున్నారు.


విజయంలో భాగస్వాములు కావాలి

అంబటి రాయుడు, మాజీ క్రికెటర్‌

జనసేన అధినేత పవన్‌ నాయకత్వంలో అందరూ ముందుకు సాగాలి. ఎన్నికల్లో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్‌, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే జనసేన అధినేత పవన్‌కు వేసినట్లుగా భావించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని