logo
Updated : 27 Jun 2021 10:18 IST

AIG: కాలేయ మార్పిడి రోగికి అరుదైన గుండె శస్త్రచికిత్స

ఇంపెల్లా సాయంతో పూడికలు తొలగింపు

బైపాస్‌ అవసరం లేకుండానే సరిచేసిన వైనం

ఏఐజీ వైద్యుల బృందం అరుదైన ఘనత

చికిత్స నిర్వహించిన ఏఐజీ వైద్య బృందం

ఈనాడు, హైదరాబాద్‌: అతని వయస్సు 70 ఏళ్లు...2013లోనే కాలేయ మార్పిడి జరిగింది. దీనికితోడు మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత, కిడ్నీ సమస్యలు వేధిస్తున్నాయి. ఇంతలోనే గుండె రక్తం పంపింగ్‌ చేసే సామర్థ్యం కోల్పోయింది. నిమిషానికి 5 లీటర్ల పంపింగ్‌ నుంచి 2 లీటర్లకు తగ్గిపోయింది. దీంతో ఊపిరి తీసుకోవడం కష్టం కావడమే కాదు..ఛాతీలో తీవ్ర నొప్ఫి..నీరసంతో ఇటీవలే ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రిలో చేరారు.వైద్యులు ఈసీజీ, 2డీఇకో, యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన రక్త నాళాల్లో కాల్షియం, కొలెస్ట్రాల్‌ పూడికలు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు సాధారణంగా బైపాస్‌ సర్జరీ చేసి సరి చేయడం...లేదంటే యాంజియోప్లాస్టీ ద్వారా స్టంట్లు వేస్తారు. అయితే ఈ రోగి విషయంలో ఆ రెండు సాధ్యం కాదని తేల్చారు. గుండె పంపింగ్‌ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అరుదైన శస్త్ర చికిత్స విధానాన్ని అనుసరించారు. ఇందుకు అతి చిన్నదైన ఇంపెల్లా అనే హార్ట్‌పంపింగ్‌ యంత్రాన్ని ఉపయోగించారు. తొలుత దీనిని రోగి తొడ భాగంలోని రక్తనాళం ద్వారా గుండెలోని ఎడమ జఠరికలోకి చొప్పించి అమర్చారు. ఎడమ జఠరికలోని రక్తాన్ని బృహద్ధమని(అయోటా)లోకి పంపింగ్‌ చేసే బాధ్యతను ఈ యంత్రం నిర్వహిస్తుంది. ఇలా గుండె చేయాల్సిన ప్రక్రియను ఇంపెల్లా నిర్వహిస్తుంది. దీంతో శస్త్ర చికిత్స సమయంలో రోగి ప్రాణాలకు ఎలాంటి ముప్పు తలెత్తదు. ఇదే సమయంలో యాంజియోప్లాస్టీ ద్వారా రోగి గుండెలోని మూడు నాళాల్లో పేరుకున్న పూడికలు తొలగించి సరిచేశారు. అరుదైన ప్రక్రియ ద్వారా క్లిష్టమైన సర్జరీని విజయవంతం చేసి రోగి ప్రాణాలను కాపాడగలిగామని ఏఐజీ ఆసుపత్రి ఇంటర్‌వెన్షల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ ఉదయ్‌ కిరణ్‌ అన్నె శనివారం మీడియాకు తెలిపారు. ఇందుకు మూడు గంటల సమయం పట్టిందన్నారు. రక్త నాళాల్లోని పూడికలు తొలగించిన వెంటనే జఠరికలో అమర్చిన ఇంపెల్లాను తొలగించామన్నారు. దేశంలో చాలా తక్కువ ఆసుపత్రులు మాత్రమే ఈ విధానం అనుసరిస్తున్నాయని, అందులో ఏఐజీ ఒకటి అని అన్నారు. డాక్టర్‌ అంజు కపాడియా, డాక్టర్‌ రాజీవ్‌ మీనన్‌, డాక్టర్‌ స్వరూప్‌ బృందం కృషితో చికిత్స విజయవంతమైందని వివరించారు. సాధారణ యాంజియోప్లాస్టీ, బైపాస్‌ సర్జరీల కంటే ఇది కొంత ఖర్చుతో కూడుకున్న చికిత్స అని, అయితే ఇలాంటి రోగుల ప్రాణాలను కాపాడాలంటే ఇదే సరైన విధానమన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని