logo

Hyderabad: సెల్ఫ్‌ యాక్సిడెంట్‌ కేసుల్లో తొలిసారిగా రిమాండు

రోడ్డుపై ప్రయాణించే సమయంలో స్వీయ ప్రమాదాలకు (సెల్ఫ్‌ యాక్సిడెంట్‌) గురైతే వాటిని ఇన్నాళ్లూ పోలీసులు సర్వసాధారణ కేసులుగా పరిగణించేవారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే నోటీసిచ్చి పంపేవారు.

Updated : 14 Mar 2024 07:28 IST

‘కేస్‌ స్టడీగా’ తీసుకోనున్న పోలీసు శాఖ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రోడ్డుపై ప్రయాణించే సమయంలో స్వీయ ప్రమాదాలకు (సెల్ఫ్‌ యాక్సిడెంట్‌) గురైతే వాటిని ఇన్నాళ్లూ పోలీసులు సర్వసాధారణ కేసులుగా పరిగణించేవారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే నోటీసిచ్చి పంపేవారు. పశ్చిమ మండలంలోని జూబ్లీహిల్స్‌ ఠాణాలో జరిగిన రెండు స్వీయ ప్రమాద కేసుల్లో అయిదుగురు నిందితులను తొలిసారిగా రిమాండుకు పంపారు. ఈ రెండు కేసులను పోలీసు శాఖ ‘కేస్‌ స్టడీ’గా తీసుకుని, మిగిలిన అన్ని ఠాణాలకు ఇది వర్తింపజేసే విషయంపై దృష్టిపెట్టింది. ఇన్నాళ్లు సర్వసాధారణం అనుకున్న స్వీయ ప్రమాద కేసుల్లో తొలిసారిగా రిమాండు విధించడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 10న అర్ధరాత్రి దాటాక జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో ఓ కారు అదుపుతప్పి మధ్యవిభాగిని పైకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మల్లికార్జున్‌రెడ్డి, అతగి స్నేహితులు సంతోష్‌, అరవింద్‌లు మద్యం తాగిఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరో బాలుడు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై సెక్షన్‌ 336, 279, మోటారు వాహన చట్టం, ప్రజా ఆస్తుల నిరోధక చట్టం(పీడీపీపీ) కింద కేసులు నమోదుచేశారు. అదే రోజు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.2లో ఓ కారు వేగంగా వచ్చి మధ్యవిభాగినిని ఢీకొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి దాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో మలక్‌పేటకు చెందిన బీటెక్‌ విద్యార్థి మహమ్మద్‌ ఫర్హాన్‌ పాషా(20), తలాబ్‌కట్టకు చెందిన న్యాయవిద్యార్థి అనూష్‌ పెర్షద్‌(19)లపై 336, 279, 184 ఎంవీ చట్టం, పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదుచేశారు. ఈ రెండు ఘటనల్లో నిందితులను మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీసులు 17వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం, ప్రజా ఆస్తుల ధ్వంసం తదితర కారణాలను చూపుతూ పోలీసులు పక్కాగా నివేదికను సమర్పించారు. తద్వారా ఇతర వాహనదారులకు, పాదచారులకు ప్రమాదం వాటిల్లే ఆస్కారం ఉందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రిమాండు విధించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ నేపథ్యంలోనే వీరికి న్యాయమూర్తి రిమాండు విధించారు. మరో జువైనల్‌ (సీసీఎల్‌)ను డీపీఓ పర్యవేక్షణలో ఉండేలా చూడాలని తీర్పునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని