logo

Hyderabad: పైవంతెనలు.. ఆపైన మెట్రో

ఇల్లు కట్టేటప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం మేడపై స్తంభాలు నిర్మించి వదిలేస్తారు. అప్పటికి అదనపు అంతస్తు వేసేందుకు నిధులు లేకనో.. నిజంగానే అవసరం లేకనో అలా చేస్తుంటారు.

Updated : 03 Jul 2023 09:00 IST

డబుల్‌ డెక్‌ ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం
ఈ విధానంలో సికింద్రాబాద్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు రెండు ప్రాజెక్టులు

నాగ్‌పుర్‌లో రెండు అంతస్తుల్లో నిర్మించిన వంతెన

ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లు కట్టేటప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం మేడపై స్తంభాలు నిర్మించి వదిలేస్తారు. అప్పటికి అదనపు అంతస్తు వేసేందుకు నిధులు లేకనో.. నిజంగానే అవసరం లేకనో అలా చేస్తుంటారు. భవిష్యత్తులో అవసరమైనప్పుడు సులువు అవుతుందని ముందుచూపుతో ఇలా చేస్తుంటారు. ఇదే ఇప్పుడు సిటీలో కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రభుత్వం చేయబోతుంది. భవిష్యత్తులో మెట్రోరైలు నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పైవంతెనతోపాటు మెట్రో స్తంభాలను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఇకపై ఎక్స్‌ప్రెస్‌వేలన్నీ డబుల్‌ డెక్‌లో నిర్మించబోతున్నారు.

ఇలా ఉంటుంది..

నగరంలో పలు చోట్ల పైవంతెనలను నిర్మించిన మాదిరే.. ఒక్కో వైపు మూడు వరుసలు చొప్పున మొత్తం ఆరు వరుసల్లో ఎక్స్‌ప్రెస్‌వేలు రానున్నాయి. పైన మెట్రో కోసం స్తంభాలను నిర్మిస్తారు. తొలుత ఈ స్తంభాలు నిర్మించి.. మొదటి అంతస్తులో ఫ్లైఓవర్‌ పూర్తిచేసి వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తారు. భవిష్యత్తులో నిధుల లభ్యత, అవసరాన్ని బట్టి పై అంతస్తులో వయాడక్ట్‌లతో మెట్రో ట్రాక్‌ నిర్మిస్తారు. నాగ్‌పుర్‌లో దేశంలో తొలిసారి ఈ విధంగా డబుల్‌ డెక్‌ ఫ్లైఓవర్‌ నిర్మించారు. హైదరాబాద్‌లో ఏకకాలంలో నిర్మించేందుకు నిధుల సమస్యగా ఉంది. అందుకే తొలుత ఫ్లైఓవర్‌.. ఆ తర్వాత నిధులు, అవసరాలకు అనుగుణంగా మెట్రోరైళ్లు వస్తాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆరే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

తొలుత ఎక్కడ?

* ఉత్తర తెలంగాణ నుంచి నగరంలోకి వచ్చే రెండు ప్రధాన మార్గాల్లో కంటోన్మెంట్‌ ప్రాంతంలోకి ప్రవేశించాక ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రెండు ఎక్స్‌ప్రెస్‌వేలను ఐదేళ్ల క్రితమే ప్రతిపాదించింది. అందుకు రక్షణ శాఖ అనుమతి, 150 ఎకరాల శాఖ భూమి బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.
* ప్యారడైజ్‌, తాడ్‌బండ్‌, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, కండ్లబోయ, ఓఆర్‌ఆర్‌ వరకు 18 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ వేని ఇదివరకు ప్రతిపాదించారు. ఇప్పుడు దీన్ని డబుల్‌ డెక్‌గా మారుస్తున్నారు. మెట్రో కోసం ఫ్లైఓవర్‌తోపాటు స్తంభాలు వేసి ఉంచుతారు.
* జేబీఎస్‌ నుంచి వెస్ట్‌మారేడుపల్లి, తిరుమలగిరి, లోతుకుంట, హకీంపేట, తూంకుంట, ఓఆర్‌ఆర్‌ వరకు 18 కి.మీ. డబుల్‌ డెక్‌ ఎక్స్‌ప్రెస్‌వేని చేపట్టనున్నారు. ఇక్కడ సైతం మూడు వరుసల ఎక్స్‌ప్రెస్‌తోపాటు మధ్యలో మెట్రో కోసం స్తంభాలు వేస్తారు.

బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌కు సవాల్‌..

తొలుత డబుల్‌ డెక్‌ ప్రతిపాదన బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు తీసుకొచ్చారు. అక్కడ ఇదివరకే మెట్రో ప్రతిపాదన ఉంది. ఆ తర్వాత ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు వచ్చాయి. రెండు ఒకేసారి డబుల్‌ డెక్‌లో చేయాలని నాగ్‌పుర్‌ వెళ్లి అధికారుల బృందం అధ్యయనం చేసినా కార్యరూపం దాల్చలేదు. అదే ఇప్పుడు మెట్రో నిర్మాణానికి సవాల్‌గా మారబోతుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఏడు పైవంతెనలున్నాయి. కొత్తగా మెట్రో వేయాలంటే వంతెనలు ఉన్న చోట్ల మళ్లీ ఆస్తుల సేకరణ చేయాలి. ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదనే సర్కారు డబుల్‌డెక్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని