logo

‘సైనికుడైతే మాకేంటి.. లంచం ఇవ్వాల్సిందే..’

అతను దేశరక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడే కావచ్చు.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వొచ్చు.. అయితేనేం.. తహసీల్దార్‌ కార్యాలయంలో పని జరగాలంటే మాత్రం లంచం ఇవ్వాల్సిందే.. ఇచ్చేశాడు కూడా.. ఆ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 09 Mar 2024 06:38 IST

తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టిన జవాన్‌

కొందుర్గు, న్యూస్‌టుడే: అతను దేశరక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడే కావచ్చు.. అవసరమైతే దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వొచ్చు.. అయితేనేం.. తహసీల్దార్‌ కార్యాలయంలో పని జరగాలంటే మాత్రం లంచం ఇవ్వాల్సిందే.. ఇచ్చేశాడు కూడా.. ఆ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథ్‌పూర్‌  గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డి కశ్మీర్‌ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల  సెలవుపై స్వగ్రామానికి వచ్చిన ఆయన తన పొలానికి సంబంధించిన ఆర్‌ఓఆర్‌, పహాణీలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటికోసం కార్యాలయంలోని రికార్డు అసిస్టెంట్‌, మరో ప్రైవేటు వ్యక్తి రూ.40 వేలు అడిగారని సెల్ఫీ వీడియోలో తెలిపారు.

జవాన్‌నని డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా, అవి మాకు కాదు, పై అధికారులకు వెళ్తాయి ఇవ్వాల్సిందే అని చెప్పారన్నారు. విధుల్లో చేరేందుకు సమయం దగ్గర పడుతుండడంతో చేసేదేమీ లేక చివరకు రూ.30 వేలకు బేరమాడి, అవి ఇచ్చాకే తన పత్రాలు చేతికందాయని వాపోయారు. దీనిపై తాజాగా సెల్ఫీ వీడియో ద్వారా ఆ జవాను వివరాలు వెల్లడించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వీడియో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దీనిపై తహసీల్దార్‌ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూఆ సంఘటన జరిగినపుడు తాను సెలవులో ఉన్నానని, అందుకే తన దృష్టికి రాలేదన్నారు. రికార్డుల వ్యవహారం నాయబ్‌ తహసీల్దార్‌ చూసుకుంటారన్నారు. దీనిపై ఆయన వివరణ కోరి చర్యలు తీసుకుంటామని తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని