logo
Published : 24 May 2022 02:35 IST

వ్యర్థానికి అర్థం..!

 గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో కంపోస్ట్‌ తయారీ

 రైతులకు ఉచితంగా పంపిణీ

కంపోస్టు డబ్బా

ఈనాడు, హైదరాబాద్‌: వ్యర్థానికి అర్థం చెబుతున్నాయి నగరంలోని కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు. రోజూ ఉత్పత్తి అవుతున్న తడి వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చి పునర్వినియోగంపై దృష్టి పెడితే, మరికొన్ని ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్ల ద్వారా ఎరువుగా మార్చి వినియోగించడంతో పాటు రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. సగటున 500 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతంలో రోజూ 400 కేజీల తడి చెత్త ఉత్పత్తి అవుతుంది. వీటిని సేకరించడం, విడదీయడం, ఎరువుగా మార్చే ప్రక్రియను చేపడుతున్నారు. సైబరాబాద్‌ పరిధిలోని అపర్ణ సైబర్‌ లైఫ్‌, అపర్ణ సైబర్‌ కమ్యూన్‌, మైహోమ్‌ జ్యువెల్‌, నాగార్జున రెసిడెన్సీ, ఎన్‌సీసీ అర్బన్‌ గార్డెనియా వంటి సొసైటీల్లో ఈ పద్ధతులను అవలంబిస్తున్నారు. మొత్తం 80 గేటెడ్‌ కమ్యూనిటీలు, హౌజింగ్‌ సొసైటీలతో కలిసి వ్యర్థాల రీసైక్లింగ్‌పై పని చేస్తున్నాయి. గచ్చిబౌలిలో నాగార్జున రెసిడెన్సీలో మొత్తం 400 ఫ్లాట్స్‌ ఉండగా రోజూ 450కేజీల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ వ్యర్థాల సేకరణకు ఆకుపచ్చ రంగు, నీలం రంగు, ఎరుపు రంగుల డబ్బాలను కమ్యూనిటీలోని వారందరికీ పంచుతారు.  ఆకుపచ్చ డబ్బాల్లో వంటగది వ్యర్థాలు, వండిన ఆహారం, మిగిలిన ఆహారం, కోడిగుడ్ల పొట్టు, పాడైన కూరగాయలు, పండ్లు, టీ బ్యాగ్‌లు, ఎండిపోయిన ఆకులు, పువ్వులు సేకరిస్తే. నీలం రంగు డబ్బాలో డ్రైవేస్ట్‌...కాగితాలు, మెటల్‌ క్యాన్‌లు, గ్లాస్‌, రబ్బర్‌, థర్మకోల్‌, వెంట్రుకలు, చెక్కపొట్టు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, ఎరుపు రంగు డబ్బాలో శానిటరీ వ్యర్థాలు, నాప్‌కిన్‌లు, బ్యాండేజీలు, టిష్యూలు, రేజర్‌ బ్లేడ్లు, సిరంజీలు, ఇంజెక్షన్‌ వయల్స్‌, నిర్మాణ వ్యర్థాలు, పగిలిన అద్దాలు సేకరిస్తారు. ఇతర అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు.

పక్కాగా నిబంధనల అమలు
-హరిప్రసాద్‌, నాగార్జున రెసిడెన్సీ, గచ్చిబౌలి

కొందరు యంత్రాల ద్వారా కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు. మేము నాలుగేళ్లుగా సహజ పద్ధతినే అవలంబిస్తున్నాము. ఫ్లాట్లలో వ్యర్థాల సేకరణకు సంబంధించి పనివాళ్లకు శిక్షణ ఇచ్చాము. మూడు నెలలకోసారి అద్దె ఇళ్లలో ఉండేవారు ఖాళీ చేయడం కొత్తవారు రావడం పరిపాటి. వారికి దీనిపై  అవగాహన కల్పిస్తాము. కొత్త బిన్‌లను అందిస్తాము. మధ్యాహ్నం 1గంటకు చెత్త మొత్తం సెల్లార్‌లో ఉన్న సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు వస్తుంది. అక్కడి ష్రెడర్‌ మెషీన్‌లో తడి వ్యర్థాలను పంపి ముక్కలుగా చేసి వాటిని మళ్లీ 40 ట్రేలలో ఉంచుతాము. వాటిని మరో బిన్‌లోని లేయర్లుగా నింపుతాము. వాసన రాకుండా ఉండేందుకు కొబ్బరిపీచు పొడి, ఆకులు, ఉంచుతాము. అవి తడినంతటినీ లాగేస్తాయి. 40 రోజులపాటు 70డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఉంచి పరిశీలిస్తుంటాము. అనంతరం ఆ బిన్‌ను ఖాళీ చేసి రెండు రోజులు ఎండబెడితే కంపోస్ట్‌ ఎరువు తయారైపోతుంది. దానిని కమ్యూనిటీలోని గార్డెన్‌లో వినియోగించి.. మిగిలింది ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను వెండార్లకు విక్రయిస్తుంటాము.  

 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని