logo

కబేళా కథ.. మళ్లీ మొదటికి

జియాగూడలోని కబేళా అభివృద్ధి ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చింది. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయింది.

Published : 11 Mar 2024 04:20 IST

పీపీపీ ప్రాజెక్టును రద్దు చేసిన జీహెచ్‌ఎంసీ
సొంత నిధులతో అభివృద్ధికి మరో ప్రణాళిక

జియాగూడలోని మేకల మండి

ఈనాడు, హైదరాబాద్‌: జియాగూడలోని కబేళా అభివృద్ధి ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చింది. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయింది. పీపీపీ పద్ధతిలో స్థానిక వ్యాపారుల భాగస్వామ్యంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అనేక ప్రయత్నాలు చేసింది. ఏళ్ల తరబడి అక్కడ జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు, వ్యాపారులు, కార్మికులకు ప్రభుత్వ సంస్థతో అవసరమైన శిక్షణ, ధ్రువీకరణ పత్రాలను ఇప్పించింది. ఖర్చు భరించే విషయంలో స్థానిక వ్యాపారుల నిరాసక్తతతో పీపీపీ ప్రాజెక్టు రద్దయింది. ఉన్న కబేళాను అలాగే కొనసాగనివ్వండి లేదా మీరే భవనాలను నిర్మించండని స్థానికులు తేల్చి చెప్పడంతో.. సొంత నిధులతో పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ తాజాగా కొత్త ప్రణాళికను రూపొందించింది.

జియాగూడతో మూసీ కాలుష్యం

నగరానికి సరఫరా అయ్యే మాంసంలో జియాగూడ కబేళాలో రోజూ 6వేల జీవాలను వధిస్తారు. ప్రక్రియ మొత్తం నేలపై జరుగుతుంది. రక్తం మడుగులో, మట్టి నేలపై జంతువులను వధించి, చర్మాన్ని తొలగించడం వంటి పద్ధతులతో మాంసంపై క్రిములు చేరుతాయనేది వైద్యుల ఆందోళన. అశాస్త్రీయ పద్ధతుల్లో జంతువులను వధించి మాంసం దుకాణాలకు సరఫరా చేయడంతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. జంతు వ్యర్థాలను పక్కనే ఉన్న మూసీలో పడేయటంతో కాలుష్యం పెరుగుతోంది. ఆయా పరిస్థితులను రూపుమాపాలని గత సర్కారు జులై 4, 2018న రూ.42.5 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఆధునిక కబేళాను నిర్మించేందుకు పరిపాలనపరమైన అనుమతి ఇచ్చింది. అనంతరం ఇంజినీర్లు టెండరు ప్రక్రియను చేపట్టి, అనేకసార్లు స్థానికులతో టెండరు వేయించే ప్రయత్నం చేశారు. వ్యాపారులు ఖర్చు చేసేందుకు ముందుకు రాలేదు. బయటి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు ఇస్తామంటే స్థానికులు ఒప్పుకోలేదు. దాంతో ప్రాజెక్టును రద్దు చేశామని, సొంత నిధులతో పనులు చేపట్టే ప్రతిపాదనను సిద్ధం చేశామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

ఎలా కడతారంటే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంబర్‌పేట, బోయిగూడ, గౌలిపుర, రమ్నాస్‌పురప్రాంతాల్లో సుమారు రూ.30కోట్ల వ్యయంతో అంతర్జాతీయస్థాయి కబేళాల నిర్మాణం జరిగింది. అప్పట్లో భారత్‌నుంచి విదేశాలకు రకరకాల మాంసం ఎగుమతి అయ్యేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో కబేళాలు నిర్మించింది. అనంతరం కేంద్రంలో ప్రభుత్వం మారడం, విదేశాలకు మాంసం ఎగుమతులపై నిషేధంతో.. ఆయా యంత్రాలన్నీ మరుగున పడ్డాయి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని.. జియాగూడలో యంత్రాలు లేని కబేళాను నిర్మించాలని బల్దియా నిర్ణయించింది. ఎక్కడికక్కడ గదులు, నీటిని చిమ్మే పైపులైన్లు, వ్యర్థ జలాలను శుభ్రం చేసే కేంద్రాలను నిర్మించి.. ప్రజలకు నాణ్యమైన మాంసం సరఫరా అయ్యేలా ప్రణాళిక రూపొందించామని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.

జియాగూడ కబేళా ఇలా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, తమిళనాడు, కశ్మీర్‌ రాష్ట్రాలతో పాటు పాకిస్థాన్‌ నుంచి కూడా మేకలు, గొర్రెలు వేలాదిగా జియాగూడ మేకల మండికి వస్తుంటాయి.

  • మండి విస్తీర్ణం: 11ఎకరాలు
  • రోజూ జరిగే వధ: 6వేలు
  • నగరానికి సరఫరా అవుతోన్న మాంసంలోని వాటా: 80శాతం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని