logo

నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్‌

పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్‌కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో  అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు.

Published : 07 May 2024 06:26 IST

అన్న క్యాంటీన్ల మూతతో అర్ధాకలితో నిరుపేదలు
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, న్యూస్‌టుడే, బృందం

పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్‌కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో  అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. అధికారంలోకి వచ్చాక తన వికృత ఆలోచనలకు పదునుపెట్టాడు.రూ.5కే అన్నక్యాంటీన్‌లో అందుబాటులో ఉండే భోజనాన్ని నిరుపేదలకు అందకుండా చేశాడు.

రిక్షా కార్మికులు, ఆటోవాలాలు, భవన నిర్మాణ కూలీలు, గ్రామాల నుంచి పనులపై వచ్చేవారు.. ఇలా ఎందరో 2019కు ముందు అన్నక్యాంటీన్లలో రూ.5కే ఆకలి తీర్చుకునే వారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆకలి తీరే అవకాశం దూరం చేశారు. అధిక ధరకు బయట భోజనం చేయకలేక ఇబ్బందులుపడ్డారు.

500 మంది భోజనం చేసేవారు..

ల్నాడు జిల్లాలో తెదేపా ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో 10 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. వాటిని శాశ్వత ప్రాతిపదికన నిర్వహించాలన్న సదుద్దేశంతో శాశ్వత భవనాలు కూడా నిర్మించారు. అందుకు ఒక్కో భవనం, అందులో ఫర్నిఛర్‌కు కలిపి రూ.40 లక్షల వ్యయం చేసింది. మొత్తం రూ.4 కోట్లతో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.15కు అందించారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో వండి వడ్డించే బాధ్యతను ఇస్కాన్‌ సంస్థలకు అప్పగించారు. నరసరావుపేటలో 3, చిలకలూరిపేటలో 3, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండలో ఒక్కోటి చొప్పున క్యాంటీన్లు పని చేశాయి. రోజుకు ప్రతి క్యాంటీన్‌లో 500 మంది వరకు భోజనం చేసేవారు. ఇది 2019 ఎన్నికల వరకూ సాగింది.


తెదేపా నేతలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి..

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తెదేపా నేతలే సేవాభావంతో క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు నిత్యం మధ్యాహ్న భోజనం అందించారు. రోజూ వందల మందికి ఉచితంగా అన్నం పెట్టారు. కూలి పనులు చేసుకునే వారికి ఎంతో ఉపశమనం కలిగించింది. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ వచ్చేవరకూ అన్న క్యాంటీన్లు నడిచాయి. కోడ్‌ రీత్యా ప్రస్తుతం నిలిపేయాల్సి వచ్చింది.


తెదేపాపై కక్షతో పథకానికి స్వస్తి  

వైకాపా పాలనలో..: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌లోని నిజస్వరూపం బయటపడింది. తెదేపా వ్యవస్థాపకుడి పేరుతో అన్న క్యాంటీన్లను మూసేశారు. మెరుగైన మెనూతో వైఎస్సార్‌ క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రజాప్రతినిధులు ఊదరగొట్టారు. తర్వాత క్యాంటీన్ల జాడేలేదు. నరసరావుపేటలో వైకాపా నేతలు అత్యుత్సాహంతో అన్న క్యాంటీన్లకు రంగులు మార్చి వైఎస్సార్‌ క్యాంటీన్‌ అని బోర్డులు కూడా మార్చారు. మార్కెట్‌ కూడలిలో ఉన్న క్యాంటీన్‌కు వేసిన రంగులు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. స్టేడియం వద్ద ఉన్న క్యాంటీన్‌ భవన ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగాయి.

చిలకలూరిపేటలో ఎన్‌ఆర్‌టీ సెంటర్‌, పురుషోత్తమపట్నం రోడ్డు, గడియారం స్తంభం కూడళ్లలో క్యాంటీన్‌ భవనాలు నిరుపయోగంగా మారాయి. వినుకొండ బస్టాండ్‌ సెంటర్‌లో క్యాంటీన్‌ను అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్లలో ఉన్న క్యాంటీన్లు నిరుపయోగంగా మారాయి.  


ససత్తెనపల్లిలో.. : కార్మికులు, కర్షకులు, శ్రామికులు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు తెదేపా ప్రభుత్వం సుమారు రూ.40 లక్షలు వెచ్చించి సత్తెనపల్లి పట్టణంలోని తాలుకా సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ భవనం నిర్మించింది. రోజులో 1500 మందికి భోజనం వడ్డించారు. శ్రామికులు, కార్మికులతో క్యాంటీన్‌ కళకళలాడేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాంటీన్‌ మూసేసి అన్నార్తుల నోటికాడ కూడు తీసేసింది.  


వైకాపాకు పుట్టగతులుండవు

- వెంకటేశ్వర్లు, నరసరావుపేట

అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేసిన వైకాపాకు రానున్న రోజుల్లో పుట్టగతులుండవు. ఆటోవాలాలు, కూలీ పనులకు వచ్చిన వారు, అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చిన రోగి బంధువులు ఇలా అనేక మంది పట్టణానికి వచ్చి రూ.100 పెట్టి అన్నం తినలేని వారు అన్నక్యాంటీన్లలో రూ.5 చెల్లించి కడుపునిండా తిన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు మూసి పెద్ద తప్పు చేసింది. పేదలపై పగ ఎందుకో అర్థం కాలేదు. వైకాపా నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పేదల ఆకలితీర్చితే మంచిది.  


దుర్మార్గంగా మూసేశారు

-శివారెడ్డి, మానుకొండవారిపాలెం

వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అధికారంలోకి రాగానే దుర్మార్గంగా మూసేసింది. పేదల పొట్ట కొట్టారు అన్న దానికి అన్న క్యాంటీన్ల మూసివేత నిదర్శనం. పనుల మీద పట్టణానికి వచ్చి మధ్యాహ్నం రూ.5కే నాణ్యమైన భోజనం తినేవాళ్లం. ఇప్పుడా  పరిస్థితి లేదు.


ముద్ద తీసేశారు

  -సీహెచ్‌ సుబ్బారావు, వినుకొండ

అన్న క్యాంటీన్లలో మధ్యాహ్నం భోజనం 300 నుంచి 400 మంది తినేవారు. అక్షయపాత్ర వారు వేడిగా అన్నం తెచ్చి పెట్టారు. రాత్రి 8.30 గంటలకే భోజనం అయిపోయేది. ఆహారం చాలా శుభ్రంగా ఉంది. పేదలకు చాలా మేలు జరిగింది. ఇది మూసివేయడం ఒకరకంగా నోటికాడ ముద్ద తీసినట్లే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని