Ts News: కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో మార్కెట్: నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్: కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో మార్కెట్ ఏర్పాటు చేయనున్నామని.. డీపీఆర్ రాగానే సీఎం ఆమోదం తర్వాత చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్ మార్కెటింగ్ కార్యాలయంలో మార్కెటింగ్, ఉద్యాన శాఖ, వేర్ హౌసింగ్, మార్క్‌ఫెడ్, హాకా సంస్థలపై మంత్రి సమీక్షించారు. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని మార్కెట్లలో వసతులు కల్పించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. పప్పు గింజలు, నూనె గింజలు అధికంగా సాగు చేయాలని మార్కెట్ రీసెర్చ్ అనాసలిస్ విభాగం సూచించిందని మంత్రి పేర్కొన్నారు.
‘‘ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలి. రైతు వేదికల్లో అన్నదాతలకు సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచాం. వరంగల్, ఖమ్మంలో మిరప ట్రేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. యాసంగి సాగుకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు ముఖ్యంగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వివరాలు నిత్యం తెప్పించుకొని అధికారులు పర్యవేక్షించాలి. హాకా పటిష్టతకు అధికారులు కార్యాచరణ రూపొందించాలి. వివిధ ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలకు నిత్యావసర వస్తువులు సరఫరా దిశగా హాకా ఆలోచించాలి. ఆ దిశగా వెంటనే దృష్టిసారించి నివేదిక తయారు చేయాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏడాదికి 20వేల మెట్రిక్ టన్నుల శ్రీగంధానికి డిమాండ్ ఉంది. శ్రీగంధం సాగు వైపునకు రైతులను ప్రోత్సహించాలి. అవసరమైతే శ్రీగంధం అమ్ముకొనేందుకు అటవీ నిబంధనలు సరళతరం చేస్తాం’’ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.