logo

తీగ తెగి.. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి

ఇంటి ఆవరణలో కింద పడిన విద్యుత్తు తీగను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి దర్మరణం పాలైన సంఘటన గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. మండలంలోని

Updated : 27 May 2022 03:32 IST

చేర్యాల, న్యూస్‌టుడే: ఇంటి ఆవరణలో కింద పడిన విద్యుత్తు తీగను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి దర్మరణం పాలైన సంఘటన గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. మండలంలోని గౌరాయపల్లికి చెందిన తాడూరి బలరాం(55) శుభకార్యాలకు బాజా కొడుతుండటం వృత్తిగా చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఈదురు గాలులకు ఇంటి ఆవరణలో ఉన్న శౌచాలయంలో విద్యుత్తు దీపం కోసం బిగించిన తీగ తెగి కింద పడిపోయింది. దాన్ని గమనించకుండా బలరాం గురువారం మధ్యాహ్నం కింద పడి ఉన్న తీగను తొక్కాడు. విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


రైలు ఢీకొని మహిళ దుర్మరణం.. మరొకరికి గాయాలు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను రైలు ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం కేరూర్‌ గ్రామానికి చెందిన సంగీత(30), కాంచమణి(28) కుటుంబ సభ్యులతో కలిసి గుండ్లపోచంపల్లిలో ఉంటూ స్థానికంగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు బుధవారం సాయంత్రం కంపెనీ నుంచి ఇంటికొచ్చేందుకు గుండ్లపోచంపల్లి-మేడ్చల్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని సంగీత అక్కడికక్కడే మృతి చెందగా, కాంచమణి స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని