logo

పదిలో బాలికలదే పై చేయి

పదో తరగతి ఫలితాల్లో గతంలో మాదిరిగానే బాలికల హవా కొనసాగింది. 2021-2022 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం

Published : 01 Jul 2022 03:53 IST

జిల్లాకు 24వ స్థానం
గతం కంటే పెరిగిన ఉత్తీర్ణత

వికారాబాద్‌ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థునులకు సన్మానం

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో గతంలో మాదిరిగానే బాలికల హవా కొనసాగింది. 2021-2022 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన పదో తరగతి ఫలితాల కన్నా, ఈసారి కాస్తా మెరుగైన ఫలితాలను దక్కించుకుంది. 2019-20, 2020-2021 విద్యా సంవత్సరం కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే అందరిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఈ సారి మేలో విద్యార్థుల వెసులుబాటుకు కేవలం ఆరు పరీక్ష పత్రాలతోనే నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు 329 ఉన్నాయి. 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరాసరి ఒక్కో  కేంద్రాన్ని 200 మందికి కేటాయించారు.

పరిగి: పరిగి మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు గురుకులాలు, ఇతర విద్యా సంస్థల నుంచి మొత్తం 973 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 801 మంది ఉత్తీర్ణులయ్యారు. మండల వ్యాప్తంగా 11 ఉన్నత పాఠశాలల్లో రాపోల్‌ పాఠశాల నూరు శాతం సాధించింది.

బషీరాబాద్‌: బషీరాబాద్‌ మండలంలో 13 ఉన్నత పాఠశాలలకు 581 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 513 మంది పాసయ్యారని విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. మైల్వార్‌ ఉన్నత పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత సాధించారు.  

దౌల్తాబాద్‌: మండలంలోని  ఏడు ఉన్నత పాఠశాలల్లో 94శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి వెంకటయ్య తెలిపారు. మండలంలోని చంద్రకల్‌, కుదురుమల్ల ఉన్నత పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు పాసయ్యారు.
వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.  

బొంరాస్‌పేట: మండలంలోని బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల,  బురాన్‌పూర్‌ బీసీ బాలికల గురుకుల విద్యాలయం, చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాలలోని ఆంగ్లమాధ్యమం, దుద్యాల ఉన్నత పాఠశాల ఆంగ్లమాధ]్యమంలో  వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.

పెద్దేముల్‌: పెద్దేముల్‌ మండలంలో 94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కందనెల్లి ఆంగ్ల మాధ్యమం, ఇందూరు ఉర్దూ పాఠశాల, అడ్కిచర్ల ఉన్నత పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి.

నవాబ్‌పేట: మండలంలోని అక్నాపూర్‌, చించల్‌పేట, గంగ్యాడ, నారెగూడ ఉన్నత పాఠశాలల్లో శతశాతం పాసయ్యారు.

తాండూరుగ్రామీణ: తాండూరు మండలం కరణ్‌కోట, బెల్కటూరు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.  

ధారూర్‌: ధారూర్‌ బాలికల ఉన్నత పాఠశాల, కెరెల్లి ఉన్నత పాఠశాలల్లో 100 శాతం ఉతీర్ణత సాధించాయి.

కొడంగల్‌ గ్రామీణం: మండలంలోని బీసీ బాలుర గురుకుల విద్యాలయంలో 77 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు.  

కుల్కచర్ల: మందిపల్‌, చాకల్‌పల్లి పాఠశాలలు శతశాతం ఫలితాలను సాధించాయి.

యాలాల: యాలాల మండలం 86.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాస్నం ఉన్నత పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత సాధించింది.

12,863 విద్యార్థులు ఉత్తీర్ణత
పదో తరగతి పరీక్షలో మొత్తం 14,226 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 12,863 మంది ఉత్తీర్ణత సాధించారు. 90.42 శాతంగా నమోదైంది. బాలురు 7,180 మందికి 6,265 మంది ఉత్తీర్ణులై 87.26 శాతం, బాలికలు 7,046 మందికి  6,598 మంది ఉత్తీర్ణులై 93.64 శాతం నమోదైందని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి తెలిపారు. ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఆమె అన్నారు.

మైనార్టీ గురుకుల పాఠశాలలో శతశాతం
వికారాబాద్‌ శివారెడ్డిపేట మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థినులు శత శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఈ పాఠశాలలో 40 మంది బాలికలు పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్యరెడ్డి తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను శాలువాతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని