logo

37 ఎకరాలు..1500 కోట్లు

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు చెందిన గచ్చిబౌలిలో అత్యంత విలువైన భూమిని మరోసారి వేలం వేయబోతున్నారు

Updated : 27 Nov 2022 11:28 IST

వేలానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ స్థలం

గచ్చిబౌలిలోని భూమి

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)కు చెందిన గచ్చిబౌలిలో అత్యంత విలువైన భూమిని మరోసారి వేలం వేయబోతున్నారు. ఈసారి 37 ఎకరాలను విక్రయించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది. తద్వారా రూ.1500 కోట్ల ఆదాయం రాబట్టుకోవచ్చనేది అంచనా.

బిడ్డర్ల కోరిక మేరకు..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమి నగదీకరణ విధానాన్ని అనుసరించి దేశంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన భూములను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా మొదటి దశలో ఆరు స్థిరాస్తులను గుర్తించారు. ఇందులో గచ్చిబౌలి ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిలో తొలుత 11 ఎకరాలను బిడ్డింగ్‌ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. అప్పట్లో కనీస మొత్తం రూ.402 కోట్లుగా నిర్ణయించారు. వందకోట్ల నెట్‌వర్త్‌ ఉన్న బిడ్డర్లే పాల్గొనాలనే షరతులు పెట్టారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (డీఐపీఏఎం) ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా బిడ్డర్లను ఆహ్వానించారు. స్పందన అంతగా రాలేదు. నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని బిడ్డర్లు కోరారు. 11 ఎకరాలు తక్కువ విస్తీర్ణం కావడంతో మరింత ఎక్కువ భూమి కావాలని సూచనలు వచ్చాయి. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ల్యాండ్‌ మానిటైజేషన్‌ కమిటీ 37 ఎకరాలను తదుపరి బిడ్డింగ్‌లో విక్రయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌ కె.వి.ఎన్‌.రావు వెల్లడించారు. హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న మిగతా భూములను దశలవారీగా విక్రయించే అవకాశం ఉంది.
పునరుజ్జీవం 2.0కి..   భూముల విక్రయం, లీజింగ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుజ్జీవం 2.0కి వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో నెట్‌వర్క్‌ విస్తరణపై ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 4జీ నెట్‌వర్క్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు 4జీ టవర్లను రాష్ట్రవ్యాప్తంగా 4100 ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాద్‌లో కొత్తగా 532 టవర్లు రాబోతున్నాయి.

లీజుకు పలు భవనాలు..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు పెద్ద ఎత్తున స్థిరాస్తులు ఉన్నాయి. కార్యాలయాల భవనాలు, క్వార్టర్లు ఉన్నాయి. వీటిని లీజ్‌కు ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు లీజుకు తీసుకొన్నాయి. ఆదర్శ్‌నగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనంలో నాలుగు అంతస్తులను ఆదాయపన్ను శాఖ లీజుకు తీసుకుంది. జీఎస్‌టీ విభాగం సైతం చర్చలు జరుపుతోంది. ప్రాథమికంగా సిటీలో 1.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల భవనాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. వీటిలో ఈ ఏడాది 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని