logo

ఖర్జూరాల విక్రయాల్లో నగరమే నంబర్‌ 1

రంజాన్‌ నేపథ్యంలో బేగంబజార్‌లో ఎండు పండ్లు, ఖర్జూరాల విక్రయ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటారు.

Updated : 27 Mar 2024 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌

రంజాన్‌ నేపథ్యంలో బేగంబజార్‌లో ఎండు పండ్లు, ఖర్జూరాల విక్రయ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటారు. హోల్‌సేల్‌గా విక్రయాలు చేస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల వాసులు బేగంబజార్‌కు వస్తుండటంతో ఈ ప్రాంతంలో మరింత రద్దీ కనిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ పలాస నుంచి వచ్చే ఖాజూ హోల్‌సేల్‌ ధరకే ఇస్తుండటంతో గిరాకీ పెరిగింది.

భారీగా అమ్మకాలు..

దేశంలోనే ఎక్కువగా ఖర్జూరాలను వినియోగించే నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు ఉంది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జూరాల విక్రయాలు ఇక్కడ సాగుతున్నాయి. రంజాన్‌ నేపథ్యంలో విక్రయాలు పెరిగాయి. వ్యాపార వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. వేర్వేరు దేశాల నుంచి ఖర్జూరాలను చెన్నై, ముంబయికి నౌకా మార్గాల్లో తీసుకొచ్చి.. అక్కడి నుంచి నగరానికి రవాణా చేస్తుంటారు. వీటితో పాటు అమెరికా నుంచి బాదం,  అరబ్‌ దేశాల నుంచి పిస్తా, వాల్‌నట్స్‌, అంజూర్‌, ఎండుద్రాక్ష, కుర్బానీ లాంటి ఎండు పండ్లు దిల్లీకి వచ్చి.. అక్కడి నుంచి ఇక్కడకు వస్తున్నాయి. ఖర్జూరాల్లో జహీదీ ఖర్జూరాలు కేజీ రూ.200 నుంచి రూ.400 ధర పలుకుతున్నాయి. కొనుగోలుదారుల ఖర్చు పెట్టే సామర్థ్యం బట్టి ఇరాన్‌, ఇరాక్‌, టునీషియా, జోర్డాన్‌, సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకున్న ఖర్జూరాలను కొనుగోలు చేస్తుంటారు. ప్రధానంగా ఖర్జూరాల్లో రాజుగా పిలిచే అజ్వా రకం కేజీ రూ.2,000 ధర పలుకుతోంది. ఇందులో అత్యధిక ఔషధ గుణాలుండటంతో.. ఒక్కొక్కరూ ఐదు కిలోల పెట్టెలను కొనుగోలు చేస్తుంటారని బేగంబజార్‌లోని వ్యాపారి రాజ్‌కుమార్‌ టండన్‌ తెలిపారు.

40 రకాలు..

నగరంలో ప్రస్తుతం 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తున్నారు. ఇందులో కిమియా, శుక్కారి, కుద్రీ, మరియమ్‌, మజాఫాతీ, కల్మీ, మష్రూక్‌, మేబ్రూమ్‌ రకాలను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. డ్రైఫ్రూట్స్‌ విషయానికొస్తే ఖాజు కిలో రూ.800 ఉంచి రూ.1,500 వరకు, బాదం రూ.800 నుంచి రూ.2,800, పిస్తా కేజీ రూ.1,000 నుంచి రూ.1,800, ఖర్జూరా కేజీ రూ.180 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. గతంతో పోల్చితే 10 నుంచి 20 శాతం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని