logo

1, 2, 3... దూకేయ్‌

దర్గాకెళ్లి తిరిగొస్తుండగా.. పీకల్లోతు మత్తులో జోగుతున్న యువకుడు బ్యారేజీలోకి దూకి నీటమునిగి మృతిచెందాడు.

Published : 24 May 2024 03:55 IST

మద్యం మత్తులో ఉన్న యువకుడిని ప్రోత్సహించిన మిత్రులు
ఈదలేక నీట మునిగి పాతబస్తీ యువకుడి మృతి 

బ్యారేజీలోకి దూకుతున్న సాజిద్‌

కేశవగిరి, న్యూస్‌టుడే: దర్గాకెళ్లి తిరిగొస్తుండగా.. పీకల్లోతు మత్తులో జోగుతున్న యువకుడు బ్యారేజీలోకి దూకి నీటమునిగి మృతిచెందాడు. ఈ దుర్ఘటన ఈ నెల 19న కర్ణాటక రాష్ట్రం, కమలాపూర్‌ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలో జరిగింది. మృతుడు పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలోని జహంగీరాబాద్‌ వాసిగా గుర్తించారు. జహంగీరాబాద్‌ బస్తీకి చెందిన సయ్యద్‌ వాజీద్‌ అలియాస్‌ వాజీద్‌ గోటి(27), మహ్మద్‌ అఫ్రోజ్‌ అలియాస్‌ అఫ్ఫు కోమా(28), తాజుద్దీన్‌ అలియాస్‌ తాజు(26), సయ్యద్‌ సమీర్‌(25), మహ్మద్‌ సాజిద్‌(27)లు ఈనెల 18న రాత్రి ఆటోలో కర్ణాటక రాష్ట్రం కమలాపూర్, చెడుగుప్ప, చెంగటలోని మస్తానా ఖాద్రీ దర్గాలో ప్రార్థనలకు వెళ్లారు.

మునుగుతున్న సాజిద్‌ను చూస్తున్న స్నేహితులు

19న తిరుగు ప్రయాణంలో కమలాపూర్‌ తాలూకా, పటవాడ గ్రామం సమీపంలోని బ్రిడ్జికో, మిడ్‌వే సెయిల్‌ బ్యారేజీ వద్దకు వచ్చారు. అంతకు ముందే వీరంతా గంజాయి, మద్యం తాగి మత్తులో జోగుతున్నారు. బ్యారేజీలో దిగిన తాజుద్దీన్, అఫ్రోజ్‌లు ఈత కొడుతున్నారు. గట్టునే ఉన్న మహ్మద్‌ సాజిద్‌ మత్తులో కాలు నిలపలేని స్థితిలో ఈత కొడతాను అన్నాడు. తోటి స్నేహితుడు ఈత వస్తేనే నీటిలోకి దిగు లేకపోతే వద్దు అని వారించాడు... అయినా వినకుండా సాజిద్‌ నీటిలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు. తోటి స్నేహితుడు.. 1, 2, 3 అంటూ ఇక్కడి నుంచి దూకాలని ప్రేరేపించాడు. సాజిద్‌ దుస్తులతోనే నీటిలోకి దూకేశాడు. ఈత వచ్చినా.. మత్తులో ఈదలేక పోయాడు. గట్టున ఉన్న స్నేహితుడు ఒకరు  తాజుద్దీన్‌ను వారించాడు.

మహ్మద్‌ సాజిద్‌

అఫ్రోజ్‌ సైతం దగ్గరికి రమ్మంటూ పిలిచాడు.  చేతగాని స్థితిలో సాజిద్‌ నీటిలో మునిగిపోయాడు. పట్టుకునే అవకాశం ఉన్నా ఇద్దరు స్నేహితులు వెనుకంజవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గట్టున ఉన్న మరో స్నేహితుడు సాజిద్‌ను కాపాడండి.. మునిగిపోతాడు.. అంటూ బ్యారేజీ పక్కనే ఉన్న స్థానికులను బతిమాలాడు. అంతలోనే యువకుడు నీటిలో మునిగిపోయాడు.  కమలాపూర్‌ ఠాణా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని బయటికి తీశారు. సాజిద్‌కు ఈత వచ్చని.. అయినా నీటిలో మునిగి చనిపోయాడని, దీనిపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుని సోదరుడు మహ్మద్‌ రషీద్‌ కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని