logo

పిల్లల ఆరోగ్యం..పుష్టికి శ్రీకారం

‘పోషక లోపాలులేని చిన్నారుల జిల్లా’గా తీర్చిదిద్దేందుకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ అమలుకు సన్నద్ధమయ్యారు. బాలల్లో పోషణ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో

Published : 12 Aug 2022 04:46 IST

పోషక లోప నివారణకు కసరత్తు
ప్రత్యేక యాప్‌లో నమోదుకు ఆదేశాలు  

అల్లాపూర్‌ కేంద్రంలో బరువును పరిశీలిస్తున్న ఎల్లమ్మ

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: ‘పోషక లోపాలులేని చిన్నారుల జిల్లా’గా తీర్చిదిద్దేందుకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ అమలుకు సన్నద్ధమయ్యారు. బాలల్లో పోషణ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాట్లోకి తెచ్చారు. నాలుగు నెలల్లో లక్ష్యం చేరేందుకు ఖరారు చేశారు. ఈనేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.  

రాష్ట్రస్థాయి కార్యాచరణ

అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో పోషణ లోపాల్ని అధిగమించేందుకు రాష్ట్ర స్థాయిలో కార్యాచరణను స్త్రీ శిశు సంక్షేమ శాఖ రూపొందించింది. దాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద తొలుత జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అమలు చేసింది. అక్కడ విజయవంతం కావడంతో తాజాగా వికారాబాద్‌తోపాటు మరో 8 జిల్లాల్లోనూ అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. నూతన పథకం అమలుపై జిల్లాలోని ఐసీడీఎస్‌ పర్యవేక్షకులు, సీడీపీఓలకు హైదరాబాద్‌లో, అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు నియోజకవర్గాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు గతనెలలో నిర్వహించారు.

ఉచిత వసతి సదుపాయాలు  

రెండు నెలల ప్రత్యేక కార్యాచరణ ద్వారా పోషక లోపాల్ని నిర్మూలించని బాలలను తాండూరు మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఎన్‌ఆర్‌సీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ 15 రోజులపాటు వైద్యులు పర్యవేక్షించి ఆరోగ్యపరమైన సమస్యలను గుర్తిస్తారు. లోపాలను సరి చేసేందుకు అవసరమైన వైద్యంతోపాటు బొమ్మల ద్వారా వ్యాయామం చేయిస్తారు.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం..

అంగన్‌వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమం (ఎస్‌ఎస్‌ఎఫ్‌టీ) అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలల ఎత్తు, బరువును పరిశీలించి సాధారణంగా ఉన్న వారిని నార్మల్‌, పోషక లోపం ఉన్నవారిని మ్యాన్‌, తీవ్ర పోషక లోపాలున్న వారిని శామ్‌ గ్రేడ్‌గా గుర్తించనున్నారు. వీరందరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ప్రకారం పోషకాలను అందిస్తారు.

* సాధారణ పిల్లలకు అందించే గుడ్డు, బాలామృతం, మధ్యాహ్న భోజనం, చిరుతిళ్లతోపాటు పోషక లోపాలున్న పిల్లలకు అందించనున్నారు. అదనంగా బాలామృతం ప్లస్‌ను ఇస్తారు.  

* మ్యాన్‌ గ్రేడ్‌లో ఉన్న వారికి ఎనిమిది వారాలపాటు రోజులకు రెండు పూటలు, శామ్‌ గ్రేడ్‌లో ఉన్న వారికి 16 నెలలపాటు రోజుకు నాలుగు సార్లు నిర్దేశించిన మోతాదు మేరకు తిన్పిస్తారు.  ః పోషక విలువలతో కూడిన బాలామృతం ప్లస్‌ను అందించే పిల్లల్లో వారం వారం ఎత్తు, బరువును పరిశీలించి ప్రభుత్వం పంపిణీ చేసిన చరవాణిల ద్వారా ఆన్‌లైన్‌ యాప్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు పొందుపరుస్తారు.


చక్కటి బాలలుగా తీర్చిదిద్దుతాం
- లలితకుమారి, జిల్లా అధికారిణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ  

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో పోషక లోపాలు లేనివారిగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నాం. తీవ్ర పోషక లోపం ఉన్న 699మందితోపాటు ఉన్నవారితోపాటు పోషక లోపం ఉన్న వారికి గుర్తించారు. వారికి డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేకంగా తయారు చేసిన బాలామృతం ప్లస్‌ను అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని