logo

ఆవిష్కరణల కేంద్రంగా టీ హబ్‌ అద్భుతం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం టీ హబ్‌ అద్భుతంగా ఉందని వెస్టన్‌ ఆస్ట్రేలియా రాష్ట్ర అత్యవసర సేవలు, ఆవిష్కరణలు, డిజిటల్‌ ఎకానమి, వైద్య, పరిశోధన శాఖ మంత్రి స్టీఫెన్‌ డాసన్‌ అన్నారు.

Published : 27 Mar 2023 01:32 IST

టీ హబ్‌లో ఒప్పందం చేసుకున్న వివిధ సంస్థల ప్రతినిధులతో  స్టీఫెన్‌ డాసన్‌,  నషీద్‌ చౌదరి తదితరులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం టీ హబ్‌ అద్భుతంగా ఉందని వెస్టన్‌ ఆస్ట్రేలియా రాష్ట్ర అత్యవసర సేవలు, ఆవిష్కరణలు, డిజిటల్‌ ఎకానమి, వైద్య, పరిశోధన శాఖ మంత్రి స్టీఫెన్‌ డాసన్‌ అన్నారు. ఆదివారం ఆయన టీ హబ్‌ను సందర్శించారు. వెస్టన్‌ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడ్‌ కమిషనర్‌ నషీద్‌ చౌదరితోపాటు పలువురు ప్రతినిధులతో కూడిన బృందంతో ఆయన పర్యటించారు. టీ హబ్‌లో ఆవిష్కరణల తీరు, అంకుర సంస్థలు, వాటికి అందుతున్న మార్గదర్శనం, పెట్టుబడి, నిధుల సమీకరణ సహకారం వివరాలను తెలుసుకున్నారు. ఆయన సమక్షంలో ఆస్ట్రేలియా, నగరానికి చెందిన సంస్థలు మూడు ఒప్పందాలను చేసుకున్నాయి. టీ హబ్‌ చీఫ్‌ డెలివరీ ఆఫీసర్‌ అనిష్‌ అంటోని పాల్గొన్నారు.  

ఒప్పందాలు ఇవీ.. నాస్కాంకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ డీఎస్‌సీఐ, ఆస్ట్రేలియాకు చెందిన సైబర్‌ వెస్ట్‌ మధ్య అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఆ సంస్థలు ఆవిష్కరణలు, డిజైన్‌ కార్యశాలలు, పరిశ్రమల మధ్య సత్సంబంధాలకు రెండు సంస్థలు పరస్పరం నైపుణ్యాలు సద్వినియోగం చేసుకుంటాయి. ఆస్ట్రేలియా ఈడెత్‌ కోవన్‌ యూనివర్సిటీతోనూ ఆ సంస్థ చేతులు కలిపింది. పరిశోధన, విద్య, ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్‌, మార్కెటింగ్‌, హ్యాకథాన్‌ల నిర్వహణ, కార్పొరేట్‌ ఆవిష్కరణలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా రెండు సంస్థలు ప్రయోజనం పొందేలా భాగస్వామ్యం ఉంటుంది. వీ హబ్‌, సైబర్‌ వెస్ట్‌ చేతులు కలిపాయి. తద్వారా సైబర్‌ భద్రతలో స్థానిక, అంతర్జాతీయ వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేయడం, మహిళల నేతృత్వంలోని సైబర్‌ సెక్యూరిటీ అంకుర సంస్థలకు దన్నుగా నిలిచి వాటి వృద్ధికి కృషి చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని