logo

కట్టారు.. వదిలేశారు.!

రైతులకు సాగులో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అవసరం. ఇందుకోసం ఐదు, ఆరు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ‘రైతు వేదిక’ల నిర్మాణాలకు మూడు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు.

Published : 06 Dec 2022 02:21 IST

నిరుపయోగంగా రైతు వేదికలు
న్యూస్‌టుడే, పెద్దేముల్‌

గోపాల్‌పూరులో పిచ్చిమొక్కల మధ్య వృథాగా..

రైతులకు సాగులో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అవసరం. ఇందుకోసం ఐదు, ఆరు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ‘రైతు వేదిక’ల నిర్మాణాలకు మూడు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు.

గ్రామానికి దూరంగా వాటి నిర్మాణం చేపట్టడంతో అన్నదాతలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. అధిక శాతం నేటికీ ప్రారంభానికి నోచలేదు. వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉన్నా సమావేశాలు జరగడం లేదు.

రూ.21.34 కోట్లతో 97 నిర్మాణాలు

జిల్లాలోని 97 క్లస్టర్లలో ఒక్కొక్కటి చొప్పున 97 రైతు వేదికలను నిర్మించారు. ఒక్కో దానికి రూ.22 లక్షల చొప్పున  జిల్లాలో రూ.21.34 కోట్ల నిధులను వెచ్చించారు. చాలా చోట్ల బిల్లులు అందక ఇబ్బంది పరిస్థితులు నెలకొన్నాయి. నెలకు ఒకసారి కూడా సమావేశాలు జరగడం లేదు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..

రైతు వేదికల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటివి లేనే లేవు. మహిళా ఏఈవోలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఊరికి దూరంగా ఉండటంతో పశువుల కాపరులు, పోకిరీలు ధ్వంసం చేస్తున్నారు. రాత్రి సమయంలో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. విలువైన సామగ్రి కనిపించకుండా పోతోంది.  

ఇదీ పరిస్థితి

* పెద్దేముల్‌ మండలంలో ఆరు క్లస్టర్లు ఉన్నాయి. ఆరు చోట్ల వీటిని నిర్మించారు. గోపాల్‌పూరులో అన్ని పనులు పూర్తి అయ్యాయి. బిల్లుల చెల్లింపు కాలేదని గుత్తేదారు దీన్ని అప్పగించలేదు. ఊరుకు దూరంగా ఉన్న వేదిక చెట్లు, పొదలతో దర్శనమిస్తోంది. మరుగుదొడ్లు పాడయ్యాయి. తట్టేపల్లిలో ప్రారంభానికి నోచుకోలేదు. నాణ్యత పాటించకపోవడంతో పలు చోట్ల దిమ్మెలకు సిమెంటు ఊడిపోతోంది.

* యాలాల మండల కేంద్రానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులు వచ్చినా రైతువేదిక ఇప్పటి వరకు ప్రారంభించక పోవడం గమనార్హం.

* తాండూరు మండలం ఐదు క్లస్టర్లు ఉన్నాయి. అంతారంలో నిర్మాణం పూర్తి అయినా వినియోగంలోకి రాలేదు.  

* బషీరాబాద్‌ మండలంలో ఇస్మాయిల్‌పూరు, ఖాసీంపూర్లలో నేటికీ వినియోగంలోకి రాలేదు.

యాలాల మండల కేంద్రంలో...


గుత్తేదారులకు డబ్బులు రావాల్సి ఉంది: నసీరుద్దీన్‌, మండల వ్యవసాయ అధికారి, పెద్దేముల్‌

గుత్తేదారులకు డబ్బులు రావాల్సి ఉంది. నిర్మాణాలు పూర్తయినా మాకు అప్పగించలేదు. చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని