logo

Hyderabad Metro: ఇన్నర్‌ అయ్యాకే.. ఔటర్‌ మెట్రో

మెట్రో రైలు కొత్త ప్రతిపాదనల్లో కొన్ని కీలక, రద్దీ మార్గాలకు చోటు దక్కలేదు. గతంలో సమగ్ర రవాణా అధ్యయనం(సీటీఎస్‌) అనంతరం మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన మార్గాలు మెట్రో మూడోదశలో కనిపించలేదు.

Updated : 14 Aug 2023 09:57 IST

విస్తరణ కార్యాచరణపై డిమాండ్లిలా
ఈనాడు, హైదరాబాద్‌

మెట్రో రైలు కొత్త ప్రతిపాదనల్లో కొన్ని కీలక, రద్దీ మార్గాలకు చోటు దక్కలేదు. గతంలో సమగ్ర రవాణా అధ్యయనం(సీటీఎస్‌) అనంతరం మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన మార్గాలు మెట్రో మూడోదశలో కనిపించలేదు. అవుటర్‌ లోపల మిగిలిన మార్గాల్లోనూ మెట్రో విస్తరించాలనే డిమాండ్లు ఒక్కోటిగా వస్తున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మార్గంలో మెట్రోను పూర్తి చేసి అవుటర్‌లో వేయాలనే సూచనలు వస్తున్నాయి.
హైదరాబాద్‌ మహా నగరం పరిధిలో 2041 నాటికి 321 కి.మీ. మెట్రో రైలు నెట్‌వర్క్‌ అవసరముంటుందని దశాబ్దం కిందటే లీ అసోసియేట్స్‌ సమగ్ర రవాణా నివేదిక(సీటీఎస్‌) పేర్కొంది. రవాణా మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలను సూచించింది. 2022 నుంచి 2031 నాటికి 175 కి.మీ. మెట్రో ఉండాలని అప్పట్లో నివేదికలో పేర్కొంది. వీటిలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. కొత్త మార్గాలు ఇటీవల ప్రకటించే వరకు కూడా గత ప్రతిపాదనలన్నీ అవుటర్‌ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నాయి.

ఇతర ప్రాంతాల్లో..

  • ఎంజీబీఎస్‌ నుంచి ఘట్‌కేసర్‌(23.2 కి.మీ.) గతంలో ప్రతిపాదన ఉంది. కొత్త ప్రణాళికలో ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌కు పొడిగించారు.
  • జేబీఎస్‌ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌(9.6 కి.మీ.) పాత ప్రతిపాదన ఉంది. దీనిపై తాజా ప్రణాళికలో ప్రస్తావించలేదు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది.
  • తార్నాక - కీసర - ఓఆర్‌ఆర్‌(19.6 కి.మీ.) ప్రతిపాదన ఉంది. ప్రస్తుతానికి ఈసీఐఎల్‌ వరకు మూడో దశలో ప్రతిపాదించారు.
  • నానక్‌రాంగూడ నుంచి బీహెచ్‌ఈఎల్‌ (13.7 కి.మీ.) ప్రతిపాదన ఉంది. ఇవేవీ మూడో దశ విస్తరణలో చేర్చలేదు.
  • ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో అవసరం ఉందని, ఈ మార్గంలో ట్రాఫిక్‌ రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు అంటున్నారు.

మిగతా  సగం వేస్తే..

ఏళ్ల కిందట నగరం చుట్టూ నిర్మించిన రింగ్‌రోడ్డు.. నగరం గ్రేటర్‌గా విస్తరణతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డుగా మారింది. బంజారాహిల్స్‌, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌, మెహిదీపట్నం మీదుగా తిరిగి బంజారాహిల్స్‌ రోడ్‌ నం1లో ఇన్నర్‌ ఈ రోడ్డు ఉంది. మొదటి దశలో నాగోల్‌ నుంచి గ్రీన్‌ల్యాండ్స్‌ వరకు మెట్రో వేశారు. మిగిలిన మార్గంలో  వేయాలనే అభ్యర్థనలు వస్తున్నాయి.

  • నాగోల్‌-ఎల్బీనగర్‌, ఎల్బీనగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు గతంలోనే ప్రతిపాదనలున్నాయి. రెండో దశలో నాగోల్‌-ఎల్బీనగర్‌ ఉన్నా, మిగిలిన రెండింటికి స్థానం కల్పించలేదు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఉన్న ఈ మార్గంలో రద్దీ పెరుగుతోంది. మెట్రో విస్తరణ ప్రణాళికలో దీన్నికూడా చేర్చాలని ఎంఐఎం నేత మంత్రి కేటీఆర్‌ను కలిసి కోరారు. పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు.
  • గత ప్రణాళికలో చాంద్రాయణగుట్ట నుంచి ఆరాంఘర్‌, రేతిబౌలి వరకు(16.1కి.మీ.) మెట్రో ప్రతిపాదన ఉంది.  ఇప్పటికే ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌వే ఉండటంతో ఆఖర్లో చేర్చారు. వాహనాల రద్దీ, నివాసాలు పెరుగుతుండటంతో మెట్రో అనుసంధానం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.


అవసరాన్ని బట్టి మిగతా మార్గాల్లోనూ..

గతంలో ప్రతిపాదించిన మెట్రో మార్గాలను విస్మరించడం ఉండదు. నగర, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు మారుతుంటాయి. పాతవాటిని మరింత మెరుగుపరుస్తుంటాం.

ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్‌ మెట్రోరైలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని