logo

రేషన్‌ బియ్యంతో రక్తహీనతను అధిగమించొచ్చు: ఎన్‌ఐఎన్‌

రేషన్‌ బియాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారా...? అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్టే. కిలోకి రూ.10 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated : 11 Mar 2024 05:05 IST

రేషన్‌ బియాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారా...? అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్టే. కిలోకి రూ.10 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అవగాహన లేక కొందరు లబ్ధిదారులు ఫోర్టిఫైడ్‌ రేషన్‌ బియ్యాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నారు. దీంతో ‘ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత’ కల్పించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. పౌరసరఫరాల శాఖ గతేడాది ఏప్రిల్‌ నుంచి ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేపట్టి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రతినెలా 17లక్షల కార్డుదారులకు 40వేల టన్నులపైగా పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో ప్రతినెలా 10 నుంచి 15శాతం పేదల బియ్యం పక్కదారి పడుతోంది. దీనిని నియంత్రించేందుకు సోషల్‌ ఆడిట్‌(సామాజిక తనిఖీ) చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

అపోహలు వద్దు

చిన్నారులు, యుక్తవయస్కులు, గర్భిణుల్లో వరుసగా 67శాతం, 57శాతం, 52శాతం రక్తహీనత ఉన్నట్టు జాతీయ కుటుంబ సర్వే నివేదిక తెలపగా.. ఫోర్టిఫైడ్‌ బియ్యంతో ఈ సమస్యను అధిగమించొచ్చని ఎన్‌ఐఎన్‌ తెలిపింది. ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డా.హేమలత నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు ఒక శ్వేతపత్రాన్ని ఇటీవల విడుదల చేసింది. మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్‌ వరుసగా 13 మిల్లీగ్రాములు, 13.23 మిల్లీగ్రాములు, 14.35 మిల్లీగ్రాములు, 15.19 మిల్లీగ్రాములు గ్రహిస్తున్నట్టు తేల్చింది.

ఆహారం.. బలవర్థకం

పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు కలిపి ఆహారాన్ని బలవర్థకం చేయడాన్నే ఫోర్టిఫైడ్‌గా పరిగణిస్తారు. బియ్యాన్ని పిండిగా మార్చి.. దానికి ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి-12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి.. ఆ పిండిని బియ్యం రూపంలో కెర్నెల్స్‌గా మార్చుతారు. ప్రతి 99 కిలోల బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్‌ బియ్యం కెన్నెల్స్‌ కలుపుతారు. సంచులో  నింపి సనత్‌నగర్‌లోని ఎఫ్‌సీఐలో భద్రపరిచి.. రేషన్‌ దుకాణాలకు తరలిస్తున్నారు.

పోషకాలు ఎంతమేర కలుపుతారంటే..

  • 28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్‌(ఫెర్రిక్‌ పైరోపాస్పేట్‌) కలుపుతారు. లేదా దీనికి బదులు సోడియం ఐరన్‌ 14 నుంచి 25.25 మి.గ్రాములుకలుపుతారు.
  • 75 నుంచి 125 మి.గ్రా వరకు ఫోలిక్‌యాసిడ్‌ కలుపుతారు. దీంతోపాటు విటమిన్‌ బి12 కోసం హైడ్రాక్సైకోబాలమైన్‌ను ఇంతే మొత్తంలో కలుపుతారు. అదనంగా జింక్‌, విటమిన్‌ ఏ, థయమిన్‌, రైబోప్లావిన్‌, నియాసిన్‌, విటమిన్‌ బి6 పోషకాలు కలుపుతారు.
  • ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్య ఉండదు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే వీటిని హాస్టళ్లు, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో పంపిణీ చేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని